Pranay Patel-Wildlife photographer: క్లికింగ్‌

13 Jan, 2023 00:23 IST|Sakshi
ప్రణయ్‌ పటేల్‌

సక్సెస్‌ స్టోరీ

పదమూడు సంవత్సరాల వయసులోనే కెమెరాతో స్నేహం మొదలుపెట్టిన ప్రణయ్‌కి, ఇప్పుడు ఆ కెమెరానే ప్రాణం. అరణ్యానికి సంబంధించిన అద్భుతదృశ్యాలను అమితంగా ఇష్టపడే ప్రణయ్‌ వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నాడు. ఇంకా ఎన్నో అద్భుతాలు సాధించడానికి ఉత్సాహంగా ఉన్నాడు.....

పదమూడు సంవత్సరాల వయసులో కెమెరాతో అనుబంధం పెంచుకున్నాడు గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన ప్రణయ్‌ పటేల్‌. అది ఆ వయసుకు మాత్రమే పరిమితమైన ఉత్సాహమై ఉంటే వైల్డ్‌లైఫ్‌ ఫొటోగ్రాఫర్‌గా ప్రణయ్‌ అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకునేవాడు కాదు.
దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు. ఈ చిత్రాలు జాతీయ,అంతర్జాతీయ క్యాలెండర్‌లను అలంకరించాయి. అడవిలో ఫొటోగ్రఫీ అనేది అంతా వీజీ కాదు.

‘మేము రెడీ. ఇక మీరు ఫొటో తీసుకోవచ్చు’ అన్నట్లుగా ఉండదు అక్కడ. ఏ క్షణంలో ఏ అద్భుతం ఆవిష్కారం అవుతుందో తెలియదు. ఒళ్లంతా కెమెరా కన్నులై ఉండాలి. అడవి నాడి తెలిసిన ప్రణయ్‌కి ఈ విషయం తెలియనిదేమీ కాదు. అందుకే అడవిలోని అద్భుతదృశ్యాలను సమర్థవంతంగా పట్టుకోగలిగాడు.
‘లొకేషన్‌లోకి ప్రవేశించిన వెంటనే బ్యాక్‌ప్యాక్‌ ఓపెన్‌ చేసి కెమెరా సెట్‌ చేసుకోవాలి. బోర్‌ కొట్టవచ్చు. అలసటగా అనిపించవచ్చు. అయితే మన లక్ష్యం...అద్భుత దృశ్యం అనే విషయాన్ని మరవకూడదు. ఓపికతో కూడిన నిరీక్షణ నన్ను ఎప్పుడూ నిరాశ పరచలేదు’ అంటాడు ప్రణయ్‌.

ప్రణయ్‌ ఫొటోలతో రూపుదిద్దుకున్న ‘ది వండర్‌ఫుల్‌ వైల్డ్‌లైఫ్‌ ఆఫ్‌ గుజరాత్‌’ ‘ది బేర్స్‌ ఆఫ్‌ కమ్‌చట్‌క–రష్యా’ ‘ది వైల్డ్‌ ఎర్త్‌ ఆఫ్‌ ఆఫ్రికా’... మొదలైన క్యాలెండర్‌లకు ఎంతో పేరు వచ్చింది. గుజరాత్‌ టూరిజం కార్పొరేషన్‌ అధికారిక ఫొటోగ్రాఫర్‌గా చిన్న వయసులోనే నియమించబడ్డాడు.

‘ఫొటోగ్రాఫర్‌కు దృశ్యజ్ఞానమే కాదు శబ్దజ్ఞానం కూడా ఉండాలి’ అంటున్న ప్రణయ్‌ శబ్దాల ద్వారా కూడా దృశ్యాలను ఊహించగలడు. వాటిని అందంగా ఛాయాచిత్రాలలోకి తీసుకురాగలడు.
తన వెబ్‌సైట్‌ ద్వారా ఎంతో మంది ఔత్సాహిక ఫొటోగ్రాఫర్‌లకు స్ఫూర్తిని, ఉత్సాహాన్ని ఇస్తున్న ప్రణయ్‌ అమెరికాతో సహా ఎన్నో దేశాల్లో జరిగిన ఫొటోఎగ్జిబిషన్‌లలో పాల్గొన్నాడు.
‘వర్తమానం నుంచే కాదు గతం నుంచి కూడా ఎన్నో అద్భుత విషయాలను నేర్చుకోవచ్చు’ అంటున్న ప్రణయ్‌ అలనాటి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫొటోలలోని అద్భుతాలను ఆసక్తిగా విశ్లేషిస్తుంటాడు.

‘ప్రతి ఫొటో ఒక కొత్త విషయాన్ని మనకు పరిచయం చేస్తుంది’ అంటాడు ప్రణయ్‌. స్కూల్‌బ్యాగ్‌ మోసుకెళ్లాల్సిన వయసులో కెమెరా బ్యాగు మోసుకెళుతున్న ప్రణయ్‌కి వెక్కిరింపులు ఎదురయ్యాయి. ‘ఇక నీకు చదువు ఏం వస్తుంది!’ అని ముఖం మీదే అన్నవాళ్లు కూడా ఉన్నారు.
అయితే ఆ మాటలు విని తాను ఎప్పుడూ బాధపడలేదు. వెనక్కి తగ్గలేదు. కెమెరాతో స్నేహం వీడలేదు. దేశవిదేశాలలో ప్రణయ్‌ చేసిన ఫొటోగ్రఫీ టూర్‌లు వంద దాటాయి.

‘ప్రతి టూర్‌కు సంబంధించిన అనుభవాలను ఒక పుస్తకంగా రాసుకోవచ్చు’ అని మురిసిపోతుంటాడు ప్రణయ్‌.
‘కెమెరా పట్టుకోగానే అద్భుతాలు చోటుచేసుకోవు. పర్‌ఫెక్ట్‌ షాట్‌ కోసం రోజులే కాదు సంవత్సరం పాటు ఎదురుచూసిన సందర్భాలు కూడా ఉన్నాయి’ అంటాడు ప్రణయ్‌. ఫొటోగ్రఫీ గురించి ఓనమాలు తెలియని వారే కాదు, ఆ విద్యలో కొమ్ములు తిరిగిన ఫొటోగ్రాఫర్‌లు కూడా ప్రణయ్‌ని ప్రశంసలతో ముంచెత్తున్నారు.
25 సంవత్సరాల ప్రణయ్‌ పటేల్‌ భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆశిద్దాం.

దేశవిదేశాల్లో అరణ్యానికి సంబంధించిన ఎన్నో అద్భుతమైన దృశ్యాలను ఫొటోలలో బంధించాడు ప్రణయ్‌. ఈ చిత్రాలు జాతీయ, అంతర్జాతీయ క్యాలెండర్‌లను అలంకరించాయి.

మరిన్ని వార్తలు