నల్లమల ఘాట్‌ రోడ్‌లోనూ డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌

16 Jul, 2022 16:59 IST|Sakshi
శ్రీశైలం ఘాట్‌ రోడ్డు

ప్రమాదాల నివారణకు స్పీడ్‌ గన్‌లతో పరిశీలన

వాహనాలను వేగంగా నడిపితే జరిమానా

బ్రీత్‌ ఎనలైజర్లతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు

కఠిన చర్యలకు ఉపక్రమిస్తున్న పోలీస్‌శాఖ

అసలే దట్టమైన నల్లమల అభయారణ్యం.. ఎత్తయిన ఘాట్‌ రోడ్డు.. భారీ మలుపులు.. వాహనదారుల అజాగ్రత్తలతో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్నాయి. ఏదైనా ప్రమాదం జరిగితే రెండువైపులా భారీగా నిలిచిపోతున్న వాహనాలు.. గంటల తరబడి ట్రాఫిక్‌ జామ్‌.. సంఘటన స్థలానికి అంబులెన్స్, పోలీసు వాహనాలు చేరుకునేందుకు కూడా అష్టకష్టాలు పడాలి.. ఈలోపు క్షతగాత్రుల ప్రాణాలు పోయే పరిస్థితి నెలకొని ఉంది.  వీటిని దృష్టిలో ఉంచుకుని శ్రీశైలం, కర్నూలు ఘాట్‌ రోడ్లలో వాహన ప్రమాదాల నివారణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. స్పీడ్‌ గన్లు, బ్రీత్‌ ఎనలైజర్లతో తనిఖీలు చేయడం.. నిబంధనలు ఉల్లంఘిస్తే భారీ జరిమానాలతో చెక్‌ పెడుతున్నారు. 

పెద్దదోర్నాల: 
► శ్రీశైలం వైపు వేగంగా వెళ్తున్న ఓ టూరిస్టు బస్సు ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇవ్వబోయి అదుపుతప్పి తుమ్మలబైలు వద్ద బోల్తాపడిన సంగతి పాఠకులకు విధితమే. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ గాయపడకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 

► మూడు రోజుల కిందట ఓ కారు శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో సాక్షి గణపతి ఆలయ సమీపంలో బోల్తా పడి నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదానికి అతివేగమే కారణంగా తెలుస్తోంది. 


ఇలాంటి ప్రమాదాల నివారణకు పోలీసు శాఖ ప్రత్యేక కార్యాచరణతో రంగంలోకి దిగింది. అధిక శాతం వాహనదారులకు ఘాట్‌ రోడ్లపై అవగాహన లేకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం వలనే ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తించింది. అతివేగం కారణంగా జరుగుతున్న అనర్థాలపై వాహనదారులకు అవగాహన కల్పిస్తోంది. ప్రమాదాల నివారణకు కసరత్తు చేస్తోంది. జిల్లాలోని సమస్యాత్మక రోడ్లతో పాటు అత్యంత ప్రమాదకర రోడ్లుగా నల్లమల అభయారణ్యంలోని శ్రీశైలం, కర్నూలు ఘాట్‌ రోడ్లను గుర్తించారు. ఘాట్‌ రోడ్లలో తరచూ జరుగుతున్న ప్రమాదాల నివారణకు లేజర్‌ స్పీడ్‌ గన్లతో పరిశీలించి వాహనాల మితిమీరిన వేగాన్ని కట్టడి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడిపే వారికి కూడా జరిమానాలు విధించేందుకు బ్రీత్‌ ఎనరైజర్‌ పరీక్షలు నిర్వహిస్తున్నారు. 


బ్రీత్‌ ఎనలైజర్‌తో వాహనదారులకు పరీక్షలు..

మండల పరిధిలోని శ్రీశైలం ఘాట్‌ రోడ్డుతో పాటు కర్నూలు రహదారిపై వాహనదారులకు బ్రీత్‌ ఎనలైజర్‌ పరీక్షలు నిర్వహించే కార్యక్రమాన్ని పోలీసులు చేపట్టారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న పలువురిపై కేసులు నమోదు చేస్తున్నారు. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం వలన అధిక శాతం ప్రమాదాలు జరుగుతున్నాయని తేలడంతో డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. వ్యక్తిగత తప్పిదాల వలనే రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు చెబుతున్నారు. దానివలన ఏ తప్పూ చేయని ఎదుటి వ్యక్తుల ప్రాణాలు కూడా పోతున్నాయి. ఘాట్‌ రోడ్లపై 40 కి.మీ వేగానికి మించి ప్రయాణించడం ప్రమాదకరమని, సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపరాదని పోలీసులు హెచ్చరిస్తున్నారు. 


మితిమీరిన వేగంతోనే తరుచూ ప్రమాదాలు..

మితిమీరిన వేగం, వాహనాలను నడిపే సమయంలో నిర్లక్ష్యం కారణంగానే ఘాట్‌ రోడ్లపై ఎక్కువగా వాహన ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయని అధికారులు గుర్తించారు. పెద్దదోర్నాల మండల కేంద్రం నుంచి శ్రీశైల పుణ్యక్షేత్రానికి 50 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అదేవిధంగా కర్నూలు రోడ్డులోని రోళ్లపెంట నుంచి మండల కేంద్రం వరకు 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఈ రెండు రహదారులూ ఘాట్‌ రోడ్లే. ఈ మార్గాలలో నిత్యం వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. రాష్ట్రంతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది ప్రయాణికులు, భక్తులు వందలాది వాహనాల్లో శ్రీశైలం వెళ్తారు. కొన్నేళ్లుగా ఘాట్‌ రోడ్లలో అధికంగా ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ ప్రమాదాలకు అతివేగమే ప్రధాన కారణమని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

వీటిని అరికట్టేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు చేపట్టింది. జిల్లాలోని ముఖ్య రహదారులపై ప్రయాణించే వాహనాల వేగాన్ని నియంత్రించేందుకు అధికారులు లేజర్‌ గన్‌లను వినియోగిస్తున్నారు. పరిమితికి మించిన వేగంతో వెళ్లే వాహనాలకు జరిమానాలు, ఈ–చలానాలు విధిస్తున్నారు. రాయలసీమ ప్రాంతం నుంచి రాజధానికి వెళ్లే రహదారులతో పాటు, అత్యంత క్లిష్టమైన శ్రీశైలం ఘాట్‌ రోడ్డులో స్పీడ్‌ గన్‌లను ఏర్పాటు చేసి వేగ నియంత్రణకు చర్యలు చేపడుతున్నారు. మితిమీరిన వేగంగా వెళ్తున్న వాహనాలను కంట్రోలు చేసేందుకు స్పీడు గన్లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. 

వేగ నియంత్రణకు పటిష్ట చర్యలు                
మితిమీరిన వేగంతో ప్రయాణించే వాహనాల వలనే ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. అందువలన అతివేగంతో ప్రయాణించే వాహనాలను గుర్తించేందుకు ఘాట్‌ రోడ్లలో స్పీడ్‌ గన్లను వినియోగిస్తున్నాం. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌ పరీక్షలు కూడా నిర్వహించి జరిమానాలు విధిస్తున్నాం. దీనివలన రోడ్డు ప్రమాదాలను నియంత్రించగలుగుతున్నాం. వాహనదారులు మద్యం సేవించి వాహనాలు నడపటం నేరం. సెల్‌ఫోన్లు మాట్లాడుతూ వాహనాలు నడపటం అనర్థదాయకం. 
- మారుతీకృష్ణ, సీఐ, యర్రగొండపాలెం  

మరిన్ని వార్తలు