Telangana Medical Health Department: ఒక్కో సహజ ప్రసవానికి రూ.3వేలు 

6 Aug, 2022 02:02 IST|Sakshi

రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ కీలక ఉత్తర్వులు 

85 శాతం సహజ ప్రసవాలు చేస్తేనే ప్రోత్సాహకం

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఆస్పత్రుల్లో సహజ ప్రసవాలను ప్రోత్సహిస్తూ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. సహజ ప్రసవాలు చేసే వైద్య సిబ్బందికి ప్రోత్సాహకాలు ఖరారు చేస్తూ వైద్య, ఆరోగ్యశాఖ కార్యదర్శి రిజ్వీ శుక్రవారం ఉత్తర్వులు జారీచేశారు. దీని ద్వారా ఒక్కో సహజ ప్రసవానికి రూ.3 వేల చొప్పున చెల్లిస్తారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్‌సీ) మొదలుకొని బోధనాస్పత్రుల వరకూ అన్ని స్థాయిల ఆస్పత్రులకు ఈ నిబంధన వర్తిస్తుందని రిజ్వీ పేర్కొన్నారు.

వివిధ స్థాయిల ఆస్పత్రుల్లో 2021–22 సంవత్సరంలో ఎన్ని సహజ ప్రసవాలు చేశారన్న విషయాన్ని లెక్కించి, ఆ మొత్తంలో 85 శాతాన్ని గీటురాయిగా పరిగణిస్తారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిబంధనల ప్రకారం ఆయా ఆస్పత్రుల్లో చేసే ప్రసవాల్లో కనీసం 85 శాతం సహజ కాన్పులు చేయాల్సి ఉంటుంది. అంటే 85 శాతం కంటే అధికంగా చేసిన సహజ కాన్పులను లెక్కించి, ఒక్కో కాన్పుకు రూ.3 వేల చొప్పున వైద్య సిబ్బందికి అందజేస్తారు.

ఇప్పటికే ఏయే స్థాయి ఆస్పత్రుల్లో సగటున నెలకు ఎన్ని ప్రసవాలు చేస్తున్నారు? అందులో సహజ ప్రసవాలెన్ని? అనే వివరాలు సేకరించారు. ఆ ప్రకారం ఈ నిర్ణయం తీసుకున్నారు. బోధనాస్పత్రుల్లో నెలకు 350, జిల్లా ఆస్పత్రులు, మాతాశిశు సంరక్షణ ఆస్పత్రుల్లో నెలకు 250, ఏరియా ఆస్పత్రుల్లో నెలకు 150, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 50, 24 గంటలపాటు పనిచేసే ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 10, సాధారణ పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో నెలకు 5 సహజ ప్రసవాలను గీటురాయిగా నిర్ణయించారు.

ఆ మైలురాయిని అధిగమించిన ఒక్కో ప్రసవానికి వైద్య సిబ్బందిలో డాక్టర్‌కు రూ.వెయ్యి, మిడ్‌వైఫ్‌/స్టాఫ్‌నర్సు/ఏఎన్‌ఎంకు రూ.వెయ్యి, ఆయా/పారిశుధ్య సిబ్బందికి రూ.500, ఏఎన్‌ఎంకు రూ.250, ఆశా కార్యకర్తకు రూ.250 చొప్పున మొత్తంగా రూ.3 వేలు ఒక్కో కాన్పుకు చెల్లిస్తారు. ప్రతి ప్రసవ సమాచారాన్ని ఆస్పత్రిలో ఆన్‌లైన్‌లో ఎప్పటికప్పుడు నమోదు చేయాల్సి ఉంటుందని రిజ్వీ వివరించారు.   

>
మరిన్ని వార్తలు