యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌..పట్టాలు తప్పిన వైద్యం | Sakshi
Sakshi News home page

యువర్‌ అటెన్షన్‌ ప్లీజ్‌..పట్టాలు తప్పిన వైద్యం

Published Wed, Jan 24 2018 8:03 AM

staff shortage in gunthakallu railway hospital - Sakshi

గుంతకల్లు: ఘనమైన చరిత్ర కలిగిన గుంతకల్లు రైల్వే ఆసుపత్రి క్రమంగా ప్రాభవం కోల్పోతోంది. ఉద్యోగుల పాలిట సంజీవనిగా పేరొందిన వైద్యాలయమే జబ్బు పడింది. చికిత్స నోచుకోక రోగులకు అరకొర వైద్య సేవలతో సరిపెట్టుకుంటోంది. ఆసుపత్రి పరిధిలో అనంతపురం, వైఎస్‌ఆర్‌ జిల్లా, చిత్తూరు, కర్నూలు, నెల్లూరు, మహబూబ్‌నగర్, రాయచూర్, గుల్బ ర్గా, బళ్లారి, వేలూరు జిల్లాలు ఉన్నాయి. 1960లో ఆరు పడకలతో ప్రారంభమైన ఆసుపత్రి ప్రస్తుతం 130 పడకల స్థాయికి చేరింది. 14వేల మంది కార్మికులతో పాటు 6వేల మంది రిటైర్డ్‌ ఉద్యోగులకు ఈ ఆసుపత్రి పెద్దదిక్కు. గుత్తి, ధర్మవరం, కడప, నందలూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, ద్రోణాచలం, రాయచూర్‌ కేంద్రాల్లో రైల్వే ఆరోగ్య ఉప కేంద్రాలను నిర్వహిస్తున్నారు.

వీటి నుంచి ప్రతి నెలా దాదాపు 2వేల మంది రోగులను గుంతకల్లుకు రెఫర్‌ చేస్తున్నారు. రోజూ వెయ్యి మందికి పైగా రోగులకు చికిత్స చేస్తుండగా.. నెలలో 150 నుంచి 200 దాకా ఆపరేషన్లు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలో చిన్నపిల్లలు, కళ్లు, గైనకాలజిస్టు, కార్డియాలజీ, డెర్మటాలజీ, పెథాలజీ తదితర కీలక విభాగాలకు సంబంధించిన వైద్య పోస్టులన్నీ ఖాళీగా ఉన్నాయి. వైద్యుల కొరత నేపథ్యంలో లక్షలాది రూపాయల వ్యయంతో ఏర్పాటు చేసిన బ్లడ్‌ బ్యాంకు మూతపడింది. ప్రస్తుతం రోగులకు రక్తం అత్యవసరమైతే అనంతపురం, కర్నూలు, బళ్లారి నగరాలకు వెళ్లాల్సి వస్తోంది.

విధిలేక ప్రయివేటుకు..
వేలాది మంది కార్మికులతో ముడిపడిన రైల్వే ఆసుపత్రి ఎవరికీ పట్టని పరిస్థితి. కనీస సౌకర్యాలు కూడా లేకపోవడంతో కార్మికులు విధిలేక ప్రయివేటు ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. భారీగా తగ్గిన రోగుల సంఖ్యను పరిశీలిస్తే ఈ విషయం ఇట్టే అర్థమవుతుంది. ఆసుపత్రిలోని మంచాలపై పరుపులు పూర్తిగా దెబ్బతినడంతో రోగుల అవస్థలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. మంచాలు కూడా పాడవడంతో స్టాండ్స్‌ కింద రాళ్లు పెట్టుకోవాల్సిన దుస్థితి నెలకొంది.

వైద్యుల కొరత
కేంద్ర ప్రభుత్వ పరిధిలోని ఈ రైల్వే ఆసుపత్రిలో నెలల తరబడి వైద్యుల పోస్టులను భర్తీ చేయకపోవడం విమర్శలకు తావిస్తోంది. అన్ని విభాగాలకు సంబంధించి 19 మంది వైద్యులు సేవలు అందించాల్సి ఉండగా.. ప్రసుత్తం 10 మంది వైద్యులే దిక్కయ్యారు. ఈ కారణంగా ఒకప్పుడు వెయ్యి మందికి పైగా ఓపీ ఉండగా.. ఇప్పుడు వందలోపు మాత్రమే ఉండటం గమనార్హం. ఇన్‌పేషెంట్లు కూడా 50 నుంచి 60 మందిలోపే ఉంటున్నారు. అదేవిధంగా పెథాలజిస్టు లేని కారణంగా బ్లడ్‌ బ్యాంకును మూతేశారు.

పెద్ద రోగమైతే రెఫరల్‌ ఆసుపత్రికే..
ఆసుపత్రిలో కీలకమైన వైద్యులు లేకపోవడంతో రోగులు వ్యయప్రయాసలకు లోనుకావాల్సి వస్తోంది. చిన్న వ్యాధులకు సైతం అనంతపురంలోని ప్రయివేట్‌ రెఫరల్‌ ఆసుపత్రిని ఆశ్రయించాల్సి వస్తోంది. ఇతర జిల్లాల నుంచి ఎంతో ఆశతో ఇక్కడికి వస్తే.. వైద్యులు లేరనే కారణంతో రెఫరల్‌ ఆసుపత్రికి తరలిస్తుండటం రోగులతో పాటు కుటుంబ సభ్యులు, బంధువులను కలచివేస్తోంది. రెఫరల్‌ ఆసుపత్రిలో చేరిన 24 గంటల్లోపు సమాచారం అందిస్తేనే రీయింబర్స్‌మెంట్‌ వర్తిస్తుంది. అయితే అప్పటి వరకు డబ్బు ఎలా సర్దుబాటు చేయాలనే ప్రశ్న తలెత్తుతోంది.

సీఎంఎస్‌ దృష్టికి తీసుకెళ్లాం
రైల్వే ఆస్పత్రిలో స్పెషలిస్టు డాక్టర్లను నియమించాలి. ఒక సివిల్‌ సర్జన్‌ వైద్యుడు, బ్లడ్‌ బ్యాంకును పునరుద్ధరించాలి. పూర్తిగా పాడైన మంచాలు, బెడ్స్‌తో పాటు రోగులకు అందించే యూనిఫాం తదితర అంశాలను డీఆర్‌ఎం ద్వారా చీఫ్‌ మెడికల్‌ సూపరింటెండెంట్‌ దృష్టికి తీసుకెళ్లాం. – కె.ప్రభాకర్, ఎంప్లాయీస్‌ సంఘ్‌గుంతకల్లు డివిజన్‌ అధ్యక్షుడు

మంచానికి సపోర్ట్‌గా రాళ్లు ఏర్పాటు చేసుకున్నాం
నా భర్త రామాంజినేయలు రైల్వేలో పారిశుద్ధ్య కార్మికునిగా పనిచేస్తూ ఉద్యోగ విరమణ పొందారు. గుత్తిలో ఉంటున్నాం. కొన్ని నెలలుగా మా ఆయన ఆర్యోగ పరిస్థితి బాగా లేకపోవటంతో నాలుగు రోజుల క్రితం ఆసుపత్రిలో చేర్పించాం. మంచం సరిగా లేకపోవటంతో రాళ్లు పెట్టుకున్నాం. పరుపు కూడా పాడైపోయింది. – లక్ష్మీదేవి, రిటైర్డు రైల్వే ఉద్యోగి భార్య

Advertisement
Advertisement