తాలిబన్ల సంబరాలు.. 17 మంది పౌరులు మృతి!

4 Sep, 2021 16:29 IST|Sakshi

కాబుల్‌: అఫ్గనిస్తాన్‌ను ఆక్రమించుకున్న తాలిబన్లకు పంజ్‌షీర్‌ ప్రాంతం సవాలుగా మారిన సంగతి తెలిసిందే. ఇప్పటికే అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొనగా.. తాజాగా శుక్రవారం తాలిబన్లు తాము పంజ్‌షీర్‌ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సంచలన ప్రకటన చేశారు. అంతేకాక తాలిబన్ల ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి గాల్లోకి కాల్పులు జరిపి సంబరాలు జరుపుకున్నారు. అయితే తాలిబన్ల అత్యుత్సాహం సామాన్యుల పాలిట శాపంగా మారింది. తాలిబన్లు జరిపిన కాల్పుల్లో 17 మంది అఫ్గన్‌ పౌరులు మరణించినట్లు ఆ దేశ మీడియా తెలిపింది. (చదవండి: కొరకరాని కొయ్యగా పంజ్‌షీర్‌.. కొత్త ప్రభుత్వం ఎప్పుడు?)

రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ అఫ్గానిస్తాన్‌ (ఎన్‌ఆర్‌ఎఫ్‌ఏ) ఓడించి, పంజ్‌షీర్‌ను అధీనం చేసుకున్నట్టు తాలిబన్లు శుక్రవారం ప్రకటించారు. అనంతరం గాల్లో కాల్పులు జరిపి సంబరాలు చేసుకున్నారు. ఈ ఘటనలో సుమారుగా 17 మంది మృతి చెందగా, 41 మంది గాయపడ్డారు. ఇలాంటి పనులతో పౌరులకు హాని తలపెట్టవద్దని తాలిబ‍న్ల ప్రతినిధి జబీహుల్లా ట్విట్టర్‌లో సైనికులకు సూచనలు చేశారు. తిరుగుబాటుదారులు శాంతియుతంగా లొంగిపోవాలని ప్రకటించారు.

అయితే పంజ్‌షీర్‌ తిరుగుబాటుదారుల నాయకుడు అహ్మద్‌ మసూద్‌ మాత్రం దీన్ని కొట్టిపారేశాడు. ఈ విషయంపై పాకిస్తాన్‌ మీడియాల్లో ప్రసారమవుతున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని, ప్రతిఘటన దాడులు కొనసాగుతునే ఉన్నాయని అహ్మద్‌ మసూద్‌ స్థానిక మీడియాకు వెల్లడించారు.

Afghanistan: తాలిబన్లకు కీలక సమాచారం చిక్కకూడదనే..

మరిన్ని వార్తలు