అద్దె భవనాల్లో... | Sakshi
Sakshi News home page

అద్దె భవనాల్లో...

Published Mon, Feb 5 2018 3:31 PM

anganwadi centers in rental buildings - Sakshi

జైనథ్‌ : శిశువులకు పూర్వ ప్రాథమిక విద్యనందిస్తూ వారి మానసిక, శారీరక వికాసానికి ఎంతగానో దోహదపడే అంగన్‌వాడీ కేంద్రాలకు సొంత భవనాలు కరువయ్యాయి. ప్రస్తుతం గ్రామాల్లో చాలీచాలని వసతుల నడుమ చిన్న చిన్న పెంకుటింట్లలో కేంద్రాలను కొనసాగిస్తున్నారు. చిన్నపాటి వర్షం కురిసిన కూడ కేంద్రాలు నడిపే పరిస్థితి కనిపిస్తలేదు. దీంతో శిశువులు, గర్బిణులు, బాలింతలతో పాటు కేంద్రాల్లో పనిచేసే కార్యకర్తలు, ఆయాలు సైతం నానా అవస్థలు పడుతున్నారు. 

మధ్యలోనే నిలిచిన మోడల్‌ కేంద్రం 
మండల కేంద్రంలో బీసీ హస్టల్‌ వెనుక వైపు నిర్మించిన మోడల్‌ అంగన్‌వాడీ కేంద్రం పనులు మధ్యలోనే అగిపోయాయి. 2004లో మొదలైన ఈ పనులు దాదాపు 11 సంతత్సరాలు గడుస్తున్నా కొలిక్కి రాలేదు. నిధుల కొరతతో అప్పట్లో ఈ పనులు నిలిచిపోవడంతో ప్రస్తుతం అది పశువులకు స్థావరంగా మారింది. కొద్దిపాటు ఖర్చుతో ఈ భవనం పూర్తిచేసి, ఒక కేంద్రాన్ని నడిపే అవకాశం ఉన్నప్పటికీ ఉన్నతా«ధికారులు ఇటువైపు దృష్టి సారించడం లేదు. దీంతో చుట్టు పిచ్చిమొక్కలు, ముండ్ల పొదలతో ఈ భవనం పూర్తి కాకుండానే శిథిలావస్థకు చేరుకుంది. 

కొనసాగుతున్న కొత్త భవనాలు...
మండలంలోని జైనథ్‌–1, ఆకోలి, కామాయి, గిమ్మ–3, కౌఠ, పార్డి(బి), జైనథ్‌–2 కేంద్రాలకు గత సంవత్సరమే స్వంత భవనాలు మంజూరైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఒక్కొక్క భవనానికి రూ.6.25లక్షలు కేటాయించినప్పటికీ  నిధులు లేక భవన నిర్మాణ పనులు మొదలు కానీ దుస్థితి నెలకొంది. భోరజ్, మార్గుడ గ్రామాల్లో పనులు ప్రారంభమైనప్పటికీ గత సంవత్సర కాలంగా పూర్తి కాలేదు. దీంతో నిర్వాహకులకు ఇబ్బందులు తప్పడం లేదు. 

10 కేంద్రాలకే  సొంత భవనాలు...
మండలంలో 29 గ్రామ పంచాయితీల పరిధిలో 56 గ్రామాల్లో 70 అంగన్‌వాడీ కేంద్రాలున్నాయి. వీటిలో 66 కేంద్రాలకు ప్రస్తుతం రెగ్యూలర్‌ టీచర్లు ఉండగా, ఇంకా నాలుగు కేంద్రాలకు ఇన్‌చార్జిలు ఉన్నారు. ఈ కేంద్రాల నిర్వహణ కోసం 66 మంది కార్యకర్తలు, 63 మంది ఆయాలు, ఒక సూపర్‌వైజర్‌ పనిచేస్తున్నారు. ఈ 66 కేంద్రాల్లో కేవలం కూర, జైనథ్‌–3, కరంజి(బి), లక్ష్మీపూర్, సావాపూర్, బాలాపూర్, లేఖర్‌వాడ, సిర్సన్న, గూడ, పార్డి(బి) గ్రామాల్లోని 10 కేంద్రాలకు మాత్రమే సొంత భవనాలు ఉన్నాయి. ఇంకా 15 కేంద్రాలు పాఠశాల భవనాలు, జీపీ భవనాల్లో సాగుతున్నాయి. మిగిలిన 41 కేంద్రాలు మాత్రం అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. కొన్ని మారుమూల గ్రామాల్లో అద్దెకు భవనాలు కూడ దొరకని పరిస్థితి. గత్యంతరం లేక తడకలు, ఇనుప రేకులతో ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

ప్రారంభానికి ముందే పగుళ్లు...
మండలంలోని భోరజ్‌ గ్రామంలోని ప్రాథమిక పాఠశాల ఆవరణ రూ.6.5లక్షలతో పక్క అంగన్‌వాడీ కేంద్రం నిర్మాణానికి 2014లో నిధులు మంజూరయ్యాయి. టెండర్‌ దక్కించుకున్న కాంట్రాక్టర్‌ నాసికరంగా పనులు చేపట్టడంతో భవనం పూర్తికాక ముందే పగుళ్లు తేలాయి. ఇప్పటికీ ఇంకా కిటికీలు, తలుపులు బిగించడం వంటి పనులు అలానే ఉన్నాయి. ఇంకా పూర్తి స్థాయిలో పనులు పూర్తికాకముందే భవనానికి పగుళ్లు తేలడంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొదటి నుంచి పనులపై అధికారులు, సంబంధిత కాంట్రాక్టర్‌ తీవ్రంగా నిర్లక్ష్యం వహించారని గ్రామస్తుల చెబుతున్నారు. దీనికి తోడు సరిగా క్యూరింగ్‌ కూడ చేపట్టకపోవడంతో ఎటుచూసిన పగుళ్లే దర్శనమిస్తున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఇటువైపు దృష్టి సారించాలని ఆయా గ్రామస్తులు కోరుకుంటున్నారు. 

Advertisement
Advertisement