బ్రిటన్‌ ఉప ప్రధాని రాజీనామా.. రిషి సునాక్‌కు గట్టి దెబ్బ

21 Apr, 2023 15:17 IST|Sakshi

లండన్‌: బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌కు అక్కడ ఎదురు గాలి వీస్తోంది. బ్రిటన్‌ ఉప ప్రధాని, న్యాయశాఖ మంత్రి డొమినిక్‌ రాబ్‌ తాజాగా తన పదవికి రాజీనామా చేశారు. న్యాయశాఖలో పాటు వైట్‌హాల్‌ విభాగాల్లో ఆయన సిబ్బందిపై వేధింపులకు పాల్పడ్డారంటూ గత కొంతకాలంగా ఆరోపణలు వినవస్తున్నాయి. ఈ వ్యవహారంపై దర్యాప్తు కమిటీ రిపోర్ట్‌ గురువారం ప్రధాని సునాక్‌కు చేరింది. ఈ నేపథ్యంలో శుక్రవారం డొమినిక్‌ రాబ్‌ తన పదవులకు రాజీనామా ప్రకటించారు.

ఈ సీనియర్‌ కన్జర్వేటివ్‌ ఎంపీ తన పేషీలో పని చేసే సిబ్బందిని వేధించినట్లు, అవమానించినట్లు, ఏడ్పించినట్లు.. సిబ్బంది ఫిర్యాదులు చేశారు. ఈ విషయాన్ని బ్రిటిష్‌ టాబ్లాయిడ్‌ గార్డియన్‌ తొలుత బయటపెట్టింది. అయితే.. ఆరోపణలను డొమినిక్‌ రాబ్‌ ఖండిస్తూ వస్తున్నప్పటికీ, ఈ వ్యవహారంపై దర్యాప్తు చేయాల్సిందిగా సీనియర్‌ న్యాయవాది అడమ్‌ టోలీని కిందటి ఏడాది నవంబర్‌లో నియమించారు ప్రధాని సునాక్‌. 

రెండు ఫిర్యాదుల మీద మొదలైన ఈ వ్యవహారంలో దర్యాప్తు.. మలుపులు తీసుకుంటూ ఎక్కడికో పోయింది. రాబ్‌కు వ్యతిరేకంగా ఆధారాలను సేకరించుకుంటూ పోయింది అడమ్‌ టీం. రాబ్‌ దగ్గర పని చేసే సిబ్బంది నుంచి వాంగ్మూలం సేకరించి.. నివేదికను సిద్ధం చేసింది. గురువారం ఆ నివేదికను రిషి సునాక్‌కు సమర్పించారు అడమ్‌ టోలీ. ఆ నివేదిక ఇంకా బహిర్గతం కావాల్సి ఉంది.  ఈ లోపే రాబ్‌ అనూహ్యాంగా రాజీనామా ప్రకటించారు.

అయితే.. తీవ్ర ఆరోపణలు, రాబ్‌పై దర్యాప్తు కొనసాగుతున్నప్పటికీ సునాక్‌ను.. మంత్రిగా కొనసాగించడంపై ప్రధాని రిషి సునాక్‌ రాజకీయపరంగా విమర్శలు ఎదుర్కొనే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు కిందటి ఏడాది అక్టోబర్‌లో రిషి సునాక్‌ యూకే ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా.. ఈ ఆరు నెలల కాలంలో ముగ్గురు కేబినెట్‌ మంత్రులు వ్యక్తిగత ప్రవర్తన కారణంగానే పదవుల నుంచి వైదొలగాల్సి రావడం గమనార్హం.

మరిన్ని వార్తలు