ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం | Sakshi
Sakshi News home page

ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం

Published Sat, Apr 1 2017 3:26 PM

ఆరిపోతూ వెలుగిచ్చిన జీవన దీపం - Sakshi

► రోడ్డు ప్రమాదంలో మృతుడి ‘జీవన దానం’
► మరణించిన యువకుడి అవయవాల సేకరణ
► కాలేయం, కిడ్నీలు, నేత్రాలు, గుండె దానానికి కుటుంబ సభ్యుల సమ్మతి
► రెండు విమానాల్లో హుటాహుటిన విజయవాడ, చెన్నై తరలింపు
► మృతుడు ఆటో డ్రైవర్‌.. భార్య ఆరు నెలల గర్భిణి

ఆరిలోవ(విశాఖ తూర్పు): దీపం ఆరిపోతున్నా మరి కొన్ని దివ్వెలను వెలిగిస్తుంది. కెరటం కనుమరుగవుతున్నా మరికొన్ని అలలకు ప్రేరణ కలిగిస్తుంది. ఓ బతుకు పరిసమాప్తమవుతున్నా మరికొన్ని జీవితాలకు ఊపిరి పోస్తుంది.. రోడ్డు ప్రమాదంలో దురదృష్టం కొద్దీ కన్నుమూసిన ఆ యువకుడు కూడా అదే విధంగా మరికొందరికి ప్రాణం పోయడం అందరినీ కదిలించింది. అతడి ప్రాణదీపం ఆపదలో ఉన్న అయిదుగురికి ఊపిరినిచ్చింది.

విజయనగరం జిల్లా భోగాపురం మండలం ఎ.రావివలస గ్రామానికి చెందిన పి. సురేష్‌ (23) ఆటో డ్రైవర్‌. గత బుధవారం (ఉగాదినాడు) విశాఖలో తన బంధువుల ఇంట్లో జరుగుతున్న శుభకార్యానికి ద్విచక్రవాహనంపై అతను బయలుదేరాడు. విశాఖ వస్తుండగా మధురవాడ ప్రాంతం బోయపాలెం వద్ద జాతీయ రహదారిపై వెనుక నుంచి వస్తున్న ఓ కారు సురేష్‌ బైక్‌ను ఢీకొంది. దీంతో రమేష్‌  తలకు తీవ్ర గాయాలయ్యాయి. పీఎంపాలెం పోలీసులు సురేష్‌ను చికిత్స కోసం ఆరిలోవ ప్రాంతం చినగదిలిలో పినాకిల్‌ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ అతను గురువారం ప్రాణాలు విడిచాడు.

ఆటో డ్రైవరైన సురేష్‌కు వివాహమై సంవత్సరమైంది. అతడి భార్య లక్ష్మి ఆరు నెలల గర్బిణి. తల్లిదండ్రులు లక్ష్మి, సూరి కూలి చేసుకు బతుకుతున్నారు. సురేష్‌ మరణించిన తర్వాత నగరంలోని జీవన్‌దాన్‌ విభాగం ప్రతినిధులు మృతుడి తల్లిదండ్రులను, భార్యను సంప్రదించారు. అవయవదానం గురించి వివరించారు. దాంతో కుటుంబ సభ్యులు సురేష్‌ అవయవాలు వేరొకరికి దానం చేయడానికి అంగీకరించారు. పినాకిల్‌ ఆస్పత్రిలోనే శుక్రవారం మధ్యాహ్నం నిపుణులు శస్త్రచికిత్స చేసి సురేష్‌ అవయవాలను వేరు చేశారు.

విశాఖలో పినాకిల్‌ ఆస్పత్రికి ఒక కిడ్నీ, కేర్‌ ఆస్పత్రికి మరో కిడ్నీ, ఎల్వీ ప్రసాద్‌ ఆస్పత్రికి రెండు కళ్లు, విజయవాడలోని మణిపాల్‌ ఆస్పత్రికి కాలేయం, చెన్నైలో గ్లోబల్‌ ఆస్పత్రికి గుండె తరలించారు. కాలేయాన్ని, గుండెను విజయవాడ,  చెన్నైలకు ప్రత్యేకంగా రెండు విమానాలలో తరలించారు. కాలేయాన్ని, గుండెను రెండు వేర్వేరు బాక్సుల్లో పెట్టి ఒకే అంబులెన్స్‌లో  పినాకిల్‌ ఆస్పత్రి నుంచి విశాఖ విమానాశ్రయానికి తరలించారు.
గ్రీన్‌ చాన్నెల్‌ ఏర్పాటు
అవయవాలను అత్యవసరంగా తరలించాల్సిన అవసరం ఉండడంతో విమానాశ్రయం వరకు పోలీసులు ‘గ్రీన్‌ చానెల్‌’ ఏర్పాటు చేశారు. పినాకిల్‌ ఆస్పత్రి నుంచి బీఆర్‌టీఎస్‌ మార్గంలో సింహాచలం, గోపాలపట్నం, ఎన్‌ఏడీ కూడలి, అక్కడ నుంచి ఎయిర్‌పోర్టు వరకు ట్రాఫిక్‌ గ్రీన్‌ చానెల్‌ ఏర్పాటుచేసి మధ్యాహ్నం 1.15 గంటలకు వాటిని హుటాహుటిన తరలించారు. ఆస్పత్రి నుంచి అడవివరం వరకు బీఆర్‌టీఎస్‌పై వీఐపీ లైన్‌లో ఇతర వాహనాలు రానీయకుండా గంట ముందు నుంచే ట్రాఫిక్‌ను నియంత్రించారు. అక్కడ నుంచి సింహాచలం, గోపాలపట్నం, విశాఖ విమానాశ్రయం వరకు రోడ్డుపై ఓ లైన్‌లో వాహనాలు లేకుండా ఏర్పాట్లు చేశారు.
మరొకరి ప్రాణాలు కాపాడాలని..
మాకు అవయవాలు ఇవ్వడం ఏమిటో తెలీదు. జీవన్‌దాన్‌ వాళ్లు  మమ్మల్ని కలిశారు. మీ అబ్బాయి మరణించినా వేరొకరికి అవయవాలు అమర్చుతారని, దానివల్ల మీ కుమారుడు వాళ్లకు ప్రాణం పోసినట్లు అవుతుందని చెప్పారు. దీంతో సురేష్‌ అవయవాలు ఇవ్వడానికి అంగీకరించాము. మా కుమారుడి అవయవాలు వేరొకరిలో బతికుంటే చాలు. ఆటో నడుపుతూ మమ్మల్ని పోషించేవాడు. ఇప్పుడు మాకు దూరమయ్యాడు. ఆరు నెలల గర్భంతో ఉన్న కోడలి పరిస్థితి దిక్కుతోచనిదైంది.     – లక్ష్మి, సూరి, మృతుడి తల్లిదండ్రులు

Advertisement

తప్పక చదవండి

Advertisement