Sakshi News home page

272వ రోజు పాదయాత్ర డైరీ

Published Fri, Sep 28 2018 3:20 AM

272nd day padayatra diary - Sakshi

27–09–2018, గురువారం
కిర్ల, విజయనగరం జిల్లా


వ్యవసాయంలో రాష్ట్రం అగ్రగామిగా ఉందని చెప్పడం ఎవరిని మోసం చేయడానికి బాబూ?
ఈ రోజు దారికి ఇరువైపులా ఎటుచూసినా మామిడి తోటలే. ఆనందంగా అనిపించింది. కానీ ఆర్‌పీపురం వద్ద కలిసిన మామిడి రైతుల కష్టాలు వినగానే ఆ ఆనందం కాస్తా ఆవిరైపోయింది.    దేశంలోని గొప్ప గొప్ప నగరాలన్నింటికీ ఈ ప్రాంత మామిడి ఎగుమతి అవుతోంది. కానీ ఇక్కడ రైతన్నల పరిస్థితి మాత్రం చాలా దయనీయంగా ఉంది. ఆరుగాలం కష్టించి పండించిన పంటంతా దళారుల పాల్జేయాల్సి వస్తోంది. ధరలు నిర్ణయించకుండానే దళారులు రైతుల దగ్గర సరుకు సేకరిస్తారు. ఆ తర్వాత వారికి తోచినప్పుడు డబ్బులిస్తారు. ఇచ్చిన కాడికి తీసుకోవాల్సిందే. కష్టపడి పంట పండించి.. ఆపై నష్టాల పాలవడం ఇక్కడి రైతుల్ని బాగా కుంగదీస్తోంది. వ్యాపారులంతా సిండికేట్‌ అయి రైతన్నల ఉసురు పోసుకుంటున్నారట. ఆదుకోవాల్సిన ప్రభుత్వమే దళారులకు కొమ్ముకాస్తోందంటూ బావురుమన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రైతన్నల మనుగడ ఎంత కష్టం?!

ఇక్కడి భీమాళి గ్రామం మామిడి తాండ్రకు మహా ప్రసిద్ధి. దేశ విదేశాల్లోనూ పేరుంది. ఈ రోజు కలిసిన మామిడి తాండ్ర తయారీదారులు తమ గోడు వెళ్లబోసుకున్నారు. నాలుగు వందలకు పైగా కుటుంబాల వారు తరతరాలుగా ఆ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు. ఈ ప్రభుత్వం వచ్చాక పూర్తిగా నిరాదరణకు గురవుతున్నామన్నారు. గిట్టుబాటు ధర లేదు. మంచి ధర పలికే వరకూ నిల్వ చేసుకుందామంటే.. కోల్డు స్టోరేజీ సౌకర్యాలు అసలే లేవు. గత్యంతరం లేక తక్కువ ధరకే అమ్ముకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

చాలా బాధేసింది. ఇలాంటి వ్యవసాయాధారిత ఉత్పత్తుల తయారీని కుటీర పరిశ్రమగా గుర్తించి ప్రోత్సహిస్తే.. వారు బాగుపడతారు. రైతన్నలకూ లబ్ధి చేకూరుతుంది. ఆ మాత్రం ఆలోచన కూడా లేకపోవడమన్నది.. రైతన్నలపై ఈ పాలకులకు ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం. ఇక్కడ వాస్తవంగా వ్యవసాయం ఇంత దుర్భరంగా ఉంటే.. తమ ఏలుబడిలో అద్భుతంగా ఉందని బూటకపు ప్రచారం చేసుకునే వారిని ఏమనుకోవాలి? వ్యవసాయాన్ని సంక్షోభంలోకి నెట్టేసిన వ్యక్తే.. అమెరికాకు పోయి ఇక్కడంతా గొప్పగా ఉందని ఉపన్యాసాలివ్వడం.. ఎంతటి హాస్యాస్పదం!భీమాళికి చెందిన అచ్చెన్నాయుడు.. ఎన్నికలకు ముందు రూ.30 వేల బ్యాంకు రుణం తీసుకున్నాడు. బాబుగారి రుణమాఫీ హామీని నమ్మి మాఫీ అవుతుందని ఆశపడ్డాడు. తీరా మాఫీ కాకపోగా.. వడ్డీతో అప్పు తడిసి మోపెడైంది. ఈ ప్రాంత రైతన్నలందరిదీ ఇదే బాధ.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. మనదేశంలోని 29 రాష్ట్రాల్లో రైతన్నల నెలవారీ ఆదాయంలో మన రాష్ట్రం చివరి 28వ స్థానంలో ఉందనేది నిజం కాదా? వాస్తవ పరిస్థితులు ఇలా ఉంటే.. వ్యవసాయంలో దేశంలోనే మన రాష్ట్రం అగ్రగామిగా ఉందని ఉపన్యాసాలివ్వడం ఎవర్ని మోసం చేయడానికి?   

-వైఎస్‌ జగన్‌ 

Advertisement

What’s your opinion

Advertisement