CM KCR: హే సీటీలు గొట్టుడు గాదు.. నేనేమన్న యాక్టర్‌నా..

23 Jun, 2021 02:11 IST|Sakshi
వాసాలమర్రి బహిరంగ సభలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్‌

సాక్షి, యాదాద్రి: వాసాలమర్రి గ్రామసభలో సీఎం కేసీఆర్‌ తన చమత్కారాలతో నవ్వులు పూయించారు. కేసీఆర్‌ ప్రసంగం మొదలు పెడుతూ.. అన్నదమ్ములు, అక్కచెల్లెళ్లు అనగానే గ్రామస్తులు ఒక్కసారిగా చప్పట్లు కొట్టారు. కొందరు ఈలలు వేశారు. ఇది చూసిన సీఎం.. ‘‘నేనేమైనా సినిమా యాక్టర్‌నా.. సీటీలు వేస్తున్నరు..’’ అన్నారు. దీంతో అంతా ఒక్కసారిగా గొల్లుమన్నారు. ఇక ‘‘పంచాయతీరాజ్‌ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు వచ్చిండంటే ఊరికి చాలా పనులు జరుగుతయి. పెద్ద మనిషికి చప్పట్లు కొట్టండి..’’ అని సీఎం అన్నప్పుడు అంతా ఒక్కసారిగా నవ్వుతూ చప్పట్లు కొట్టారు. తర్వాత ‘‘వరంగల్‌ మున్సిపల్‌ కమిషనర్‌గా ఉన్న పమేలా సత్పతిని యాదాద్రి జిల్లాకు కలెక్టర్‌గా వేశాం. ఆమె అక్కడ బాగా పనిచేశారు. దాంతో ఆమెను వరంగల్‌ నుంచి తీయవద్దని నాతో కొందరు గొడవపడ్డారు కూడా. ఇప్పుడు ఆమెను మీ గ్రామ ప్రత్యేకాధికారిగా నియ మిస్తున్నా.. ఇక నుంచి తల్లి అయినా.. తండ్రి అయినా ఆమెనే’’ అని కేసీఆర్‌ అన్నప్పుడు చప్పట్లు మారుమోగాయి. ఇది చూసిన కేసీఆర్‌.. ‘మీ కలెక్టర్‌కు చప్పట్లు బాగా కొడుతున్నరుగా..’’ అనడంతో అందరూ నవ్వారు. (చదవండి: ఈ సీఎం కేసీఆర్‌ మీ చేతిలో ఉన్నాడు)

ఊరికే కాదు.. జిల్లా మొత్తానికి నిధులు
సీఎం కేసీఆర్‌ వాసాలమర్రికి నిధులు మంజూరు చేస్తారని అందరూ ఉత్కంఠతో ఎదురు చూస్తుండగా.. ఆయన యాదాద్రి జిల్లాలోని 421 గ్రామ పంచాయతీలు, ఆరు మున్సిపాలిటీలకు ని«ధులు ప్రకటించి ఆశ్చర్యపరిచారు. ఒక్కో పంచాయతీకి రూ.25 లక్షల చొప్పున.. మేజర్‌ మున్సిపాలిటీ భువనగిరికి రూ.కోటి, నూతన మున్సిపాలిటీలైన ఆలేరు, యాదగిరిగుట్ట, చౌటుప్పల్, భూదాన్‌ పోచంపల్లి, మోత్కూరులకు రూ.50 లక్షల చొప్పున మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు.

వాళ్లు లేకుంటే గుడ్డేలుగుల్లా ఉంటం
గ్రామ సర్పంచ్, వార్డు సభ్యులు దళితవాడ, చాకలివాడ, రైతుల వాడలకు రోజూ వెళ్లి మాట్లాడాలని, వారి సమస్యలు తెలుసుకోవాలని సీఎం కేసీఆర్‌ సూచించారు.‘‘చాకలి, మంగలి వాళ్లు సమాజ సేవకులు. వారు చేసేది శుభ్రత. వారు పనిచేయకపోతే మనం గుడ్డేలుగుల్లా (ఎలుగు బంట్లలా) ఉంటం. వారు పొట్టకోసం చేసినా ప్రజలకు మంచి చేస్తున్నారు. వారిని గౌరవించాలి. వృద్ధిలోకి తీసుకురావాలి..’’ అని పిలుపునిచ్చారు.

మహిళలతో సహపంక్తి..  సర్పంచ్‌పై ఆరా..
సీఎం కేసీఆర్‌ గ్రామస్తులతో కలిసి భోజనం చేశారు. ఆయన పక్కన గ్రామానికి చెందిన చెన్నూరి లక్ష్మి, ఆకుల ఆగమ్మ కూర్చున్నారు. కేసీఆర్‌ భోజనం చేస్తూ వారితో మాట్లాడారు. ‘మీ సర్పంచ్‌ ఎలాంటోడు, ఎంపీటీసీ మంచోడేనా’ అంటూ ఆరా తీశారు. ‘‘సర్పంచ్‌ అంజయ్య, ఎంపీటీసీ మంచోళ్లే సార్‌. మా ఊర్లో ఏ కష్టమున్నా ఇద్దరూ వస్తరు. మంచి చెడ్డ అర్సుకుంటరు..’’ అని వారు చెప్పారు. భోజనం చేశాక కేసీఆర్‌ కొందరు గ్రామస్తులకు స్వయంగా వడ్డించారు. ఒకరిద్దరు మహిళల దగ్గరికి వెళ్లి భోజనం ఎలా ఉంది? అంటూ పలకరించారు. తర్వాత తనతో కలిసి భోజనం చేసిన మహిళలను స్వయంగా వెంట తీసుకెళ్లి వేదిక మీద కూర్చోబెట్టారు.

>
మరిన్ని వార్తలు