ఎస్కలేషన్ భారం 2,712 కోట్లు | Sakshi
Sakshi News home page

ఎస్కలేషన్ భారం 2,712 కోట్లు

Published Fri, Jun 26 2015 4:03 AM

ఎస్కలేషన్ భారం 2,712 కోట్లు - Sakshi

సాగు నీటి ప్రాజెక్టులపై పడే భారాన్ని తేల్చిన నీటి పారుదల శాఖ
* ఏఎంఆర్‌పీపై అధికంగా రూ.865 కోట్లు
* తర్వాతి స్థానంలో దేవాదులకు రూ.543 కోట్లు
* కల్వకుర్తి, రాజీవ్‌సాగర్‌లపై సైతం అదనపు భారం భారీగానే..

 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులకు పెరిగిన ధరలకు అనుగుణంగా ఎస్కలేషన్ చెల్లిస్తే భారీ, మధ్యతరహా ప్రాజెక్టు కింద కలిపి రూ.2,712 కోట్ల భారం పడుతుందని ప్రాథమికంగా అధికారులు అంచనా వేశారు.

అధికభారం ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు(ఏఎంఆర్‌పీ)పైనే ఉండనుండగా... ప్రాజెక్టులో భాగంగానే శ్రీశైలం ఎడమగట్టు కాల్వ(ఎస్‌ఎల్‌బీసీ) సొరంగం పనులు సైతం ఉండటంతో ఆ భారం భారీగా ఉండనున్నట్లు నీటి  పారుదల శాఖ అధికారులు తేల్చారు. ఇక ఎస్కలేషన్ భారం అధికంగా ఉండనున్న ప్రాజెక్టుల్లో తర్వాతి స్థానం దేవాదుల ప్రాజెక్టుది కాగా, ఆ తర్వాతి స్థానాల్లో కల్వకుర్తి, రాజీవ్‌సాగర్ దుమ్ముగూడెం ప్రాజెక్టులున్నాయి.
 
భారం భారీగానే..
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తీసుకొచ్చిన జీవో 13ను కొద్దిపాటి మార్పులు చేర్పులతో అమలు చేయాలని రాష్ట్ర కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించిన విషయం తెలిసిందే. ఎస్కలేషన్‌ను మొత్తంగా నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు వర్తింపజేస్తే ఆ భారం రూ.2,712 కోట్లని తేల్చగా, అందులో 13 భారీ ప్రాజెక్టులకు రూ.2,479 కోట్లు, మధ్యతరహా ప్రాజెక్టులకు రూ.233 కోట్ల భారం ఉండనుంది. మొత్తం ప్రాజెక్టుల్లో ఎస్కలేషన్ భారం ఏఎంఆర్‌పీపై అధికంగా రూ.865 కోట్లుగా అధికారులు తేల్చారు.

ఇక దేవాదుల ప్రాజెక్టులో చాలా పనులు పెండింగ్‌లో ఉన్నందున దీనికి రూ.543 కోట్లు, కల్వకుర్తి ప్రాజెక్టుకు రూ.347 కోట్ల మేర ఎస్కలేషన్ ఉంటుందని అధికారులు తేల్చారు. ఇక మధ్యతరహా ప్రాజెక్టుల్లో మోదికుంటవాగుకు రూ.62 కోట్లు, కొమురంభీమ్‌కు రూ.37 కోట్లు, పెద్దవాగుకు రూ.29 కోట్ల మేర ఎస్కలేషన్ ఇవ్వాలని అధికారులు నిర్ణయించారు.

Advertisement
Advertisement