ఫోన్‌ కొనివ్వలేదని ఆత్మహత్య 

21 Aug, 2022 11:26 IST|Sakshi

రాయదుర్గం రూరల్‌: సెల్‌ఫోన్‌ కొనివ్వకపోవడంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన మేరకు.. రాయదుర్గం మండలం వేపరాలకు చెందిన హరిజన రమేష్‌ కుమారుడు యశ్వంత్‌ (18) ఇంటర్‌ వరకు చదువుకుని కూలి పనులతో తండ్రికి చేదోడుగా ఉంటున్నాడు. కొన్ని రోజులుగా తనకు సెల్‌ఫోన్‌ కొనివ్వాలంటూ తండ్రిని అడుగుతున్నాడు.

అయితే ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో తండ్రి కాలయాపన చేస్తూ వచ్చాడు. దీంతో మనస్తాపం చెందిన యశ్వంత్‌ శనివారం ఉదయం శ్మశాన వాటిక సమీపంలో క్రిమి సంహారక మందు సేవించాడు. గమనించిన స్థానికులు వెంటనే సమాచారం  అందించడంతో కుటుంబసభ్యులు హుటాహుటిన అనంతపురంలోని సర్వజనాస్పత్రికి తీసుకెళుతుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. తండ్రి రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ భాస్కర్‌ తెలిపారు.

యువకుడి దారుణ హత్య
గార్లదిన్నె: విధులు ముగించుకుని ఇంటికి బయల్దేరిన యువకుడు అదృశ్యమయ్యాడు. రెండు రోజుల తర్వాత విగతజీవిగా కనిపించాడు. ఎవరో హత్య చేసి.. గుర్తుపట్టకుండా శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టారు. ఈ ఘటన రామదాస్‌పేట సమీపంలో శనివారం వెలుగు చూసింది. వివరాలిలా ఉన్నాయి. కేశవాపురానికి చెందిన రాజేష్‌ (23) గార్లదిన్నె భారత్‌ గ్యాస్‌ కంపెనీలో హెల్పర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం విధులు ముగించుకుని ద్విచక్రవాహనంపై ఇంటికి బయల్దేరాడు. అయితే రాత్రి అయినా ఇంటికి చేరుకోలేదు.

మొబైల్‌కు ఫోన్‌ చేస్తే స్విచాఫ్‌ అని వస్తుండటంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు తమ కుమారుడు కనిపించకుండా పోయాడని శనివారం పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో రామదాస్‌పేట అటవీ ప్రాంతంలో ఓ యువకుడికి నిప్పంటించి చంపేసినట్లు సమాచారం అందింది. హుటాహుటిన పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  రెండు రోజుల కిందటే శరీరంపై పెట్రోలు పోసి తగులబెట్టి ఉంటారని భావిస్తున్నారు.

ఆనవాళ్లను బట్టి చనిపోయింది రాజేష్‌ అని తల్లిదండ్రులు తెలిపారు. సీఐ అస్రార్‌బాషా అటవీప్రాంతానికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. ఈ కేసుకు సంబంధించి ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో హత్య జరిగి    ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.  పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో తేలనున్నాయి. 

(చదవండి: మొబైల్‌ చార్జర్‌ మాదిరిగా ఉండే స్పై కెమెరాను అమర్చి..)

మరిన్ని వార్తలు