Ishan Kishan: పాపం ఇషాన్‌ కిషన్‌! ఇది నా హోం గ్రౌండ్‌.. వాళ్లు సెంచరీ చేయమన్నారు! కానీ..

10 Oct, 2022 10:47 IST|Sakshi

South Africa tour of India, 2022- India vs South Africa, 2nd ODI: దక్షిణాఫ్రికాతో రెండో వన్డేలో అద్భుతమైన ఆటతీరుతో అభిమానుల మనసు దోచుకున్నాడు టీమిండియా యువ వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ ఇషాన్‌ కిషన్‌. సొంత మైదానంలో ఆకాశమే హద్దుగా చెలరేగుతూ ఫోర్లు, సిక్సర్ల వర్షం కురిపించాడు. మరో యువ ఆటగాడు శ్రేయస్‌ అయ్యర్‌(111 బంతుల్లో 113 పరుగులు, నాటౌట్‌)తో కలిసి జట్టును గెలిపించడంలో కీలక పాత్ర పోషించాడు. 

పాపం ఇషాన్‌ కిషన్‌!
అంతా బాగానే ఉన్నా వన్డేల్లో తొలి సెంచరీ చేసే అవకాశం మాత్రం చేజార్చుకున్నాడు ఇషాన్‌. శతకానికి ఏడు పరుగుల దూరం(84 బంతుల్లో 4 ఫోర్లు, 7 సిక్స్‌ల సాయంతో 93 పరుగులు)లో నిలిచిపోయాడు. అయితే, సెంచరీ చేజారినా టీమిండియా విజయానికి తన ఇన్నింగ్స్‌ ఉపయోగపడటం సంతోషంగా ఉందంటూ హర్షం వ్యక్తం చేశాడు.

సెంచరీ చేయమని అడిగారు.. కానీ
మ్యాచ్‌ అనంతరం ఇషాన్‌ కిషన్‌ మాట్లాడుతూ.. ‘‘మ్యాచ్‌ అద్భుతంగా సాగింది. ఇప్పుడు సిరీస్‌ను 1-1తో సమం చేశాం. ఢిల్లీలో నిర్ణయాత్మక మూడో వన్డే కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నా. ఈరోజైతే నేను చాలా చాలా సంతోషంగా ఉన్నాను. ఇది నా హోం గ్రౌండ్‌.

నేను ఫీల్డింగ్‌ చేస్తున్న సమయంలో.. ఈరోజు సెంచరీ చేయాలంటూ ప్రేక్షకులు నన్ను అడిగారు. దురదృష్టవశాత్తూ నేను శతకం బాదలేకపోయాను. అయినా, మరేం పర్లేదు. జట్టు గెలుపులో నా వంతు పాత్ర పోషించినందుకు ఆనందంగా ఉంది. తదుపరి మ్యాచ్‌లో కూడా ఇలాగే అత్యుత్తమ ఇన్నింగ్స్‌ ఆడి జట్టును గెలిపిస్తానేమో! 

షాట్‌ సెలక్షన్‌ మార్చుకుంటూ
నిజానికి రాంచి పిచ్‌పై పరుగులు రాబట్టడం ఒక్కోసారి చాలా కష్టతరంగా మారుతుంది. ముఖ్యంగా కొత్త బ్యాటర్లు ఇక్కడ స్కోర్‌ చేయడం అంత తేలికేమీ కాదు. నోర్జే, రబడ బాగా బౌలింగ్‌ చేశారు. వారి బౌలింగ్‌కి తగ్గట్లు నా ప్రణాళికలు, షాట్‌ సెలక్షన్‌ మార్చుకుంటూ బ్యాటింగ్‌ చేశాను. మెరుగైన ఫలితం రాబట్టాను’’ అంటూ చెప్పుకొచ్చాడు.

కాగా రాంచీ వేదికగా జరిగిన రెండో వన్డేలో ధావన్‌ సేన.. ప్రొటిస్‌ జట్టుపై ఏడు వికెట్ల తేడాతో గెలుపొంది మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-1తో సమం చేసింది. ఇరు జట్ల మధ్య నిర్ణయాత్మక ఆఖరి వన్డే మంగళవారం (అక్టోబరు 11) ఢిల్లీలో జరుగనుంది.

చదవండి: World Cup Super League: దక్షిణాఫ్రికాపై ఘన విజయం.. టాప్‌5లో టీమిండియా

మరిన్ని వార్తలు