వెయ్యి కళ్ల నిఘా | Sakshi
Sakshi News home page

వెయ్యి కళ్ల నిఘా

Published Mon, Apr 24 2017 10:50 AM

వెయ్యి కళ్ల నిఘా - Sakshi

► గుంటూరు నగరంలో 1000 సీసీ కెమెరాలు
► సిటీ సెక్యూరిటీ యాక్టు అమలుకు పోలీసుల కసరత్తు
► ప్రతి వాణిజ్య సముదాయానికీ కెమెరాలు తప్పనిసరి
► సహకరించని నగరపాలక సంస్థ

గుంటూరు నగరం పూర్తిగా నిఘా నీడలోకి వెళ్లనుంది. సిటీ సెక్యూరిటీ యాక్టును అమలు చేసేందుకు అధికారులుసిద్ధమయ్యారు. దీనిలో భాగంగా నగరంలోని వాణిజ్య సముదాయాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. దీనిపై ఇప్పటికే వ్యాపారులకు పోలీసులు అవగాహన కల్పించారు. 

సాక్షి, గుంటూరు : గుంటూరు అర్బన్‌ జిల్లాలో సిటీ సెక్యూరిటీ యాక్ట్‌ అమలు చేయడానికి పోలీసులు కసరత్తు చేస్తున్నారు. నగరంలో భద్రతను పెంపొందించి, నేరాలు, దొంగతనాల నివారణకు దోహదపడే ఈ చట్టాన్ని పకడ్బందీగా అమలు చేయాలని నిర్ణయించారు. దీని అమలు ద్వారా నగరంలో వందల సంఖ్యలో సీసీ కెమెరాలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే దాతల సహకారంతో అర్బన్‌ జిల్లా పోలీసులు ప్రధాన ప్రాంతాల్లో కొన్ని ఏర్పాటు చేశారు.

భద్రత పరంగా..
గుంటూరు నగరం రాజధాని నగరం కావడంతో గణనీయంగా పాధాన్యం పెరుగుతోంది. నగరంలో రోజూ సగటున 30 నుంచి 50 మంది వీఐపీల రాకపోకలు కొనసాగుతున్నాయి. నగరం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి, జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రోజుకు సగటును 2.25 లక్షల మంది ప్రజలు వివిధ పనుల నిమిత్తం వచ్చి వెళ్తుంటారు. ఈ క్రమంలో నగరంలోని అన్ని ప్రధాన ప్రాంతాలు నిత్యం జనసంద్రంతో కిటకిటలాడుతుంటాయి.

జిల్లాలో సుమారు 12 రాష్ట్ర స్థాయి కార్యాలయాలు ఏర్పాటవడంతో పెద్ద సంఖ్యలో ఉద్యోగులు కూడా వివిధ పనుల నిమిత్తం నగరానికి వస్తున్నారు. దీంతో నగరంలోని రహదారుల్లో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటోంది. ఈ పరిణామాల క్రమంలో అటు ట్రాఫిక్‌ క్రమబద్ధీకరించడానికి, ఇటు భద్రతపరంగా క్లోజ్డ్‌ సర్క్యూట్‌ కెమెరాలు (సీసీ కెమెరాలు) కొంత మేరకు ఉపయోగపడతాయి.

పట్టించుకోని నగర పాలక సంస్థ
అర్బన్‌ జిల్లా పోలీసులు నగరంలో ఇప్పటి వరకూ 100 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. దాతల సహకారంతో 40 వరకూ ఏర్పాటు చేయగా మిగతా 60 సీసీ కెమెరాలను పోలీసుశాఖ కేటాయించింది. నగరపాలక సంస్థే సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నప్పటికీ ఆ సంస్థ అధికారుల నుంచి పూర్తిస్థాయి సహకారం రాకపోవడంతో పోలీసులు ఏర్పాటు చేయాల్సి వచ్చింది.  గతేడాది కృష్ణా పుష్కారాల సమయంలో అర్బన్‌ జిల్లాలో పుష్కర ఘాట్ల వద్ద సుమారు రెండు వందల సీసీ కెమెరాలు, ఆరు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశారు.

ఈ క్రమంలో పుష్కరాలు అయ్యాక వాటిలో 60 కెమెరాలను నగరానికి కేటాయించాలని అర్బన్‌ జిల్లా ఎస్పీ సర్వశ్రేష్టి త్రిపాఠి గతంలో డీజీపీకి వినవించారు. దీంతో కెమెరాలు కేటాయించారు. ఈ క్రమంలో కెమెరాలు బస్టాండ్, రైల్వేస్టేషన్, జిన్నా టవర్, మార్కెట్‌ సెంటర్, శంకర్‌విలాస్‌ సెంటర్, లాడ్డి సెంటర్‌తో పాటు మరో నాలుగు ప్రధాన కూడల్లో ఏర్పాటు చేశారు.

సెక్యూరిటీ యాక్ట్‌ ద్వారా..
సిటీ సెక్యూరిటీ చట్టం ద్వారా నగరంలోని ప్రతి వాణిజ్య సముదాయం, లైసెన్స్‌ ఉన్న ప్రతి వ్యాపారీ ఆయా వాణిజ్య సముదాయాల బయట కూడా సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. ఇప్పటికే విజయవాడ కమిషనరేట్‌లో ఈ చట్టాన్ని అమలు చేస్తుండటంతో సుమారు 1300 వరకూ సీసీ కెమెరాలు విజయవాడలో ఏర్పాటయ్యాయి. దానిని గుంటూరులో కూడా అమలు చేస్తే బాగుంటుందని అధికారులు కసరత్తు చేస్తున్నారు.

లైవ్‌ స్ట్రీమ్‌ కెమెరాలయితే మరింత మేలు..
ప్రస్తుతం నగరంలో ఉన్న కెమెరాల ద్వారా రికార్డు మాత్రమే అవుతుంటాయి. రికార్డు అయ్యాకే వాటిని చూసే వీలుంటుంది. పుటేజ్‌ అంతా కంట్రోల్‌ రూంతో పాటు సంబంధిత పోలీసుస్టేషన్‌లో కూడా అందుబాటులో ఉంటుంది. లైవ్‌ స్ట్రీమింగ్‌లో ఉన్న కెమెరాలు ఉంటే నేరం జరిగిన గంటల వ్యవధిలోనే పరిష్కారమయ్యే అవకాశం ఉంటుంది. సీసీ కెమెరాలకు సంబంధించిన వ్యవహారాల పర్యవేక్షణకు ఒక ఏఎస్సీ స్థాయి అధికారిని నోడల్‌ ఆఫీసర్‌గా నియమించారు.

ప్రస్తుతం సౌత్‌ డీఎస్పీ శ్రీనివాసరావు వీటిని పర్యవేక్షిస్తున్నారు. గతంలో టెక్నాలజీ ఎగ్జిబిషన్‌ నిర్వహించి సీసీ కెమెరాలు వాడటం వలన కలిగే ప్రయోనాలపై వ్యాపారులకు అవగాహన కల్పించారు. ఈ యాక్ట్‌ను పకడ్బందీగా అమలుచేసి నగరంలో 1000 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement
Advertisement