బీజేపీ ఎమ్మెల్యే రేప్‌ కేసు: మోదీకి బాధితురాలి లేఖ

3 Oct, 2020 09:20 IST|Sakshi

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌ బీజేపీ ఎమ్మెల్యే మహేష్‌ నేగి తనపై అత్యాచారం చేశాడని అతడిపై చర్యలు తీసుకోవాలంటూ బాధిత మహిళ డిమాండ్‌ చేసింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు కోరుతూ ప్రధాని నరేంద్రమోదీకి లేఖ రాసింది. తన నాలుగు పేజీల లేఖలో రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వం, పోలీసులు.. నిందితుడైన ఎమ్మెల్యేను రక్షించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఘటనపై నిష్పాక్షికంగా విచారణ జరిపి నిందితుడిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

బాధితురాలి తరపు న్యాయవాది ఎస్పీ సింగ్‌ మాట్లాడుతూ.. 'న్యాయస్థానం, పోలీసులు సరియైన దర్యాప్తు చేయకుండా ఎమ్మెల్యేను కాపాడుతున్నందునే బాధిత మహిళ సీబీఐ విచారణ కోరుతూ ప్రధానికి లేఖ రాసింది. ఎమ్మెల్యేను రక్షించే క్రమంలో పోలీసులు వాస్తవాలను వక్రీకరిస్తున్నారు. నా క్లయింట్‌ని అతనితో రాజీ కుదుర్చుకోవాలని కోరారు. అందువల్ల న్యాయమైన, నిష్పాక్షిక దర్యాప్తును కోరుతూ ఆమె ప్రధానికి లేఖ రాశారు' అని ఎస్పీ సింగ్‌ తెలిపారు. అయితే ఈ వాదనను ఉత్తరాఖండ్‌ పోలీసులు తోసిపుచ్చారు. ఈ ఘటనపై దర్యాపు అధికారిని మార్చాలని మాత్రమే బాధితురాలు కోరినట్లు డెహ్రాడూన్‌ సీనియర్‌ పోలీస్‌ సూపరింటెండెంట్ అరుణ్ మోహన్ జోషి అన్నారు.

(రేప్‌ కేసులో బీజేపీ ఎమ్మెల్యేపై కేసు నమోదు)

>
మరిన్ని వార్తలు