గవర్నర్‌ నిర్ణయం చారిత్రక తప్పిదం

1 Aug, 2020 05:01 IST|Sakshi

అమరావతి కోసం పోరాటం చేస్తాం

ఎన్నికలకు వెళ్లండి లేదా రిఫరెండం పెట్టండి

జేఏసీ పిలుపు మేరకు శనివారం నుంచి రాష్ట్రమంతా నిరసనలు.. ప్రతిపక్ష నేత చంద్రబాబు

సాక్షి, అమరావతి: వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ రద్దు బిల్లులపై గవర్నర్‌ నిర్ణయం చారిత్రక తప్పిదమని, రాజ్యాంగ వ్యతిరేకమని, విభజన చట్టానికి వ్యతిరేకమని ప్రతిపక్ష నేత చంద్రబాబు విమర్శించారు. రాష్ట్ర చరిత్రలో ఇది చీకటి రోజని వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ నుంచి శుక్రవారం ఆయన ఎంపిక చేసిన మీడియా ప్రతినిధులతో ఆన్‌లైన్‌లో మాట్లాడారు.

► ప్రజలు కరోనాతో బాధపడుతున్న పరిస్థితుల్లో చిచ్చు పెట్టారు.
► అమరావతి ఆంధ్రుల కల. 29 వేల మంది రైతులు 34 వేల ఎకరాల భూములిచ్చారు. సెల్ఫ్‌ ఫైనాన్సింగ్‌ ప్రాజెక్టు ఇది. ప్రభుత్వం పైసా ఖర్చు పెట్టక్కర్లేదు. అలాంటి రాజధానిని ఛిన్నాభిన్నం చేశారు. రాజధాని ఇక్కడే ఉంటుందని చెప్పాం. అందుకే భూములిచ్చారు. ఆ అగ్రిమెంట్‌ను ఉల్లంఘించినట్లు కాదా? 
► అమరావతి ఇక్కడే ఉంటుందని, ఇంకా ఎక్కువ ఎకరాలు తీసుకోండని మీరు ఆరోజు అసెంబ్లీలో చెప్పారా లేదా? ఈ రోజు మడమ ఎందుకు తిప్పారు? చరిత్రలో ఎక్కడా మూడు రాజధానులు లేవు.
► విభజన చట్టానికి తూట్లు పొడుస్తున్నారు. రాష్ట్రాన్ని భ్రష్టు పట్టిస్తున్నారు. అన్ని రాజకీయ పార్టీలు జేఏసీ కింద పనిచేస్తాం. రైతులకు సంఘీభావంగా పోరాటం చేస్తాం.    ► జేఏసీ పిలుపు మేరకు శనివారం నుంచి రాష్ట్రమంతా నిరసనలు తెలుపుతాం.
► ఇప్పటికైనా కళ్లు తెరవాలని ప్రజల్ని కోరుతున్నా. లేదంటే నష్టపోతాం.
► మీ రాజధాని ఏదని అంటే మాకు మూడు రాజధానులున్నాయని చెప్పే పరిస్థితి వస్తుంది. రిఫరెండం పెట్టి  ప్రజల అభిప్రాయం తీసుకోండి. మీపై మీకు నమ్మకం ఉంటే ఎన్నికలకు వెళ్లండి. అమరావతి వద్దని రాష్ట్ర ప్రజలందరినీ చెప్పమనండి. నేను మాట్లాడను. 
► రేపటి నుంచి కోర్టుకు వెళతాం. ఇందులో చట్టపరమైన, రాజ్యాంగ పరమైన సమస్యలున్నాయి. గవర్నర్‌ సంతకం పెడితే అది చట్ట వ్యతిరేకం కాకుండాపోతుందా? ఎస్‌ఈసీ రమేష్‌ విషయంలో చూశారు. ఇందులోనూ అదే జరుగుతుంది. 
► రాజధానిపై జోక్యం చేసుకోబోమని బీజేపీ చెప్పలేదు. ఆ పార్టీ రాష్ట్ర నాయకులు చెప్పారు. 

మరిన్ని వార్తలు