179వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

179వ రోజు పాదయాత్ర డైరీ

Published Mon, Jun 4 2018 2:10 AM

179th day padayatra diary - Sakshi

03–06–2018, ఆదివారం
పెనుగొండ, పశ్చిమగోదావరి జిల్లా

బీసీలపై ప్రేమంటే ఏంటో మేం చూపిస్తాం.. 
ఆర్యవైశ్యుల ఆరాధ్యదైవం శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీదేవి జన్మస్థలమైన పెనుగొండ పుణ్యక్షేత్రంలో నేనీరోజు పాదయాత్ర చేశాను. ఆత్మీయ పలకరింపులతో పాటు.. ఆవేదనల అర్జీలనూ ఇక్కడి జనం నా ముందుంచారు. శాలివాహనులు (కుమ్మరులు) చెప్పిన దయనీయ దుస్థితి విని బాధేసింది. జనన మరణాలతోనూ పెనవేసుకున్న ఆ కులవృత్తి.. చంద్రబాబు పాలనలో ఎలా కునారిల్లుతుందో చెప్పారు. భగవంతుడి నైవేద్యానికి తాము చేసిన కుండలు వాడే సంస్కృతి ఎలా మసకబారుతుందో వివరించారు. ఆ కుమ్మరి కులానికి చెందిన పెనుగొండ వెంకటలక్ష్మి మాటల్లో ఆర్థ్రతను గుర్తించాను. రానురాను కులవృత్తి నిరాదరణకు గురవుతుంటే.. పిల్లలనైనా మంచి చదువులు చదివించి ఉద్యోగాలు వచ్చేలా చూడాలనుకుంది. కొడుకు, కోడలు, కూతురు, అల్లుడూ అందరూ ఉన్నత చదువులే చదివారు.

ఫీజు రీయింబర్స్‌మెంటూ అరకొరగానే రావడంతో అప్పులు చేసిమరీ ఉన్నత చదువులు చదివించినా ఏ ఒక్కరికీ ఉద్యోగం రాకపోవడంతో.. విధిలేక బతుకుదెరువు కోసం మళ్లీ కులవృత్తి వైపు మళ్లారు. కానీ అదీ కూడు పెట్టేట్టు లేదని బావురుమన్నారు. చంద్రబాబు సర్కారు వచ్చాక కుండలకు కావాల్సిన చెరువు మట్టినీ ముట్టనివ్వడం లేదని చెప్పారు. ఆయన పార్టీ వాళ్లే తవ్వేసుకుని.. అమ్మేసుకుంటున్నారని ఆవేదన వెలిబుచ్చారు. ఆఖరుకు కుండలు కాల్చుకోవడానికి సైతం అధికార పార్టీ వాళ్లకు లంచాలివ్వాల్సి వస్తోందని కన్నీళ్లు పెట్టారు. మేలు చెయ్యకపోయినా ఫర్వాలేదన్నా.. ఇలా మమ్మల్ని కాల్చుకుతింటే ఎలా.. మా మానాన మమ్మల్ని బతకనివ్వకపోతే ఎట్లా.. అంటూ ప్రశ్నించారు. ఈ బాధలోనూ వాళ్లు నాన్నగారు చేసిన మేలును గుర్తుకు తెచ్చారు.

ఆయన హయాంలో ఎలా ఆదుకున్నారో చెప్పారు. ఫెడరే షన్‌ పెట్టి కులవృత్తిని ఏ విధంగా ప్రోత్సహిం చారో తెలిపారు. రుణాలిప్పించి అండగా నిలిచిన నాన్నగారికి కృతజ్ఞతలు చెప్పారు. చరిత్రలో తమ కులస్తులకు చట్టసభల్లో ప్రాతినిధ్యమిచ్చిన ఘనత ఆయనదేనన్నారు. చంద్రబాబు మాటల్లో తప్ప.. చేతల్లో చేసిందేమీ లేదని చెప్పారు. ఇక్కడే కాదు.. పాదయాత్ర చేసిన అనేక చోట్ల కులవృత్తులపై చంద్రబాబు చూపించే వివక్ష నా దృష్టికొచ్చింది. చితికిపోతున్న చేతివృత్తులను ఆదుకుంటేనే పల్లె బతుకుచిత్రం మారుతుంది. ఈ ఆలోచన చంద్రబాబుకు ఏనాడూ లేదు. ఓ పక్క ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కోత విధిస్తాడు. బీసీ హాస్టళ్లను మూసేయిస్తాడు. ఎన్నికలప్పుడు గొప్పగా చెప్పిన బీసీ సబ్‌ప్లాన్‌ను ఏ మాత్రం అమలు చేయడు. మరోపక్క నాలుగు కత్తెర్లు, రెండు ఇస్త్రీ పెట్టెలిచ్చి అదే బీసీలపై ప్రేమ, అదే అభివృద్ధి అంటాడు. బీసీలపై ప్రేమంటే ఏంటో, నిజమైన అభివృద్ధి అంటే ఏంటో మేం చూపిస్తాం. 

నెగ్గిపూడి దగ్గర హెచ్‌ఐవీ బాధితుల కోసం పనిచేసే ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకుడు కలిశాడు. ఎయిడ్స్‌ బాధితుల పట్ల కూడా ఈ ప్రభుత్వానికి కనికరం లేదన్నాడు. కనీసం వారికి మందులు కూడా సక్రమంగా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. గత ప్రభుత్వాలు ఎయిడ్స్‌పై అవగాహన కల్పించేందుకు, మందుల సరఫరాకు పెద్ద ఎత్తున నిధులు వెచ్చించి, చిత్తశుద్ధితో పనిచేశాయని తెలిపాడు. బాబుగారు అధికారంలోకి వచ్చింది మొదలు.. ఇవన్నీ కరువైనట్లు చెప్పాడు. వారికి పింఛన్‌లు కూడా సరిగా ఇవ్వడం లేదన్నాడు. నిజంగా ఇది దారుణమే. ఇలాంటి వారిపట్ల ప్రభుత్వం ఇంత నిర్దయగా ఉండటం క్షమించరాని నేరమే. 

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. ఈ రోజు నవ నిర్మాణ దీక్షలో నీరు – చెట్టు, పోలవరం మొదలైనవి చర్చనీయాంశాలన్నారు. ఏమని చర్చిస్తారు? అడ్డదిడ్డంగా తవ్వేయడంతో ఎందుకూ పనికిరాకుండా పోయిన చెరువుల గురించా? అడుగంటిన భూగర్భ జలాల గురించా? చెరువులు తవ్వి మింగేసిన వేల కోట్ల మీ అవినీతి బాగోతం గురించా? జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు పొంది.. రాష్ట్రానికే తలమా నికమైన పోలవరాన్ని సైతం భారీ కుంభకోణంగా మార్చిన మీ సమర్థత గురించా?
-వైఎస్‌ జగన్‌

Advertisement
Advertisement