ఆయన ఇంట్లో పెన్సిళ్లు, జామెట్రీ బాక్స్‌లు మాత్రమే దొరుకుతాయి!

19 Aug, 2022 15:20 IST|Sakshi

న్యూఢిల్లీ: ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్‌ సిసోడియా నివాసంపై సీబీఐ దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ తీవ్రంగా స్పందించారు. గతంలో కూడా ఇలాంటి దాడులే జరిగాయని, ఏమి కనగొనలేకపోయారని అన్నారు. అమెరికా ప్రసిద్ధ వార్త పత్రిక న్యూయార్క్‌ టైమ్స్‌ ఆయన పనితీరుని ప్రశంసించి ఫ్రంట్‌ పేజీలో ప్రచురిస్తే... కేంద్ర ప్రభుత్వం సీబీఐ దాడులు నిర్వహిస్తుందని పెద్ద ఎత్తున్న ఆరోపణలు చేశారు.

అయినా మనీష్‌ సిసోడియా ఇంట్లో కేవలం పుస్తకాలు, పెన్సిళ్లు, జామెట్రీ బాక్సులు మాత్రేమ కనిపిస్తాయని ఆప్‌ పార్టీకి చెందిన రాఘవ్‌ చద్దా ఎద్దేవా చేశారు. ఇప్పటివరకు సుమారు వంద మందికి పైగా ఆప్‌ నేతలపై తప్పుడు కేసులు పెట్టారని, ప్రతికేసులో ఒక్కొక్కరిగా తాము కేసు నుంచి బయటపడ్డామని రాఘవా అన్నారు. ఐతే సీబీఐ విద్య, ఎక్సైజ్ శాఖ మంత్రిగా ఉన్న మనీష్ సిసోడియా తొమ్మిది నెలలుగా అమలు చేసిన కొత్త మద్యం పాలసీపై విచారణ జరుపుతోంది.

ఢిల్లీలో కేంద్ర ప్రతినిధిగా ఉన్న లెఫ్టినెంట్ గవర్నర్ అనుమతి లేకుండా మద్యం విక్రయించడానికి ఎవరికి అనుమతి ఇవ్వాలనే దానిపై సిసోడియా ఈ విధానాన్ని ప్రవేశపెట్టారని సీబీఐ పేర్కొంది. అంతేకాదు లైసెన్సులతో మధ్యం విక్రయించుకునేలా ప్రైవేట్‌ వ్యక్తులకే అధిక సంఖ్యలో కట్టబెట్టేందుకు చూసిందని సీబీఐ ఆరోపిస్తోంది. ఐతే అవినీతిని అరికట్టేందుకు, శక్తివంతమైన మద్యం మాఫియాపై పోరాడేందుకు ఈ విధానాన్ని ఉద్దేశించినట్లు సిసోడియా చెబుతుండటం గమనార్హం.

(చదవండి:  సీబీఐ దాడుల మధ్య కేజ్రీవాల్‌ ‘మిస్డ్ కాల్‌’ క్యాంపెయిన్‌)

మరిన్ని వార్తలు