274వ రోజు పాదయాత్ర డైరీ | Sakshi
Sakshi News home page

274వ రోజు పాదయాత్ర డైరీ

Published Mon, Oct 1 2018 4:28 AM

274th day padayatra diary - Sakshi

30–09–2018, ఆదివారం 
జొన్నవలస క్రాస్, విజయనగరం జిల్లా

అగ్రిగోల్డ్‌ ఆస్తులను తగ్గించి చూపడం వెనుక మతలబేంటి బాబూ?
ఈ రోజు గజపతినగరం నియోజకవర్గం జామిలో ప్రారంభమైన పాదయాత్ర.. విశాఖ జిల్లా భీమిలి నియోజకవర్గం పద్మనాభం మండలంలోంచి విజయనగరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. జిల్లాలు వేరైనా.. నియోజకవర్గాలు వేరైనా.. ప్రజల సమస్యల్లో పెద్ద తేడా లేదనిపించింది.  

 ఉదయం కలిసిన నారాయణరావన్న చిన్నపాటి సైకిల్‌ షాపు నడుపుకొనేవాడట. పదేళ్ల కిందట గుండె జబ్బు వస్తే.. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్‌ వైద్యం అందిందట. నాన్నగారే తనకు ఆయుçష్షు పోశారని కృతజ్ఞతలు తెలిపాడు. అలాగే ఆయన కొడుకు పూర్తి ఫీజురీయింబర్స్‌మెంట్‌తో బీటెక్‌ చదివి ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నాడట. తమ జీవితాల్లో వెలుగులు నింపిన నాన్నగారిని గుర్తుచేసుకోని రోజంటూ ఉండదని చెబుతుంటే.. మనసంతా సంతోషంతో నిండిపోయింది.  

బాబుగారికి, సహకార చక్కెర కర్మాగారాలకు అవినాభావ సంబంధం ఉంది. ఆయన అధికారంలోకి రావడం.. అవి మూతపడటం.. అతి తక్కువ ధరకే బినామీలకు అమ్మేయాలనుకోవడం షరా మామూలే. భీమసింగి చక్కెర ఫ్యాక్టరీ వద్ద కలిసిన కార్మికులు ఇదే విషయాన్ని గుర్తుచేసుకున్నారు. 15 ఏళ్ల కిందట బాబుగారి పాలనలోనే ఈ ఫ్యాక్టరీ మూతబడింది. అప్పుడు పాదయాత్రగా వచ్చిన నాన్నగారిని కలిసి కార్మికులు తమ గోడు చెప్పుకొన్నారు. నాన్నగారు అధికారంలోకి రాగానే ఆ ఫ్యాక్టరీని తెరిపించారు. ఈ రోజు మళ్లీ ఆ ఫ్యాక్టరీ అంపశయ్యపై ఉంది. ఆదుకోవాలని కార్మికులు నాకు వినతిపత్రం ఇచ్చారు.  

ప్రభుత్వ నిరాదరణ, పోలీసుల వేధింపులతో తమ మనుగడే కష్టమైందని ఆవేదన వ్యక్తం చేశారు స్వర్ణకారులు. ప్రభుత్వ నిర్వాకం, కార్పొరేట్‌ సంస్థల ప్రాభవం మాటున మసకబారిపోతున్న ఆ పేద విశ్వబ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు నింపాలన్న నా సంకల్పం మరింత దృఢపడింది.  

విజయనగరాన్ని సాంస్కృతిక రాజధాని అంటారు. ఎంతో మంది గొప్ప గాయకులను, కళాకారులను, కవులను అందించిన నేల ఇది. ఇక్కడి కోరుకొండ సైనిక్‌ స్కూల్‌ మహా ప్రసిద్ధి. ఈ స్కూలు విద్యార్థులు దేశ త్రివిధ దళాల్లోనే కాకుండా.. వివిధ రంగాల్లో గొప్ప గొప్ప స్థానాలను అధిరోహించారు.  

వెనుకబడ్డ ఉత్తరాంధ్రలోనే అగ్రిగోల్డ్‌ బాధితులు అత్యధికం. రాష్ట్రంలో దాదాపు మూడో వంతు మంది ఈ మూడు జిల్లాల్లోనే ఉన్నారు. విజయనగరం జిల్లా వారు కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ పెద్దల మాటలకు, చేతలకు పొంతనే లేదన్నారు. వారి వ్యవహారం చూస్తుంటే.. సమస్య తీరుతుందన్న నమ్మకం పోయి, మోసం జరుగుతుందన్న భయం కలుగుతోందన్నారు. మాకు న్యాయం చేయాలన్న తపన కన్నా.. సంస్థ ఆస్తులను కాజేయాలన్న తాపత్రయమే ఎక్కువగా కనిపిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.  

ముఖ్యమంత్రిగారికి నాదో ప్రశ్న.. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకుంటామని హామీ ఇచ్చి నాలుగేళ్లయినా ఆ దిశగా ఒక్క ముందడుగైనా వేశారా? అది చేయకపోగా.. సంస్థ ఆస్తుల విలువను పథకం ప్రకారం తగ్గించి చూపడం.. కొన్ని ఆస్తులను ఇప్పటికే బినామీల ద్వారా కొనుగోలు చేయించడం.. మరికొన్ని విలువైన ఆస్తులను వేలం నుంచి మినహాయించడం వాస్తవం కాదా? మిగిలిన ఆస్తులను కొనుగోలు చేయడానికి ముందుకొచ్చిన సంస్థతో అర్ధరాత్రి వేళ తెరచాటు మంతనాలు జరపడం వెనుక మతలబు ఏంటి?
-వైఎస్‌ జగన్‌  

Advertisement
Advertisement