విషాద వీచిక | Sakshi
Sakshi News home page

విషాద వీచిక

Published Wed, Jul 15 2015 3:54 AM

27 dead, several injured in stampede at Godavari

 నీళ్లిచ్చి ప్రాణాలు నిలిపే గోదారమ్మ ఒడిలో ఘోరం జరిగింది. పొరుగునే ఉన్న రాజమండ్రి కోటగుమ్మం పుష్కర ఘాట్ వద్ద మృత్యుదేవత వికటాట్టహాసం చేసింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల వారితోపాటు మన జిల్లాకు చెందిన ఇద్దరిని పొట్టన పెట్టుకుంది. ఈ ఘోర దుర్ఘటన ‘పశ్చిమ’లో కలకలం రేపింది. ‘అయ్యో.. మన గోదారమ్మ ఒడ్డున ఇంత ఘోరం జరిగిందేమిటా’ని ప్రతి మనసు కలవరపడింది.
 
 ఉండి/తాడేపల్లిగూడెం :
 ‘అమ్మా.. చిన్నత్తయ్య వాళ్లు పుష్కర స్నానానికి రమ్మని పిలిచారు. నేను, మీ కోడలు హైదరాబాద్ నుంచి నేరుగా రాజమండ్రి వచ్చేస్తాం. నువ్వు కూడా వచ్చెయ్. మనమంతా కలిసి పుష్కర స్నానం చేసొద్దాం’ అని యండగండి గ్రామానికి చెందిన బుద్దర్రాజు లక్ష్మి (50)కి హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె కొడుకు సత్యనారాయణరాజు (సతీష్) ఫోన్ చేశాడు. సాధారణంగానే భక్తి భావంతో ఉండే లక్ష్మి తన కొడుకు, కోడలు పుష్కర స్నానానికి రమ్మని పిలవడంతో ఉప్పొంగిపోయింది. సోమవారం ఉదయం 9గంటలకు యండగండిలో బస్సెక్కింది. ఆ సమయంలో ‘నా కొడుకు, కోడలు రమ్మన్నా రు.
 
  పుష్కరాలకు వెళుతున్నా. మీరంతా జాగ్రత్త’ అని చుట్టపక్కల వారికి చెప్పిన మాటలే చివరి మాటలయ్యాయి. రాజ మండ్రి చేరుకున్న లక్ష్మి పెద్దకొడుకు, కోడలితో కలిసి సోమవారం బంధువుల ఇంట బసచేసింది. పుష్కరాల ప్రారంభ సమయంలోనే స్నానాలు చేయాలనే ఉద్దేశంతో మంగళవారం వేకువజామునే ఘాట్‌కు చేరుకున్న లక్ష్మి పుష్కర ఘడియ కోసం ఎదురు చూసింది. అక్కడ జరిగిన తొక్కిసలాట ఆమెను బలిగొంది. కళ్లముందే ఇదంతా జరుగుతున్నా తల్లిని కాపాడుకోలేకపోయానని లక్ష్మి కుమారుడు సత్యనారాయణరాజు సోదరుడు సూర్యనారాయణరాజుకు, బంధువులకు ఫోన్‌లో చెప్పి బావురుమన్నాడు. ఆమె మరణంతో యండగండిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విష యం తెలిసిన వెంటనే లక్ష్మి చిన్న కుమారుడు సురేష్, బంధువులు రాజమండ్రికి తరలివెళ్లారు.
 
