భారతీయులకు క్షమాపణ చెప్పిన పీఎం కొడుకు

28 Jul, 2020 18:21 IST|Sakshi

జెరూసలెం: సోషల్‌ మీడియాలో దేని గురించి అయినా పోస్ట్‌ చేసేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. తప్పు చేస్తే.. నెటిజనులు ఓ రేంజ్‌లో ఆడుకుంటారు. సామాన్యుల సంగతి పక్కన పెడితే.. సెలబ్రిటీలు, రాజకీయ నాయుకులు.. ఉన్నత స్థానాల్లో ఉన్న వారు సోషల్‌ మీడియాలో చాలా జాగ్రత్తగా ఉండాలి. లేదంటే తీవ్ర పరిణామాలు చవి చూడాల్సి వస్తుంది. తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్‌ నెతన్యాహు పెద్ద కుమారుడు యాయిర్ (29) కూడా అలాంటి అత్యత్సాహమే ప్రదర్శించి చివరికి భారతీయులకు క్షమాపణలు చెప్పాడు. సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉండే యాయిర్ ఇటీవల భారతీయుల ఇష్ట దైవం దుర్గామాత ముఖం స్థానంలో.. నెతన్యాహు అవినీతి కేసుల్లో ప్రాసిక్యూటర్‌గా వ్యవహరిస్తున్న లియత్ బెన్ ఆరి ముఖాన్ని మార్ఫ్‌ చేసిన ఫోటోను షేర్ చేశాడు. అయితే ఇది కాస్తా వివాదానికి దారితీసింది. (ఇజ్రాయెల్‌ ప్రధానిపై సంచలన ఆరోపణలు.. చార్జిషీట్!)

దీనిపై భారత్ నుంచి పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో.. వెంటనే తన తప్పు తెలుసుకున్నాడు యాయిర్‌. ఆ ట్వీట్‌ను డిలీట్‌ చేయడమే కాక.. భారతీయులను క్షమాపణలు కోరుతూ మరో ట్వీట్ చేశాడు. ‘నేను ఇది కావాలని చేసింది కాదు. ఇజ్రాయెల్ రాజకీయ నేతలను ఉద్దేశించి ఓ సెటైరికల్ పేజీలో మీమ్‌ను పంచుకున్నాను. ఆ మీమ్‌లో ఉన్నది భారతీయులకు ఎంతో ఆరాధ్య దైవమయిన దుర్గా మాతా అని నాకు తెలియదు. దీని గురించి భారత మిత్రుల నుంచి వచ్చిన సందేశాలతో నిజం తెలుసుకున్నాను. వెంటనే ఆ ట్వీట్ తొలగించాను. నన్ను క్షమించండి’ అని ట్వీట్‌లో పేర్కొన్నాడు యాయిర్‌. దీంతో వివాదం సద్దుమణిగింది. కాగా, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుపై అనేక అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో విపక్షాలు నెతన్యాహుపై విరుచుకుపడుతున్నాయి. యాయిర్ కూడా అదే మూడ్‌లో దుర్గామాత ఫోటోను మార్ఫింగ్ చేసి షేర్ చేశాడు. (కరోనా వ్యాప్తికి విరుగుడు కనిపెట్టిన ప్రధాని)

మరిన్ని వార్తలు