న్యూజిలాండ్‌తో తొలి వన్డే.. సూర్య భాయ్‌ బోణీ శతకం ఖాయమేనా..?

24 Nov, 2022 21:11 IST|Sakshi

IND VS NZ 1st ODI: భారత్‌-న్యూజిలాండ్‌ జట్ల మధ్య ఆక్లాండ్‌ వేదికగా రేపు (నవంబర్‌ 25) తొలి వన్డే జరుగనున్న విషయం తెలిసిందే. భారతకాలమానం ప్రకారం ఈ మ్యాచ్‌ ఉదయం 7 గంటలకు ప్రారంభమవుతుంది. వరుణుడు కటాక్షిస్తే.. ఈ మ్యాచ్‌ 50 ఓవర్ల పాటు సాగే అవకాశం ఉంది. అయితే, వెదర్‌ ఫోర్‌కాస్ట్‌లో పలు మార్లు వర్షం అంతరాయం తప్పిదని పేర్కొని ఉంది. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు. వర్షం పడకూడదని దేవుళ్లను ప్రార్ధిస్తున్నారు. 

ఇదిలా ఉంటే, 3 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ను 1-0 తేడాతో కైవసం చేసుకుని జోరుమీదున్న టీమిండియా.. వన్డే సిరీస్‌పై కూడా కన్నేసింది. ధవన్‌ కెప్టెన్సీలో యువ భారత జట్టు.. కేన్‌ మామ టీమ్‌ను మట్టికరిపించాలని ఉరకలేస్తుంది. రేపు జరుగబోయే తొలి వన్డేలో అందరీ కళ్లు సూర్యకుమార్‌ యాదవ్‌పైనే ఉంటాయి. రెండో టీ20లో సుడిగాలి శతకం బాది ఊపు మీద ఉన్న స్కై.. వన్డే సిరీస్‌లో ఎలా చెలరేగి పోతాడోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వన్డేల్లో ఇప్పటివరకు సెంచరీ చేయని స్కై.. రేపటి మ్యాచ్‌లో బోణీ చేయడం ఖాయమని అతని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు 13 వన్డేలు ఆడిన అతను.. 34 సగటున, 98.84 స్ట్రయిక్‌ రేట్‌తో 340 పరుగులు చేశాడు. ఇందులో 2 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ గణాంకాలు చూసిన సూర్య అభిమానులు.. తమ ఆరాధ్య క్రికెట్‌ స్థాయికి ఈ గణాంకాలు కరెక్ట్‌ కాదని, రేపటి మ్యాచ్‌లో సెంచరీ చేసి లెక్కలను సరి చేస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇన్ని అంచనాల నడుమ రేపటి మ్యాచ్‌లో సూర్య భాయ్‌ ఏ మేరకు రాణిస్తాడో వేచి చూడాలి.  
 

మరిన్ని వార్తలు