ICC FTP: జై షా చెప్పిందే నిజమైంది.. ఐపీఎల్‌పై ఐసీసీ కీలక నిర్ణయం

16 Jul, 2022 16:59 IST|Sakshi

ఐపీఎల్‌కు సంబంధించి బీసీసీఐ కార్యదర్శి జై షా చెప్పిందే అక్షరాల నిజమైంది. నివేదికల ప్రకారం.. ఐసీసీ 2023-27 ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రాం (ఎఫ్‌టీపీ)లో ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ సింహ భాగాన్ని దక్కించుకుంది. తదుపరి ఎఫ్‌టీపీలో ఐపీఎల్‌ను రెండున్నర నెలల పాటు నిర్వహించుకునేందుకు ఐసీసీ పచ్చజెండా ఊపింది. ఐపీఎల్‌తో పాటు ఆస్ట్రేలియాలో జరిగే బిగ్‌ బాష్‌ లీగ్‌, ఇంగ్లండ్‌ వేదికగా జరిగే హండ్రెడ్‌ లీగ్‌లు కూడా ఎఫ్‌టీపీలో తమ బెర్తులను పొడిగించుకున్నాయి. ఈ మేరకు ఐసీసీ ఎఫ్‌టీపీని రూపొందిచినట్లు తెలుస్తోంది. 

తాజా సవరణలతో ఐపీఎల్‌ మార్చి చివరి వారంలో ప్రారంభమైన జూన్‌ మొదటి వారంలో (రెండున్నర నెలలు) ముగుస్తుంది. ఈ ఏడాది ఐపీఎల్‌లో కొత్తగా రెండు జట్లు ఎంటర్‌ కావడంతో మ్యాచ్‌ల సంఖ్య 60 నుంచి 74కు పొడిగించబడగా.. ఈ సంఖ్య 2023, 2024 సీజన్లలో ఆలాగే కొనసాగి.. 2025, 2026 ఎడిషన్లలో 84కు, 2027 సీజన్‌లో 94కు చేరుతుంది. ఐపీఎల్‌ విండో పొడిగించబడినప్పటికీ.. ఇప్పట్లో ఫ్రాంచైజీల సంఖ్య పెంచే ఆలోచన లేదని బీసీసీఐ తెలపడం కొసమెరుపు. ఇదిలా ఉంటే, ఐసీసీ 2023-27 ఫ్యూచర్‌ టూర్‌ ప్రోగ్రాంలో ఐసీసీ విండో పొడిగింపుపై జై షా గత నెలలోనే ట్వీట్‌ చేశాడు. షా చెప్పినట్లుగానే ఐసీసీ తమ ఎఫ్‌టీపీలో ఐపీఎల్‌కు అగ్రతాంబూలం అందించింది. 
చదవండి: అందుకే బీసీసీఐ కోహ్లిని తప్పించే సాహసం చేయలేకపోతుంది..!

>
మరిన్ని వార్తలు