TN Vs ARNP: జగదీశన్‌ విధ్వంసం.. చెలరేగిన సిద్దార్థ! రికార్డు విజయం.. ఏకంగా 435 పరుగుల తేడాతో

21 Nov, 2022 17:53 IST|Sakshi
నారాయణ్‌ జగదీశన్‌ (PC: Crictracker)

Vijay Hazare Trophy 2022-  Narayan Jagadeesan: దేశవాళీ వన్డే టోర్నమెంట్‌ విజయ్‌ హజారే ట్రోఫీ-2022లో తమిళనాడు సంచలన విజయం సాధించింది. అరుణాచల్‌ ప్రదేశ్‌తో సోమవారం తలపడ్డ తమిళనాడు జట్టు ఏకంగా 435 పరుగుల తేడాతో గెలుపొందింది. తద్వారా లిస్ట్‌ ‘ఏ’ క్రికెట్‌(పరిమిత ఓవర్లు)లో అత్యంత భారీ తేడాతో గెలిచిన జట్టుగా చరిత్ర సృష్టించింది. 

ఎలైట్‌ గ్రూప్‌- సీలో ఉన్న తమిళనాడు బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా అరుణాచల్‌ ప్రదేశ్‌తో మ్యాచ్‌ ఆడింది. టాస్‌ గెలిచి తొలుత బౌలింగ్‌ ఎంచుకున్న అరుణాచల్‌ జట్టుకు తమిళనాడు ఓపెనర్లు సాయి సుదర్శన్‌, నారయణ్‌ జగదీశన్‌ చుక్కలు చూపించారు.

బౌండరీలు, సిక్సర్ల వర్షం
సాయి 102 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్స్‌లతో 154 పరుగులు సాధించగా.. వికెట్‌ కీపర్‌ బ్యాటర్‌ జగదీశన్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. 141 బంతుల్లో 25 ఫోర్లు, 15 సిక్సర్ల సాయంతో డబుల్‌ సెంచరీ చేశాడు. 277 పరుగులతో రాణించి జట్టు 506 పరుగుల భారీ స్కోరు చేయడంలో కీలక పాత్ర పోషించాడు.

చెలరేగిన సిద్ధార్థ
కొండంత లక్ష్యంతో బరిలోకి దిగిన అరుణాచల్‌ ప్రదేశ్‌కు ఆదిలోనే షాకిచ్చారు తమిళనాడు బౌలర్లు. ఓపెనర్లు నీలమ్‌ ఓబి(4), రోషన్‌ శర్మ(2)ను సిలంబరసన్‌ ఆరంభంలోనే పెవిలియన్‌కు పంపాడు. ఇక తర్వాత సాయి కిషోర్‌(ఒక వికెట్‌), సిద్దార్థ్‌(7.4 ఓవర్లలో 12 మాత్రమే పరుగులు ఇచ్చి 5 వికెట్లు), మహ్మద్‌(2 వికెట్లు) మిగతా బ్యాటర్ల పనిపట్టారు.

71 పరుగులకే కుప్పకూలిన అరుణాచల్‌
తమిళనాడు బౌలర్ల విజృంభణతో అరుణాచల్‌ ప్రదేశ్‌ ఆటగాళ్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. దారుణ వైఫల్యం మూటగట్టుకున్నారు. వరుసగా 4, 2, 11, 14, 17, 0, 6, 3(నాటౌట్‌), 0,0,0 స్కోర్లు నమోదు చేశారు. దీంతో 28. 4 ఓవర్లలో కేవలం 71 పరుగులు మాత్రమే చేసి అరుణాచల్‌ జట్టు ఆలౌట్‌ అయింది. 435 పరుగుల తేడాతో బాబా అపరాజిత్‌ బృందం జయభేరి మోగించింది. ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో.. సమిష్టి కృషితో సంచలన విజయం అందుకుంది.

చదవండి: Narayan Jagadeesan: 38 బంతుల్లోనే సెంచరీ.. పలు ప్రపంచ రికార్డులు బద్ధలు
క్రీడల చరిత్రలో క్రికెట్‌, ఫుట్‌బాల్‌ ప్రపంచ కప్‌లు ఆడిన ఆసీస్‌ ప్లేయర్‌ ఎవరో తెలుసా..?

మరిన్ని వార్తలు