వలపు వలలో చిక్కుకున్న గ్రామ ప్రజాప్రతినిధి.. ట్విస్ట్‌ ఇచ్చిన మహిళ

5 Aug, 2021 12:32 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

ఆస్తి రాసివ్వమని బ్లాక్‌మెయిలింగ్‌కు పాల్పడ్డ మహిళ

లైంగికంగా వేధించాడంటూ పోలీసులకు ఫిర్యాదు

విచారణ ప్రారంభించిన పోలీసులు 

సాక్షి,కామారెడ్డి: ఓ మహిళ విసిరిన వలపు వలలో గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు విలవిల్లాడుతున్నారు. దీని నుంచి రక్షించుకునేందుకు ఆయన పడరానిపాట్లు పడుతున్నాడు. అటు పోలీస్‌ కేసు, ఇటు మహిళ బ్లాక్‌ మెయిల్‌ వ్యవహారంలో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. కామారెడ్డి జిల్లాలోని గాంధారి మండలంలో మారుమూల గ్రామ ప్రజాప్రతినిధి ఒకరు జిల్లా కేంద్రం అయినా కామారెడ్డి పట్టణంలో నివసిస్తున్నాడు. ఆయనకు కాకతీయ నగర్‌లో రెండస్తుల ఇళ్లు ఉంది. సదరు ప్రజాప్రతినిధి ఇంటి అడ్రస్‌ను పట్టుకుని వచ్చిన మహిళలు తమకు ఇళ్లు కిరాయి కావాలంటూ అడిగారు. అందులో ఓ యువతి మర్యాదగా మాట్లాడుతూ.. ఆ ప్రజాప్రతినిధిని నమ్మించి ఇళ్లు కిరాయికి ఇచ్చే లా చేసుకుంది. ఆ అద్దె ఇంట్లో చేరిన ఆ మహిళ కొద్ది రోజులకే సదరు ప్రజాప్రతినిధితో గొడవ మొదలు పెట్టింది. నీ ఆస్తిలో వాటా ఇవ్వాలని లేదంటే తనను లైంగికంగా వేధింనట్లు పోలీ సులకు ఫిర్యాదు చేస్తానంటూ బ్లాక్‌మెయిలింగ్‌కు దిగింది.

ఆ ప్రజాప్రతినిధి మొండిగా వ్యవహరించడంతో దేవునిపల్లి పోలీసులను ఆశ్రయింంది. అక్కడ పోలీసులు మహిళ ఫిర్యా దు మేరకు కేసు నమోదు చేశారు. అయితే తాను ఆ మహిళ పట్ల ఏనాడు అసభ్యంగా ప్రవర్తించలేదని ఆ ప్రజాప్రతినిధి ఎల్లారెడ్డి నియోజకవర్గ ముఖ్య ప్రజాప్రతినిధితో మొరపెట్టుకున్నాడు. దీంతో పోలీస్‌ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ మహిళ బ్లాక్‌మెయిలింగ్‌ వ్యవహారంపై పోలీస్‌ ఉన్నతాధికారులు కూపీ లాగారు. గతంలో లింగంపేట, ఎల్లారెడ్డి ప్రాంతాల్లో ఆ మహిళ పలువురిని బ్లాక్‌ మెయిలింగ్‌ చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది. దీంతో ఆ ప్రజాప్రతినిధిపై చర్యలు తీసుకోకుండా కేసును పెండింగ్‌లో ఉంచి దర్యాప్తు మొదలు పెట్టారు. ఆర్థికంగా బలంగా ఉన్న వ్యక్తులకు టార్గెట్‌గా చేసుకుని ఆ మహిళ ఈ రకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై పోలీస్‌ ఉన్నతాధికారులను వివరణ కోరగా విచారణ జరుపుతున్నామని త్వరలోనే అన్ని విషయాలు తెలసుస్తాయని పేర్కొన్నారు.
 

మరిన్ని వార్తలు