అంపశయ్యపై 108 | Sakshi
Sakshi News home page

అంపశయ్యపై 108

Published Wed, Jun 13 2018 9:15 AM

108 Services Delayed In Anantapur - Sakshi

నా చరిత్రను తడిమి చూస్తే గతమెంతో కీర్తి. ఎన్నో ప్రాణాలను కాపాడిన సంతృప్తి. ఆపద సమయంలో ఫోన్‌ చేసిన 15 నిముషాల్లోపు చేరుకోవడం.. కుయ్‌కుయ్‌మని దూసుకుపోయి ఆసుపత్రిలో చేర్పించడం.. బాధితుల ముఖాల్లో చిరునవ్వు చూసి సంబరపడిపోవడమే తెలుసు. ఇప్పుడు కనీసం కదల్లేని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నా. కనీసం మరమ్మతులకు నోచుకోని దుస్థితి. మంత్రి నియోజకవర్గంలో సేవలు అందిస్తున్నాననే మాటే కానీ.. ఈ దుస్థితి ఆయనకు కనిపించకపోవడం నా ఖర్మ. జిల్లా పరిషత్‌ చైర్మన్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రాంతమే అయినా ఆయనా ఒక్క మాట మాట్లాడరు. ప్రజలకు సేవలందించకుండా ఓ మూలన పడుండాలంటే బాధగా ఉంటోంది. – బాధాతప్త హృదయంతో మీ 108

గుమ్మఘట్ట:  ప్రసవ వేదన నుంచి పెను ప్రమాదాల వరకు ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడానికి దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో 108 అంబులెన్స్‌ సేవలను ప్రవేశపెట్టారు. మొదట పట్టణ ప్రాంతాల్లో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. అనంతరం నియోజకవర్గానికి ఒక వాహనాన్ని ఏర్పాటు చేశారు. ప్రమాదాల శాతం అధికం కావడం.. ప్రజలకు 108 సేవలు అత్యవసరం కావడాన్ని గుర్తించి దశల వారీగా ప్రతి మండలానికీ ఒక వాహనం కేటాయించారు. వాహనంతో పాటు అనుభవజ్ఞులైన డ్రైవర్లు, ప్రథమ చికిత్సలకు అవసరమైన వైద్య సిబ్బందిని నియమించారు. కానీ ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు 108 నిర్వహణపై శ్రద్ధ చూపకపోవడంతో వాహనాలకు గడ్డు కాలం వచ్చింది. ప్రమాదం జరిగిన గంట తర్వాత కూడా వాహనం సంఘటనా స్థలానికి చేరుకోలేకపోతోంది.

మొరాయిస్తున్న వాహనాలు
2008–09 నుంచి సేవలందిస్తున్న 108 వాహనాలకు కాలం చెల్లింది. అందువల్లే ప్రమాదాల బారినపడ్డ క్షతగాత్రులనుఆస్పత్రికి తరలించే సమయంలో వాహనాలు మొరాయిస్తున్నాయి. మరోవైపు 7 లక్షల కిలోమీటర్ల మేర తిరిగిన వాహనాలు వేగం తగ్గిపోయి సిబ్బందిని ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. కాలం చెల్లిన వాహనాలతో సకాలంలో సంఘటనా స్థలం చేరుకోలేక...ప్రజలతో చీవాట్లు తినలేమని సిబ్బంది నిరసనకు దిగిన సందర్భాలెన్నో ఉన్నాయి. 

నియోజకవర్గానికంతా ఒకే వాహనం
గతంలో మండలానికి ఒక 108 వాహనం ఉండేది. కాలం చెల్లిన వాహనాలు తొలగిస్తూ రాగా... టీడీపీ అధికారంలోకి వచ్చాక రాయదుర్గం వాహనం మాత్రమే మిగిలింగి. ఆ వాహనం టైర్లు కూడా పాడవడంతో ముందుకు కదల్లేక పోయింది. అత్యవసర పరిస్థితుల్లో అప్పుడప్పుడు 10 కిలోమీటర్ల లోపు రహదారి బాగున్న గ్రామాలకు మాత్రమే వెళ్లేది. ఈ వాహనాన్ని కూడా కళ్యాణదుర్గానికి పంపడంతో మే 19 నుంచి జూన్‌ 6 వరకు పూర్తిగా సేవలు నిలిచి పోయాయి. ఇటీవల గుమ్మఘట్టలో డీఎంఅండ్‌హెచ్‌ఓ పర్యటన ఉండడంతో ఈ నెల 6న వాహనాన్ని రాయదుర్గానికి తీసుకువచ్చారు. కళ్యాణదుర్గం వాహనానికి ఉన్న టైర్లు తగిలించి పంపడంతో టైర్ల కోసం వారి నుంచి ఒత్తిడి పెరిగినట్టు సమాచారం. 

మంత్రి, జెడ్పీ చైర్మన్‌ ఉన్నా..
రాయదుర్గం నియోజకవర్గం నుంచి మంత్రి కాలవ శ్రీనివాసులు, జిల్లా పరిషత్‌ చైర్మెన్‌గా పూల నాగరాజు ప్రాతినిథ్యం వహిస్తున్నా.. ఏమాత్రం ప్రయోజనం లేదని ప్రజలు పెదవి విరుస్తున్నారు. అత్యవసర వైద్య సేవల కోసం ప్రజలు 108 లేక ఇబ్బందులు పడుతున్నా వీరు పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు. ఇటీవల గుమ్మఘట్ట పర్యటనకు వచ్చిన జెడ్పీ చైర్మన్‌ పూల నాగరాజు మండలానికి 108 వాహనం తెప్పిస్తామని హామీ ఇచ్చారనీ, అయినా ఆ మేరకు చర్యలు తీసుకోలేదని ప్రజలు వాపోతున్నారు.

అత్యవసరంలో ఆటోలే దిక్కు
అత్యవసర సమయాల్లో 108 వాహనం అందుబాటులో లేక ఆటోలు, ఎద్దుల బండ్ల ద్వారా ఆస్పత్రులకు వెళ్లాల్సి వస్తోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఫోన్‌ చేసిన 20 నిమిషాల్లోనే 108 గ్రామానికి చేరుకునేది. ఇపుడా వాహనాలు ఎక్కడా కనిపించడం లేదు. కనీసం మంత్రి అయినా 108 నిర్వహణ గురించి మాట్లాడాలి.
– కమలమ్మ, మాజీ సర్పంచ్, భూపసముద్రం

Advertisement
Advertisement