Ranji Trophy 2022: మ‌నీశ్ పాండే విధ్వంసం.. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో వీర‌విహారం

17 Feb, 2022 20:32 IST|Sakshi

Manish Pandey: రంజీ ట్రోఫీ 2022లో భాగంగా ఇవాళ రైల్వేస్‌తో మొద‌లైన మ్యాచ్‌లో క‌ర్ణాట‌క కెప్టెన్ మ‌నీశ్ పాండే విశ్వరూపం చూపించాడు. సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ టీ20 త‌ర‌హాలో విధ్వంసం సృష్టించాడు. బౌండ‌రీలు, సిక్స‌ర్ల‌తో ఆకాశ‌మే హద్దుగా చెల‌రేగిపోయాడు. 121 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో 156 ప‌రుగులు సాధించాడు. మ‌రో ఎండ్‌లో క్రిష్ణ‌మూర్తి సిద్ధార్థ్ సైతం అజేయ‌మైన శ‌త‌కం (221 బంతుల్లో 121 బ్యాటింగ్‌; 17 ఫోర్లు, 2 సిక్స‌ర్లు)తో రాణించ‌డంతో తొలి రోజు ఆట ముగిసే స‌మ‌యానికి క‌ర్ణాట‌క జ‌ట్టు 5 వికెట్ల న‌ష్టానికి 392 ప‌రుగుల భారీ స్కోర్ చేసింది. 

కాగా, మ‌నీశ్‌ పాండే ధ‌నాధ‌న్ ఇన్నింగ్స్ క‌ర్ణాట‌క రంజీ జ‌ట్టు కంటే అత‌న్ని ఇటీవ‌లే కొనుగోలు చేసిన ల‌క్నో సూప‌ర్ జెయింట్స్ ఐపీఎల్ జ‌ట్టుకే అధిక‌ ఆనందాన్ని క‌లిగించింది. కేఎల్ రాహుల్ సార‌ధ్యంలోని ల‌క్నో జ‌ట్టు మెగా వేలంలో మ‌నీష్ పాండేను 4.6 కోట్ల‌కు కొనుగోలు చేసింది. మ‌నీశ్‌పై ఎల్ఎస్‌జే భారీ అంచ‌నాలు పెట్టుకుంది. 

ఇదిలా ఉంటే, మ‌నీశ్ పాండే ప్రాతినిధ్యం వ‌హిస్తున్న క‌ర్ణాట‌క జ‌ట్టుకే ఆడుతున్న పంజాబ్ కింగ్స్ ఆట‌గాడు మ‌యాంక్ అగర్వాల్ (16), రాజ‌స్థాన్ రాయల్స్ ప్లేయ‌ర్‌ దేవ్‌ద‌త్ ప‌డిక్క‌ల్ (21) దారుణంగా నిరాశ‌ప‌రిచారు. వీరిద్ద‌రు క‌ర్ణాట‌క త‌ర‌ఫున ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగి త‌క్కువ స్కోర్ల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ప‌డిక్క‌ల్‌కు ఆర్ఆర్ జ‌ట్టు 7.75 కోట్లకు వేలంలో కొనుగోలు చేయ‌గా, మ‌యాంక్‌ను పంజాబ్ జ‌ట్టు 12 కోట్ల‌కు డ్రాఫ్ట్ చేసుకున్న విష‌యం తెలిసిందే. 
చ‌ద‌వండి: సూప‌ర్ సెంచ‌రీతో ఫాంలోకి వచ్చిన రహానే
 

మరిన్ని వార్తలు