‘డబుల్‌’ దుమారం! | Sakshi
Sakshi News home page

‘డబుల్‌’ దుమారం!

Published Sun, Oct 1 2023 4:14 AM

మారేడుపల్లిలో ఆందోళన చేస్తున్న లబ్ధిదారులు  - Sakshi

కంటోన్మెంట్‌లో

కాకరేపిన మంత్రి తలసాని ‘గూడుపుఠాణీ’ వ్యాఖ్యలు

ఇళ్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సొంత పార్టీ నేతలు

ఆందోళన చేపట్టిన లబ్ధిదారులు

నష్ట నివారణ చర్యల్లో రెవెన్యూ అధికారులు

కంటోన్మెంట్‌: కంటోన్మెంట్‌లోని డబుల్‌ బెడ్రూం ఇళ్ల వ్యవహారంలో మంత్రి తలసాని చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కొందరు స్థానిక నేతలు గూడుపుఠాణి చేసి ఇళ్లు అమ్ముకున్నారంటూ మంత్రి పేర్కొనడం పట్ల అధికార పార్టీ నేతలతో పాటు లబ్ధిదారులు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మారేడుపల్లిలోని డబుల్‌ బెడ్రూం ఇళ్ల లబ్ధిదారులు ఆందోళనకు దిగారు. తమను మంత్రి స్థానికేతరులుగా పేర్కొనడాన్ని తీవ్రంగా ఖండించారు. రెండు రోజులుగా నిరసనలు చేపట్టిన ఆందోళనకారులు శనివారం మరింత తీవ్రం చేశారు. సుమారు 100 మంది లబ్ధిదారులు తమ ఆందోళనకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులకు దరఖాస్తు చేసుకోవడంతో ఉన్నతాధికారులు జోక్యం చేసుకున్నారు. స్పందించిన రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, ఒకట్రెండు రోజుల్లో బస్తీ సభ నిర్వహణ ద్వారా లబ్ధిదారులకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో తాత్కాలికంగా ఆందోళన విరమించారు.

ఏడేళ్లుగా సాగుతున్న వ్యవహారం..

● మారేడుపల్లి పోలీసు స్టేషన్‌ ఎదురుగా ఉన్న హౌజింగ్‌ బోర్డు స్థలంలో కొన్నేళ్ల క్రితమే ఓ బస్తీ ఏర్పడింది. 2014లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌ (ప్రస్తుతం బీఆర్‌ఎస్‌) ప్రభుత్వం జీఓ 58 ద్వారా పేదలకు పట్టాల పంపిణీ చేపట్టింది. అందులో భాగంగానే ఓల్డ్‌ మారేడుపల్లి బస్తీ వాసులకూ పట్టాలు ఇచ్చేందుకు రంగం సిద్ధమైంది. అయితే.. ఇరుకై న బస్తీలో మౌలిక సదుపాయాలకు ఇబ్బందులు ఎదురవుతాయని భావించిన కొందరు ఈ స్థలంలో డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించాలని ప్రతిపాదించారు.

● తక్కువ విస్తీర్ణంలో ఇళ్లు ఉన్న వాళ్లు డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు ఒప్పుకోగా, పెద్ద ఇళ్లు ఉన్న వాళ్లు అభ్యంతరం చెప్పారు. దీంతో దివంగత స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మంత్రి తలసాని జోక్యం చేసుకుని ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు కలిగిన వారికి కుటుంబానికి రెండు లేదా మూడు చొప్పున డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఇళ్ల నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఏడేళ్ల క్రితం ఇక్కడ ఉన్న ఇళ్లు కూల్చేసి, 468 డబుల్‌ బెడ్రూం ఇళ్లు నిర్మించారు. రెండేళ్ల క్రితమే తొలి విడతలో సుమారు 250 మందికి ఇళ్లు కేటాయించారు.

ఆధిపత్య పోరుతో వాయిదా..

● స్థానిక ఎమ్మెల్యే సాయన్న, మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ల మధ్య ఆధిపత్య పోరుతో మలివిడత ఇళ్ల పంపిణీ వాయిదాపడుతూ వచ్చింది. ఇటీవల సాయన్న మరణంతో వ్యవహారం పూర్తిగా తలసాని చేతుల్లోకి వెళ్లింది. దీంతో పంపిణీకి సిద్ధంగా ఉన్న ఇళ్ల జాబితాను పక్కన పెట్టేయాలంటూ అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. అంతే కాకుండా మారేడుపల్లి, మడ్‌ఫోర్ట్‌లో స్థానికులకు ఈపాటికే ఇళ్లు పంపిణీ చేశామని, కొత్తగా ఎవరికీ ఇచ్చేది లేదంటూ చెప్పేశారు.

● మూడు రోజుల క్రితం సికింద్రాబాద్‌ ఆర్డీవో కార్యాలయం ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో మంత్రి మాట్లాడుతూ.. కొందరు స్థానిక నేతలు గూడుపుఠాణీ చేసి ఇళ్లు అమ్ముకున్నారంటూ ఆరోపణలు చేశారు. దివంగత ఎమ్మెల్యే సాయన్న కుమార్తెలు లాస్య నందిత, నివేదిత సమక్షంలోనే ఆయన ఈ వ్యాఖ్యలు చేయడంతో సాయన్న అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దివంగత నేతపై అవినీతి బురద జల్లే ప్రయత్నం చేయడం ఎంతవరకు సబబు అంటూ నిలదీస్తున్నారు. మంత్రి వ్యాఖ్యలతో నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్య నందిత సైతం ఇరకాటంలో పడ్డారు.

Advertisement
Advertisement