IND Vs ENG: ఏంటి రహానే ఇలా చేశావు.. అంత తొందరెందుకు

5 Aug, 2021 21:15 IST|Sakshi

నాటింగ్‌హమ్‌: ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో అజింక్యా రహానే అనూహ్యంగా రనౌట్‌ అయ్యాడు. అయితే రహానే ఔటైన తీరు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఓలి రాబిన్‌సన్‌ వేసిన ఇన్నింగ్స్‌ 44వ ఓవర్‌ రెండో బంతిని స్ట్రైక్‌లో ఉన్న కేఎల్‌ రాహుల్‌ ఢిపెన్స్‌ ఆడే ప్రయత్నం చేశాడు. బంతి బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌ దిశలో ఉన్న బెయిర్‌ స్టో దగ్గరికి వెళ్లింది. అయితే రాహుల్‌ క్రీజు నుంచి కదలడంతో నాన్‌స్ట్రైక్‌ ఎండ్‌లో ఉన్న రహానే పరుగు కోసం ముందుకు వచ్చాడు. రాహుల్‌ వద్దంటూ చేయితో సిగ్నల్‌ ఇచ్చినప్పటికి రహానే అది పట్టించుకోకుండా క్రీజు దాటి బయటకు వచ్చేశాడు.  అప్పటికే బంతిని అందుకున్న బెయిర్‌ స్టో రహానే ఉన్న వైపు విసిరాడు. బంతి నేరుగా వికెట్లను గిరాటేయడంతో రహానే రనౌట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది.

రహానే రనౌట్‌పై నెటిజన్లు వినూత్న రీతిలో  స్పందించారు.'' ఏంటి రహానే ఇలా చేశావు.. అంత తొందరెందుకు నీకు.. రాహుల్‌ సిగ్నల్‌ చూస్తే బాగుండు... అనవసర తప్పిదంతో రనౌట్‌ అయ్యావు'' అంటూ కామెంట్‌ చేశారు. కాగా పుజారా, కోహ్లి ఔటైన తర్వాత రహానే కూడా వెనుదిరగడంతో టీమిండియా కష్టాల్లో పడింది. ఈ దశలో వెలుతురులేమితో పాటు మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించడంతో అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇప్పటివరకు టీమిండియా 46.1 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసింది. కేఎల్‌ రాహుల్‌ 57, పంత్‌ 7 పరుగులతో ఆడుతున్నారు.

మరిన్ని వార్తలు