 అందరినీ పిలిచి.. కానరాని లోకాలకు
 రాజమండ్రిలో మంగళవారం జరిగిన తొక్కిసలాటలో మృతి చెందిన వారిలో తాడేపల్లిగూడెంకు చెందిన మైగాపుల లక్ష్మణరావు (65) ఉన్నారు. పట్టణంలోని డీఎస్ చెరువు సమీపంలో పొట్టి శ్రీరాములు వీధికి చెందిన లక్ష్మణరావు భార్య లక్ష్మితో కలిసి సోమవారం సాయంత్రం రాజమండ్రి వెళ్లారు. మంగళవారం ఉదయం జరిగిన తొక్కిసలాటలో ఆయన అక్కడికక్కడే మృతిచెందారు. లారీ డ్రైవర్‌గా జీవితం ప్రారంభించిన లక్ష్మణరావు స్వయంకృషితో లారీ యజమానిగా ఎదిగాడు. ఆయనకు ముగ్గురు కుమారులు వీరిలో ఒక కుమారుడు రవి గత పుష్కరాల సమయంలో రాజమండ్రిలో ఐస్‌క్రీం పార్లర్ ఏర్పాటు చేశాడు. తండ్రి లక్ష్మణరావు అతనికి తోడుగా ఉంటున్నారు. తాడేపల్లిగూడెం నుంచి తరచూ రాజమండ్రి వెళ్లి వస్తుంటారు.
 
  తన కుమారుని వ్యాపార ఉన్నతికి సహకరించిన కుటుంబాల వారిని, బంధువులను పుష్క ర స్నానానికి రాజమండ్రి రావాల్సిందిగా లక్ష్మణరావు దంపతులు సోమవారం ఆహ్వానించి సోమవారం రాజమండ్రి బయలుదేరారు. ఇదే సందర్భంలో కాకినాడలో ఉంటున్న లక్ష్మణరావు మరో కుమారుడు తన భార్యాబిడ్డలతో రాజమండ్రి వచ్చాడు. వీరంతా కలిసి మంగళవారం ఉద యం పుష్కర స్నానానికి వెళ్లగా.. తొక్కిసలాటలో లక్ష్మణరావు మృత్యువాతపడ్డారు. ఆ కుటుంబంలో విషాదంలో మునిగిపోయింది. లక్ష్మణరావు నుంచి పుష్కరాలకు పిలుపునందుకున్న బంధువులు, స్నేహితులు అతడు కానరాని లోకాలకు వెళ్లిపోయాడని తెలిసి ఘొల్లుమన్నారు.
 
 ముమ్మాటికీ ఇది ప్రభుత్వ వైఫల్యమే
 ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. పుష్కరాలకు విపరీత ప్రచారం చేశారు. దానికి అనుగుణంగా ఏర్పాట్లు చేయడంతో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. పుష్కరాల్లో అది చేస్తాం ఇది చేస్తాం అంటూ ప్రగల్భాలు పలికిన ప్రజాప్రతినిధులు ఎక్కడున్నారు? ఏమైపోయారు? ఈ ఘటనకు ఎవరు భాధ్యత వహిస్తారు? ప్రభుత్వ పెద్దలు, పై అధికారులు ప్రచార ఆర్భాటాలు చేశారే తప్ప ఒక్క ప్రాణాన్ని కూడా కాపాడలేకపోయారు. మృతుల కుటుంబాలకు వచ్చిన విషాదాన్ని ఎవరు తీరుస్తారు?.
 - బుద్దర్రాజు లక్ష్మీపతిరాజు,
 మృతురాలి మరిది కొడుకు, యండగండి.
 
 వీఐపీలకేనా.. సామాన్యులకు భద్రత లేదా
 పుష్కరాల్లో వీఐపీలకే భద్రత కల్పిస్తారా. సామాన్యులకు లేదా. ఇదేనా ప్రభుత్వ తీరు. ముఖ్యమంత్రి పుష్కర స్నానం కోసం ఇంతమందిని బలి తీసుకుంటారా. ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని లేదా. అధికారుల తీరు చాలా చిత్రంగా వుంది. ముఖ్యమంత్రి స్నానం చేసి వెళ్లిపోతే ప్రజల భద్రత గాలికొదిలేస్తారా. అలా చేయడం మూలంగానే భక్తుల్లో తొక్కిసలాట జరిగింది. దీంతో అనేక మంది ప్రాణాలు కోల్పోయారు.వీఐపీల భద్రత ఎంత ముఖ్యమో.. ప్రజలు కూడా అంతే ముఖ్యం అన్న సంగతి మరచిపోకూడదు.
 - బుద్దర్రాజు లీలావతి.
 మృతురాలి తోటి కోడలు, యండగండి.

 

Advertisement
Advertisement