వ్యాపారి కంట్లో కారం కొట్టి...బంగారం దోపిడీ | Sakshi
Sakshi News home page

వ్యాపారి కంట్లో కారం కొట్టి...బంగారం దోపిడీ

Published Tue, Dec 2 2014 8:50 AM

వ్యాపారి కంట్లో కారం కొట్టి...బంగారం దోపిడీ - Sakshi

ధర్మవరం అర్బన్ : వ్యాపారి కంట్లో కారంకొట్టి మూడు కేజీల బంగారం దోచుకెళ్లిన ఘటన ధర్మవరం పట్టణంలో సోమవారం రాత్రి కలకలం రేపింది. పోలీసులు, బాధితుడి కథనం ప్రకారం.. పట్టణంలోని అంజుమన్ సర్కిల్‌లో అల్లాబకాష్ జ్యువెలరీస్ యజమాని ఖాజా హుసేన్ బంగారు వ్యాపారం చేస్తున్నాడు. జ్యువెలరీ షాపుతో పాటు బంగారు దిగుమతి వ్యాపారం కూడా ఉంది.

 

ఖాజాహుసేన్ సోమవారం రాత్రి తొమ్మిది గంటల సమయంలో షాపును మూసివేసి దిగుమతికి సంబంధించిన రూ.80 లక్షలు విలువచేసే బంగారు బిస్కెట్లు, నగలను తీసుకుని తన ద్విచక్ర వాహనంలో ఇంటికి వెళ్తున్నాడు. ప్రణవసాయి ప్రైవేటు స్కూల్ వద్దకు వెళ్లగానే అక్కడే మాటు వేసిన ఆరుగురు దుండగులు వ్యాపారి కళ్లలో కారం కొట్టి బంగారం బ్యాగ్‌ను తీసుకుని పరారయ్యారు. ఖాజా హుసేన్ కేకలు వేయడంతో సమీపంలోని స్థానికులు అప్రమత్తమయ్యారు. రెండు ద్విచక్ర వాహనాలపై వెళ్తున్న ఆరుగురిని పట్టుకునేందుకు ప్రయత్నించారు.

ఒక దుండగుడు స్థానికులకు చిక్కాడు. బైక్‌పై వెళ్లే మిగిలిన ఇద్దరూ కూడా బైక్‌ను వదిలేసి అక్కడి నుంచి పరారయ్యారు. మరో ద్విచక్ర వాహనంలో ఉన్న ముగ్గరు దుండగులు బ్యాగ్‌తో అక్కడి నుంచి పారిపోయూరు. దీంతో స్థానికులు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. స్థానికులు పట్టుకున్న దుండగుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి పేరు వెంకటేశ్ అని, అతను బళ్లారికి చెందిన వ్యక్తిగా పోలీసుల విచారణలో తేలింది. దొంగతనం విషయం తెలుసుకున్న బంగారు వ్యాపారులు, మైనార్టీలు పెద్ద ఎత్తున పట్టణ పోలీస్‌స్టేషన్‌కు తరలివచ్చారు. దుండగుడిని తమకు అప్పజెప్పాలని డిమాండ్ చేశారు. కొంతసేపటి తర్వాత ధర్మవరం పట్టణానికి చెందిన నిట్టు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి రూ.3.30 లక్షలు స్వాధీనం చేసుకున్నారు.

పక్కా ప్లాన్‌తోనే..
కర్ణాటక ప్రాంతానికి చెందిన ఒక అంతర్రాష్ట్ర ముఠా ఈ వ్యవహారంలో ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. సంచలన కేసుల్లో కూడా వీరు పాల్గొని ఉండవచ్చునని భావిస్తున్నారు. భారీ పరిమాణంలో బంగారాన్ని ఖాజాహుసేన్ తీసుకుళ్తుండే విషయూన్ని ముందే గమనించి పక్కా సమాచారం సేకరించినట్లు తెలుస్తోంది. ఖాజా హుసేన్ ఎక్కువగా కర్ణాటక ప్రాంతం నుంచి బంగారం తీసుకుని వస్తుండడంతో అక్కడి నుంచే ప్రణాళికలు రూపొందించి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

 

సుమారు 15 రోజుల క్రితం నుంచే ఈ వ్యవహారంలో పక్కాప్లాన్‌ను దుండగులు అమలు చేసేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది. ఖాజా హుసేన్ బంగారు అంగడి నుంచి ఇంటి వరకు ఎంత దూరం? వాహనం ఎక్కడ స్లోగా వెళ్తుంది? ఎక్కడ జనసంఖ్య తక్కువగా ఉంటుంది? పారిపోయే మార్గాలను కూడా అన్వేషించుకుని, ఈ పనికి పాల్పడినట్లు సమాచారం. అయితే ఈ వ్యవహారంలో పోలీసులు మరో కోణంలో కూడా విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఖాజాహుసేన్‌కు బాగా తెలిసినవారు కానీ, సన్నిహితుల హస్తం ఉండే అవకాశం ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నారు.

పోలీసుల అదుపులో మరో ఇద్దరు?
బంగారు వ్యాపారి ఖాజాహుసేన్‌ను దోచుకున్న కేసులో మరో ఇద్దరిని కూడా సోమవారం రాత్రి పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. పారిపోతున్న వారిని స్థానికులు అడ్డుకోవడంతో... బైక్‌తో పాటు వెంకటేశ్‌ను పోలీసులు స్టేషన్‌కు తరలించారు. బైక్‌లో మిగిలిన ఇద్దరు కూడా తప్పించుకునే ప్రయత్నంలో పోలీసులకు చిక్కినట్లు తెలుస్తోంది. దుండగులు చెరువు కట్ట మీదుగా ఓబుళనాయునిపల్లి వైపు వెళ్లినట్లు స్పష్టం కావడంతో పోలీసులు ఆరు బృందాలుగా వీడిపోయి వెంకటకృష్ణాపురం, బత్తలపల్లి, ముదిగుబ్బ, కొత్తచెరువు, బుక్కపట్నం ప్రాంతాలలో నిందితుల కోసం గాలిస్తున్నట్లు సమాచారం.

Advertisement

తప్పక చదవండి

Advertisement