Sakshi News home page

రైతు చుట్టూ రాజకీయం

Published Sun, Mar 18 2018 10:52 AM

political parties focus on Farmers insurance schemes - Sakshi

అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర బడ్జెట్‌లో రైతులక్ష్మి, రైతు బీమా పథకాలు, ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు మంజూరుపై ఆశలు పెట్టుకుంది. ఇటీవల సీఎం కేసీఆర్‌ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ఆదిలాబాద్‌ సభలో జాతీయ పార్టీలు రైతుల సమస్యలను పరిష్కరించడంలో విఫలమయ్యాయని పేర్కొంటూనే రైతు సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. 

కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర నేతలందరూ ఆరు నెలల కిందటే రైతుబాటలో భాగంగా ఉట్నూర్‌లో సభ నిర్వహించారు. ఇటీవల బస్సు యాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లాకేంద్రంలో నిర్వహించిన సభలోనూ నేతలందరు పాల్గొన్నారు. అధికారంలోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టులను రూపొందిస్తామని, రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు.

బీజేపీ ఇటీవల ఆదిలాబాద్‌లో రైతు పంచా యతీ సభ నిర్వహించింది. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు పాల్గొన్నారు. దేశంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని, విత్తనాలు, ఎరువుల ధరలను తగ్గిస్తామని రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రైతు ఆత్మహత్యలు ఇక్కడే అధికంగా జరిగాయని రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు సంధించారు. 

సాక్షి, ఆదిలాబాద్‌: రాజకీయాలన్నీ రైతు చుట్టే పరిభ్రమిస్తున్నాయి. ముందస్తు ఎన్నికలు ఉంటాయన్న ఊహగానాల నేపథ్యంలో కర్షకులను ప్రసన్నం చేసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నాయి. హామీలతో రైతులను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఎన్ని కల ఏడాదిగా పేర్కొంటున్న ఈ సంవత్సరంలో అన్నదాతలను ప్రసన్నం చేసుకునేందుకు నేతలు పడరాని పాట్లు పడుతున్నారు. అధికారంలో ఉన్నప్పుడు జాతీయ పార్టీలు ఏమీ చేయలేకపోయాయని అధికార పార్టీ దుమ్మెత్తిపోస్తుండగా, ఎన్నికల ఏడాదిలో రైతులు గుర్తుకొచ్చారా అంటూ అధికార పార్టీపై ప్రతిపక్షాలు ఎదురుదాడికి దిగాయి. ఇటీవల రాష్ట్ర నేతలు జిల్లాలో పర్యటించి ప్రధానంగా రైతు సమస్యలనే ప్రస్తావిస్తూ రైతు ఎజెండాను ప్రకటించడం గమనార్హం. 

రైతు ఓటు బ్యాంకుపై గురి..
ఉమ్మడి జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం సుమారు 28లక్షల జనాభా ఉంది. ఇందులో 4లక్షల 39వేలకు పైగా రైతు కుటుంబాలు ఉన్నాయి. ఒక్క రైతు కుటుంబంలో సగటున నలుగురు సభ్యులున్నా సుమారు 17.50 లక్షలకు పైగా జనం వ్యవసాయంపైనే ప్రత్యక్షంగా, పరోక్షంగా ఆధారపడి ఉన్నదన్నది స్పష్టమవుతుంది. జనాభాలో సుమారు 62 శాతానికి పైగా  వ్యవసాయంతో ముడిపడి ఉండడంతో ఎన్నికల సమయంలో రాజకీయ పార్టీలన్నీ రైతు ఎజెండాను మోసుకొని రావడం కనిపిస్తుంది. ఈ పరంపరలోనే 2019 ఎన్నికలకు ఏడాది ముందుగానే రైతు చుట్టూ రాజకీయం చక్కర్లు కొట్టడం ప్రారంభమైంది. 70 ఏళ్లు అధికారంలో ఉన్న జాతీయ పార్టీలు రైతుల కోసం ఏమీ చేయలేకపోయాయని రాష్ట్రంలో అధికార పార్టీ ధ్వజమెత్తుతుండగా, అధికారంలోకి వచ్చిన నాలుగేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా పరామర్శించని అధికార పార్టీ నేతలకు ఇప్పుడు రైతులు గుర్తుకురావడం వెనుక రాజకీయమే కారణమంటూ ప్రతిపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి. 

