గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి! నేడు గిడుగు రామమూర్తి పంతులు జయంతి

29 Aug, 2023 10:24 IST|Sakshi

గిడుగు సాక్షిగా మరొక భాషోద్యమం రావాలి వ్యవహారిక భాష అనగానే మన మదిలో మెదిలేది గిడుగు వేంకట రామమూర్తి పంతులు. నాలుగు దశాబ్దాలకు పైగా వ్యవహారిక భాషో ద్యమం కోసం గ్రాంథిక వాదులతో అలు పెరగని పోరాటం చేశారు. వారు సలిపిన భాషోద్యమం అచ్చంగా అభ్యుదయ సమాజం కోసమే అని చెప్పాలి. నోటి మాటకు, చేతిరాతకు సంధానం కుదిరినప్పుడే భాష పోషకంగా ఉంటుందని భావించారు.

పండితులకే పరిమితమైన భాషను, కొద్దిమంది మాత్రమే చదువుకునే వెసులుబాటు ఉన్న  విద్యను సామాన్య ప్రజలందరికీ అందుబాటు లోకి తేవాలని ఆయన పరితపించారు. శిష్ట వ్యవహారిక భాషకు పట్టం కట్టినప్పుడే ఇది సాధ్యమవుతుందని ఆయన సంప్రదాయ భాషా వాదులపై సుదీర్ఘ పోరాటం చేశారు. అయితే సంప్రదాయ భాషా వాదులు ఆయన వాదనను బలంగా తిరస్కరించారు, అయినా గిడుగు వారు ఉద్యమించారు. 

ప్రజల భావాలకు అనుగుణంగా భాష ఉండాలనీ, వాళ్ళ భావాలను అందరికీ అర్థ మయ్యే రీతిలో రాయగలగాలనీ, అందుకే వాడుక భాష చాలా అవసరం అని గిడుగు వారు వాదించారు. సంప్రదాయ సాహిత్య వాదులు, కవులు అయిన తిరుపతి వేంకట కవులు కూడా భాషలో మార్పుల్ని సమర్థించారు. ప్రారంభంలో కందు కూరి వారు సంప్రదాయ సాహిత్య పక్షాన నిలి చినా  తదనంతరం గిడుగు వారి ఉద్యమ దీక్షలో సత్యాన్ని గ్రహించి ఆయన కూడా వ్యవహారిక భాషోద్యమానికి బాసటగా నిలిచారు. ఫలితంగా గిడుగు వారి ఉద్యమం మరింత బలపడింది.

గురజాడ, గిడుగు ఇద్దరూ అభ్యుదయవాదులు మాత్రమే కాదు, అద్భుతమైన భావజాలాలను కలబోసుకున్న మిత్రులు. విజయనగరంలో ఇద్దరూ కలిసే చదువుకున్నారు. ఎంతో కష్టపడి సవరభాష నేర్చుకొని అదే భాషలో పుస్తకాలు రాసి, సొంతడబ్బుతో బడులు ఏర్పాటు చేసి, సవరలకు చదువు చెప్పే ఏర్పాట్లు చేశారు గిడుగు. మద్రాసు ప్రభుత్వం వారు ఈ కృషికి మెచ్చి 1913లో ‘రావు బహదూర్‌‘ బిరుదు ఇచ్చారు. ముప్ఫై అయిదేళ్ళ కృషితో 1931లో ఇంగ్లీషులో సవరభాషా వ్యాకరణాన్నీ, 1936లో ‘సవర–ఇంగ్లీషు కోశా’న్నీ తయారు చేశారు. ప్రభుత్వం ఆయనకు ‘కైజర్‌–ఇ–హింద్‌’ అనే స్వర్ణ పతకాన్ని ఇచ్చి గౌరవించింది.

1919–20ల మధ్య వ్యావహారిక భాషోద్యమ ప్రచారం కొరకు ‘తెలుగు’ అనే మాస పత్రిక నడిపారు. వ్యావహారిక భాషను ప్రతిఘటించిన ‘ఆంధ్ర సాహిత్య పరిషత్తు’ సభలో నాలుగు గంటలపాటు ప్రసంగించి గ్రంథాల్లోని ప్రయోగాల్ని ఎత్తి చూపి తన వాదానికి అనుకూలంగా సమితిని తీర్మానింపజేశారు గిడుగు. ‘సాహితీ సమితి’, ‘నవ్య సాహిత్య పరిషత్తు’ వంటి సంస్థలు కూడా గిడుగు వాదాన్ని బలపరచాయి. గిడుగు రామ మూర్తి ఊరూరా ఉపన్యాసాలిస్తూ గ్రాంథికంలో ఏ రచయితా నిర్దుష్టంగా రాయలేడని నిరూపించారు.

ఆ క్రమంలో విశ్వవిద్యాలయాలన్నీ వ్యవ హారిక భాషకు పట్టం కట్టడం ప్రారంభించాయి. కాగా మరోవైపు గిడుగు వారి అనుంగు శిష్యుడైన తాపీ ధర్మారావు సంపాదకీయాలతో ప్రారంభ మైన వ్యవహారిక భాష... పత్రికల్లోనూ క్రమంగా విస్తరిస్తూ వచ్చింది. 1863 ఆగస్టు 29న శ్రీకాకుళానికి ఇరవై మైళ్ళ దూరంలో ముఖలింగ క్షేత్రం దగ్గర ఉన్న పర్వ తాల పేట గ్రామంలో జన్మించిన గిడుగు అలు పెరుగని వ్యవహారిక భాషోద్యమం చేస్తూ జనవరి 1940 జనవరి 22న కన్ను మూశారు. భాషను పరిపుష్టం చేయడం అనేది కేవలం ప్రభుత్వం బాధ్యత మాత్రమే కాదు. భాషాభి మానులందరూ కూడా ఇందులో మమేకం కావాలి.

తెలుగువారు తెలుగుతో పాటుగా ఇంగ్లీషు వంటి అంతర్జాతీయ భాషలలో పట్టు సాధించగలిగితే మన సాహిత్య అనువాదాలు ప్రపంచవ్యాప్తమవుతాయి తెలుగు వారు ఉన్నత స్థితిలో నిలిచినప్పుడు మన భాష, సంస్కృతి, సంప్రదాయాలను కూడా అదే స్థాయిలో నిలబెట్ట గలుగుతారన్నదే ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి ఆలోచన. అందుకే మనకోసం, మన పాలనావసరాల కోసం, ‘మన సంస్కృతి–సంప్రదాయాల కోసం, తెలుగు భాష... భవిష్యత్తు అవసరాల కోసం ఇంగ్లీష్‌ భాష’ అనే లక్ష్యంతో సాగుతున్నారు. ఈ నేపథ్యంలో భాషావాదులు కువిమర్శలు పట్టించు కోకుండా వాస్తవాలను గ్రహించగలిగితే, తెలుగు భాష అజంతం, అజరామరం అనేదానికి సార్థకత ఉంటుంది. ప్రపంచ పటంలో  తెలుగు కీర్తి రెపరెప లాడుతుంది.
 


వ్యాసకర్త ఆంధ్రప్రదేశ్‌ అధికార 
భాషా సంఘం అధ్యక్షులు

(చదవండి: ''ఇయ్యాల బిచ్చమడుగుడొస్తే రేపు ఓట్లు కూడా..'')

మరిన్ని వార్తలు