మరో కుంభకర్ణుడు! ఏడాదికి 300 రోజులు నిద్రలోనే..

13 Jul, 2021 19:12 IST|Sakshi

Rajasthan Sleep Man: ప్రపంచంలోని ప్రతి ఒక్కరికీ నిద్ర అనేది చాలా ముఖ్యమైనది. తిండి, నీరు అనేది ఎంత ముఖ్యమో.. నిద్ర కూడా అంతే.. ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం 8 గంటలైనా నిద్ర పోవాలని వైద్యులు, నిపుణులు అంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా 8 గంటల నిద్ర ఆరోగ్యానికి మంచిదని చెబుతోంది.

ఇక ఆధునికయుగం అతి వేగంగా దూసుకెళ్తోంది. టెక్నాలజీ పెరగడంతో మనుషుల్లో నిద్రపై శ్రద్ధ తగ్గుతోంది. అయితే రాజస్థాన్‌కి చెందిన పూర్ఖారామ్ అనే వ్యక్తి సంవత్సరంలో 300 రోజులు నిద్రపోతాడు. దీనిపై పూర్ఖారామ్ స్పందిస్తూ..  ఈ అతి నిద్ర తన జీవితంలో 23 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని తెలిపాడు. తాను మేల్కోవాలనుకున్నప్పుడల్లా.. అతని శరీరం తనకి సహకరించడం లేదని అన్నాడు. మొదట్లో 18 గంటలు పడుకునేవాడని వెల్లడించాడు. కానీ రాను రాను నెలలో 5 నుంచి 7 రోజులు, ఆ తర్వాత 20 నుంచి 25 రోజులు నిద్రపోతున్నట్లు పేర్కొన్నాడు.

ఇలా సంవత్సరానికి సగటున 300 రోజుల నిద్రలోనే గడుపుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దీనిపై పూర్ఖారామ్ భార్య లిచ్మి దేవి మాట్లాడుతూ.. తన భర్త అనారోగ్యం తనకు చాలా ఇబ్బందులను కలిగిస్తోందని తెలిపింది. ఏ డాక్టర్‌ వద్దకు తీసుకెళ్లిన సమస్య ఏంటో ఎవరికీ అర్థం కాలేదని వాపోయింది.  కాగా, కొన్ని నివేదికలు ఈ వ్యాధిని హైపర్సోమ్నియా అని పేర్కొన్న విషయం తెలిసిందే. ఇక ఈ వ్యాధి కారణంగా పూర్ఖారామ్‌ను చుట్టుప్రక్కల వారు కుంభకర్ణుడు అని పిలవడం మొదలుపెట్టారు.

మరిన్ని వార్తలు