కొత్త ప్రాజెక్టులు, రిజర్వాయర్లు, బడ్జెట్‌ కేటాయింపులతో గురి..
అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర బడ్జెట్‌లో రైతులక్ష్మి పథకం ద్వారా వానకాలం, యాసంగి రెండు పంటలకు కలిపి ఎకరానికి రూ.8వేల చొప్పున పెట్టుబడి సాయం ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ పథకం ద్వారా ఉమ్మడి జిల్లాలో 4.39 లక్షల మంది రైతులకు సాగులో ప్రయోజనం దక్కనుంది. 5లక్షల బీమా పథకం కూడా రైతులను ఆకర్షిస్తుందని అధికార పార్టీ విశ్వసిస్తోంది. రైతు సమితుల ఏర్పాటు ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలు అందేలా చేస్తామని ప్రభుత్వం పేర్కొంటోంది.  అదే సమయంలో కొత్తగా కుప్టి ప్రాజెక్టు ప్రకటించడం ద్వారా బోథ్, ఖానాపూర్‌ నియోజకవర్గ రైతులపై దృష్టి పెట్టింది. దిగువ పెన్‌గంగ కింద గోముత్రి, పిప్పల్‌కోటి రిజర్వాయర్లను నిర్మిస్తామని చెప్పడం ద్వారా ఆదిలాబాద్, బోథ్‌ నియోజకవర్గాల రైతుల్లో ఆశలు నింపేందుకు ప్రయత్నం చేస్తోంది. రీడిజైన్‌ ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా రూపొందిస్తున్న ప్రాణహిత ప్రాజెక్టు ద్వారా> సిర్పూర్, ఆసిఫాబాద్, బెల్లంపల్లి, చెన్నూర్, మంచిర్యాల నియోజకవర్గాల రైతులకు ప్రయోజనం దక్కనుంది.

ఇటీవల బడ్జెట్‌లో ఈ ప్రాజెక్టుకు రూ.350 కోట్లు కేటాయించారు. అదేవిధంగా కడెం, సుద్దవాగు, స్వర్ణ, మత్తడివాగు, ఎన్టీఆర్‌ సాగర్, కుమురంభీం, జగన్నాథ్‌పూర్‌ ప్రాజెక్టులకు కూడా నిధులను కేటాయించారు. 24 గంటల విద్యుత్‌ ద్వారా సాగుకు ఊతం ఇచ్చామని, భూరికార్డుల ప్రక్షాళనతో రైతులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించామని చెబుతూ అధికార పార్టీ రైతులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలో పర్యటించారు. ప్రధానంగా ఆదిలాబాద్‌ సభలో జాతీయ పార్టీలు రైతుల సమస్యలను పరిష్కరిం చడంలో విఫలమయ్యాయని పేర్కొంటూనే రైతు సమస్యలపై జాతీయ స్థాయిలో పోరాడేందుకు తా ము సిద్ధంగా ఉన్నామని ప్రకటించడం గమనార్హం.

ఆరు నెలల కిందటే..
ఆరు నెలల కిందటే కాంగ్రెస్‌ పార్టీ రైతుబాట కార్యక్రమంలో భాగంగా ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లో పర్యటించింది. రాష్ట్ర ఇన్‌చార్జి కుంతియా, పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్‌పీ నాయకులు జానారెడ్డి, షబ్బీర్‌అలీ, తదితర నేతలు ఇందులో పాల్గొన్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టే ముందు కాంగ్రెస్‌ ఈ కార్యక్రమం చేపట్టింది. ఇటీవల బస్సు యాత్రలో భాగంగా నిర్మల్‌ జిల్లాకేంద్రంలో నిర్వహించిన సభలోనూ కాంగ్రెస్‌ రాష్ట్ర నేతలందరు పాల్గొన్నారు. ఈ నాలుగేళ్లలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా పరామర్శించిన సీఎం కేసీఆర్‌కు ఎన్నికల సమయంలో రైతులు గుర్తుకొచ్చారా అంటూ ఈ సభ వేదిక ద్వారా నేతలు ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో 2లక్షల ఎకరాలకు సాగునీరు అందేలా ప్రాజెక్టులను రూపొందిస్తామని చెప్పారు. ఏకకాలంలో రూ.2లక్షల రుణమాఫీ చేస్తామని చెబుతూ రైతులను ఆకర్షించే ప్రయత్నం చేశారు. రైతు సమితులను రద్దు చేస్తామని అధికార పార్టీపై దండయాత్ర ప్రకటించారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement