13ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ ప్రకటన | Sakshi
Sakshi News home page

13ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ ప్రకటన

Published Thu, Dec 12 2013 2:01 AM

13ఏళ్ల పోరాట ఫలితమే తెలంగాణ ప్రకటన - Sakshi

 కోదాడటౌన్, న్యూస్‌లైన్: తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు విషయంలో కేంద్రం మాట తప్పినా, సీమాంధ్ర పాలకుల కుట్రలతో తేడా వచ్చినా యుద్ధం తప్పదని, అది కూడా కోదాడ నుంచే ప్రారంభమవుతుందని సిరిసిల్ల ఎమ్మెల్యే, టీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల తారక రామారావు హెచ్చరించారు. బుధవారం కోదాడలోని నాగార్జున లాడ్జిసెంటర్‌లో ఏర్పా టు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. అనంతరం స్థానిక బాలుర పాఠశాలలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మాట్లాడారు. కేంద్రం చెప్పినట్లుగానే నడుచుకుంటానని చెప్పిన ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి నేడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లును అడ్డుకుంటానని చెప్పడం పచ్చి అవకాశవాదమన్నారు.

సమన్యాయం, రెండు కళ్ల సిద్ధాంతం అంటూ చెబుతున్న చంద్రబాబు, తెలుగుదేశం నాయకులకు చివరకు మిగిలేది కొబ్బరిచిప్పలేనని ఎద్దేవా చేశారు. 13 సంవత్సరాలుగా టీఆర్‌ఎస్ నాయకుడు కేసీఆర్,  తెలంగాణ విద్యార్థులు, ఉద్యోగులు చేసిన ఉ ద్యమాలు, త్యాగాల ఫలితమే రాబోయే తెలంగాణ రాష్ట్రం అన్నారు. జిల్లాకు చెందిన కొందరు కాంగ్రెస్ మంత్రులు కొత్త సూట్లు, షేర్వాణీలు కుట్టించుకొని తామే తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రులమంటూ పగటి కలలు కంటున్నారని పేర్కొన్నారు. నాలుగేళ్లుగా విద్యార్థులు, ఉద్యోగులు ఎన్నో ఉద్యమాలు చేస్తే కంటికి కనిపించని  సదరు నాయకులు నేడు తామే తెలంగాణ తెచ్చామని పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని చెప్పారు. పులిచింతల ప్రాజెక్టు వల్ల తెలంగాణ ప్రజలు మునిగితే, ఆంధ్రవారికి మూడవ పంటకు నీరు ఇస్తున్నారని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రం వచ్చాక ముంపు బాధితులకు నయాపైసాతో సహా నష్టపరిహారం చెల్లిస్తామని చెప్పా రు. అంతకు ముందు కోదాడలో పది వేల మంది విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. కళాకారుల ఆటాపాట అలరించాయి. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ కన్మంతరెడ్డి శశిధర్‌రెడ్డి, పొలిట్‌బ్యూరో సభ్యుడు గుంతకండ్ల జగదీశ్వర్‌రెడ్డి, గాదరి కిశోర్, మాలె శరణ్యారెడ్డి, జేఏసీ నాయకులు రాయపూడి చిన్ని, బంగారు నాగమణి, పందిరి నాగిరెడ్డి, జిఎల్‌ఎన్‌రెడ్డి, చిలకా రమేష్, సీపీఐ నాయకులు బద్దం భద్రారెడ్డి, బీజేపీ నాయకులు బొలిశెట్టి కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement