ఊరూపేరూలేని ఓటర్లు 3.90 లక్షల మంది | Sakshi
Sakshi News home page

ఊరూపేరూలేని ఓటర్లు 3.90 లక్షల మంది

Published Wed, Dec 5 2018 5:11 AM

3.90 lakh people Votes without addresses - Sakshi

సాక్షి, అమరావతి: ఆలూ లేదు... చూలూ లేదు... కొడుకు పేరు సోమలింగం అన్నట్లుగా... ఉంది రాష్ట్రంలోని ఓటర్ల నమోదు ప్రక్రియ. రాష్ట్రంలోనే నివాసముంటున్నట్లు ఎలాంటి అడ్రసులు లేకుండానే లక్షల మందిని ఓటర్లుగా నమోదు చేశారు. ప్రాథమిక సమాచారం ప్రకారం ఇలాంటి ఓటరు సోమలింగాలు దాదాపు 3.95 లక్షలకు పైగా ఉన్నారు. అసలు ఆ వ్యక్తులున్నారో లేరో తెలియకుండానే ఓటర్లుగా అనుమతించడం ప్రజాస్వామ్యవాదులను విస్మయపరుస్తోంది. ఒకే ఇంటి నెంబర్‌తో వందల్లో పేర్లు నమోదుచేయడం ఒక ఎత్తయితే కొన్నిటికి నెంబర్లేమీ వేయకుండానే ‘సేమ్‌’ ‘ఓల్డ్‌’ అంటూ రాసి ఓట్లు నమోదు చేశారు. కొన్ని చోట్ల ఇంటినెంబర్‌ స్థానంలో ‘డాష్‌’ (––) పెట్టి లెక్కకు మించి ఓట్లు నమోదయ్యాయి. రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ, బోగస్‌ ఓట్ల సంఖ్య కుప్పలు తెప్పలుగా ఉన్నట్లు ఇప్పటికే తేటతెల్లమైన విషయం తెలిసిందే. ‘ఓటర్‌ అనలటిక్స్‌ స్ట్రాటజీ టీమ్‌’ (వాస్ట్‌) నకిలీ ఓట్లపై అధ్యయనం చేసి నివేదికలు కూడా రూపొందించింది.

ఆయా అంశాలపై ‘సాక్షి’లో వరుసగా విశ్లేషణాత్మక కథనాలూ వచ్చాయి. కనీసం అప్పటి వరకు ఉండి చనిపోయిన వారి పేరిట ఓట్లు కొనసాగుతున్నాయన్నా... లేదా ఒకరికే ఒకటికి మించి అయిదు వరకు ఓట్లు నమోదు అయ్యాయన్నా ఆ తప్పులను కొంత వరకు అర్థం చేసుకోవచ్చు. కానీ అసలు ఆ వ్యక్తులున్నారో లేదో కూడా తెలియని పేర్లతో లక్షల కొద్దీ ఓట్లు నమోదు అవ్వడం విస్తుగొల్పుతోంది. క్షేత్రస్థాయిలో సిబ్బందిని ప్రలోభపెట్టో, బెదిరించో.. అధికారపార్టీ నేతలు తమకు అనుకూలంగా ఈ ఊరూ పేరు లేని ఓట్లను నమోదు చేయించి ఉంటారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలోని దాదాపు అన్ని నియోజకవర్గాల్లో ఇలా చేసినట్లు తెలుస్తోంది.

దేశంలో ఎక్కడా లేనంతగా రాష్ట్రంలో 52.67 లక్షల నకిలీ ఓట్లు ఉన్నట్లు ‘వాస్ట్‌’ అధ్యయనంలో ఇప్పటికే తేలిన సంగతి తెలిసిందే. ఒక వ్యక్తి పేరుతో రెండేసి ఓట్లు 36,404 ఉండగా ఓటరు పేరు, తండ్రి/భర్త పేరు, ఇంటినెంబర్, వయసు, లింగం సమానంగా ఉన్న డూప్లికేట్‌ ఓట్లు 82,788 ఉన్నాయి. మిగతా వివరాలు ఒకేగా ఉండి వయసు మార్చి నమోదు చేసినవి 24,928 కాగా జెండర్‌ మార్పుతో ఉన్నవి 1006 ఓట్లు. ఇక తండ్రి/భర్త పేరు మార్పుచేసి నమోదు అయినవి 92,198 ఉన్నాయని వాస్ట్‌ పరిశీలనలో తేలింది. ఇక ఏకంగా ఓటరు పేరులోని పదాలను ముందు వెనుకలకు మార్చి నమోదు చేసినవి 2,60,634 ఉన్నాయి. ఓటరు పేరు, తండ్రి/భర్త పేరులను అదే విధంగా ఉంచి మిగతా స్వల్పమార్పులతో నమోదైన నకిలీ ఓట్లు 25,17,164. ఆంధ్రప్రదేశ్‌తో పాటు తెలంగాణలోనూ  ఓటు ఉన్నవారు 18,50,511 మంది ప్రజాస్వామ్యవాదులను కలవరపాటుకు గురిచేస్తోంది. ఇదే కోవలో అసలు ఊరూపేరూ లేకుండానే ఏకంగా 3,95,125కు పైగా నకిలీ ఓట్లు నమోదైనట్లు వాస్ట్‌ పరిశీలనలో తేలింది. ఇంకా లోతుగా పరిశీలన చేస్తే మరిన్ని వేల ఓట్లు ఇలాంటివి బయటపడతాయని ఆ అధ్యయన సంస్థ హెడ్‌ తుమ్మల లోకేశ్వరరెడ్డి పేర్కొన్నారు.

