విధానపర అంశాలపై విలువైన సంపుటి

11 Jul, 2021 00:42 IST|Sakshi

ముందు మాట

డాక్టర్‌ యలమంచిలి శివాజీ రాసిన ఈ గ్రంథం గత ఐదు దశాబ్దాలలో వ్యవ సాయ రంగంలో ఆశించిన విధానపర అంశాలపై పేర్కొనదగిన వ్యాసాల సంపుటి. రైతుల పట్ల అమితమైన ఆవేద నను వ్యక్తపరుస్తూ రచయిత సాగునీరు, విద్యుత్, ఎరువులు, రుణసదుపాయం, పెరుగుతున్న అనుత్పాదక భూమి వంటి అనేక అంశాలను ప్రస్తావించారు. రైతులు అందిస్తున్న సేవలు, వారికి లభిస్తున్న ఫలితాల మధ్య గల అసంబద్ధతను పుస్తకం ప్రస్తావిస్తుంది.

గత 71 ఏళ్ళల్లో తమ జీవనాధారం కోసం వ్యవసాయంపై ఆధారపడుతున్న వారి సంఖ్య కేవలం 71 నుండి 63 శాతానికి మాత్రమే తగ్గింది. గ్రామీణ ప్రాంతాల నుండి ఆదాయం పట్టణ  ప్రాంతాలకు తరలిపోతున్నది. వ్యయం తగ్గించుకోవడం, సాంకేతికతను ఉపయోగించుకోవడం, ప్రాసె సింగ్, మార్కెటింగ్‌ వంటి అంశాలపై రైతులకు మార్గదర్శకం లేకపోవడం, వ్యవసాయ ఉత్ప త్తులకు గిట్టుబాటు ధరలు అందకపోవడంతో గ్రామీణ ఆదాయం తగ్గిపోయి, వ్యవసాయ రంగానికి అందవలసిన ప్రయోజనాలను చాలా వరకు పట్టణ ప్రజలే ఎగరేసుకుపోతున్నారు. అదే సమయంలో మెరుగైన జీవనం కోసం పట్టణ ప్రాంతాలకు వలస వస్తున్న వారిని వాణిజ్య, పారిశ్రామిక రంగం అక్కున చేర్చుకోలేక పోవడంతో పట్టణ ప్రాంతాలలో పుట్టగొడుగుల వలే మురికి వాడలు పెరిగి పోతున్నాయి. ఈ ప్రక్రియను నిరోధించడం కోసం గ్రామీణ ఉపాధి అవకాశాలను మెరుగు పరచాలని రచయిత సూచించారు. 

ఒక అధ్యాయంలో, రైతులు చాలావరకు ప్రగతిశీలురై, మెరుగైన సాంకేతికతను ఉపయోగిస్తున్న గుంటూరు జిల్లాల్లోని వ్యవసాయ పరిస్థితుల గురించి రచయిత వివరించారు. అధిక పెట్టుబడులతో వారు అనేక రకాల పంటలు పండిస్తున్నారు. కానీ చివరకు వారి ఉత్పత్తులను తక్కువ ధరలకే అమ్ముకోవాల్సి వస్తున్నది. రచయిత భారత్, చైనాల మధ్య ఆసక్తికరమైన సారూప్య తను చూపారు. మన దేశంలో సాగులో ఉన్న భూమిలో 60 శాతమే ఉన్న చైనా పెద్దగా దిగుమతులు లేకుండానే తన ఆహార అవసరాలను తీర్చుకోగలుగుతున్నది. భారతదేశంలో వలె చైనాలో భూమి సారవంతమైనది కాదు. కానీ, ప్రభుత్వం రైతు లకు అందిస్తున్న ప్రోత్సాహకాలు, సాంకేతిక మద్దతు కారణంగా ఇది సాధ్యమైంది.

దేశంలో వివిధ సమయాలలో, వివిధ ప్రాంతాలలో జరిగిన రైతు ఉద్యమాల చరిత్ర గురించిన తన అనుభవాలను శివాజీ పంచుకున్నారు. రైతుల సమస్యలను ప్రస్తావించడంలో ఈ రచయితకు గల అంకితభావం ప్రశంసనీయమైనది. నేటి తరాలకేగాక, భవిష్యత్‌ తరాల వారికి కూడా ఈ గ్రంథం విలువైన వనరుగా, మార్గదర్శిగా ఉండగలదు. నాకు ప్రవేశం లేని తెలుగులో రాసిన ఈ గ్రంథంలోని కొన్ని భాగాలను శివాజీ ఆంగ్ల అనువాదం అందించారు, భాషాపరమైన అవరోధం లేకుండా. ఈ గ్రంథానికి  ముందు మాట రాయమని కోరడం నేను గౌరవంగా భావిస్తున్నాను. రైతుల పరిస్థితుల పట్ల హృదయాన్ని కదిలించివేసే రచయిత తీవ్రమైన ఆవేదన దాదాపు ప్రతి వ్యాసంలో ప్రతిధ్వనిస్తుంది. తన ప్రయత్నాలలో రచయితకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. 

(ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు నేడు హైదరాబాద్‌లో ఆవిష్కరించనున్న డాక్టర్‌ యలమంచిలి శివాజీ రచన ‘పల్లెకు పట్టాభిషేకం’కు విశ్రాంత భారత ప్రధాన న్యాయమూర్తి రాసిన ముందుమాట) 

ఎస్‌ఏ.బాడ్డే

మరిన్ని వార్తలు