అధికార పార్టీ ఆధ్వర్యంలోనేనా ఇదంతా...
ఓ ప్రణాళిక ప్రకారం అధికార తెలుగుదేశం పార్టీ ఇలా తమకు అనుకూలంగా ఓట్లు నకిలీ ఓట్లు ఓట్లు నమోదు చేయిస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నియోజకవర్గానికి ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి ఈ కార్యక్రమాన్ని చాపకింద నీరులా కొనసాగించినట్లు చెబుతున్నారు. సర్వే పేరుతో ఈ టీములు వెళ్లి వైఎస్సార్‌సీపీ అభిమానులను గుర్తించి వారి ఓట్లను తొలగించడం కూడా చేశాయి. ఇప్పటికే పలు నియోజకవర్గాల్లో ఈ టీములు పట్టుబడడం ఈ ఆరోపణలకు బలం చేకూర్చుతోంది. వారికి ఆధునిక సాంకేతిక పరికరాలను అందించి ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నట్లు తేలింది. వీరి వద్ద చంద్రబాబునాయుడి ఫొటోతో ఉన్న టీడీపీ గుర్తింపుకార్డులు కూడా పట్టుబడ్డాయి. పట్టుబడిన ఈ టీములపై ఎన్నికలసంఘం నియమావళి ప్రకారం కేసు నమోదు చేయాల్సి ఉన్నా అధికారపార్టీ నేతల ఒత్తిళ్లతో పోలీసులు మౌనం దాల్చుతున్నారు.  

విశాఖ వెస్ట్‌లో ఒకే ఇంటి నెంబర్‌తో 3,128 ఓట్లు
ఇంటి చిరునామాలు ఏమీ లేకుండా పైన ఓటరు ఇంటి నెంబరుతో సేమ్‌ అని పేర్కొంటూ పలు పేర్లు దర్శనమిస్తున్నాయి. విశాఖపట్నం వెస్ట్‌ నియోజకవర్గంలో 3,128 ఓట్లు ఇలా తేలాయి. ఈ నియోజకవర్గంలోని బూత్‌నెంబర్‌ 154 పరిధిలో ఇంటినెంబర్‌ స్థానంలో సేమ్‌ అంటూ 394 (సీరియల్‌ నెంబర్‌ 340 నుంచి 733 వరకు) ఓట్లు నమోదు అయ్యాయి. అలాగే బూత్‌నెంబర్‌ 155లో 688 (సీరియల్‌ నెంబర్‌ 321 నుంచి 1036 వరకు), బూత్‌ నెంబర్‌ 161లో 118, బూత్‌నెంబర్‌ 181లో 555 ఓట్లు ఇలా ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో ‘ఎక్స్‌బీ01574863’ ఐడీనెంబర్‌తో చిరునామా ఏమీ లేకుండా ఇంటినెంబర్‌ ‘1ఏ’ అని ఓటు నమోదైంది. ఇలా 1ఏతో పలు ఓట్లున్నాయి. ఒకే ఇంటి నెంబర్‌తో ఇన్ని పేర్లుండడానికి వీల్లేదని, ఊరూ పేరు లేని పేర్లకు సేమ్‌ అని పెట్టి నమోదు చేయించినట్లుగా ఉందని చెబుతున్నారు. కొన్ని చోట్ల ఇంటి నెంబర్‌ వద్ద ఏమీ రాయకుండా రెండు గీతలు పెట్టి (డాష్‌) వేలాది ఓట్లు జాబితాల్లో దర్శనమిస్తున్నాయి. ప్రకాశం జిల్లా సంతనూతలపాడు, కడప జిల్లా రాజంపేట, గుంటూరుజిల్లా సత్తెనపల్లి నియోజకవర్గాల్లో ఇంటి నెంబర్‌కు బదులు ‘ఓల్డ్‌’ అంటూ పేర్కొని నమోదు చేసిన ఓట్లు కూడా వేలల్లోనే ఉన్నాయి.

Advertisement
Advertisement