తాడిపత్రి స్టీల్‌ ఫ్యాక్టరీలో విషాదం | Sakshi
Sakshi News home page

తాడిపత్రి స్టీల్‌ ఫ్యాక్టరీలో విషాదం

Published Thu, Jul 12 2018 6:43 PM

6 Killed As Poisinous Gas Leaked In Steel Factory - Sakshi

సాక్షి, అనంతపురం : జిల్లాలోని తాడిపత్రిలో గురువారం విషాదం అలముకుంది. స్థానిక గెరుడౌ స్టీల్‌ ఫ్యాక్టరీలో విష వాయువు విడుదల కావడంతో ఆరుగురు కార్మికులు ప్రాణాలు విడిచారు. పెద్దగదిలో పది మంది కార్మికులు పని చేస్తుండగా విష వాయువు విడుదలైనట్లు తెలిసింది. దీంతో ఆ వాయువును పీల్చిన వారిలో రంగనాథ్‌, మనోజ్‌, లింగయ్య, గంగాధర్‌, వసీమ్‌, గురవయ్యలు అక్కడికక్కడే మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వారిని మిగిలిని కార్మికులు హుటాహుటిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు.

కాగా, సకాలంలో లోపాలను సవరించకుండా నిర్లక్ష్యం చేయడంతోనే విషవాయువు లీకైందని కార్మికులు ఆరోపిస్తున్నారు. బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను స్టీల్‌ ఫ్యాక్టరీ యాజమాన్యం ఇంకా వెల్లడించలేదు. కార్బన్ మోనాక్సైడ్ లీకవటంతో ప్రమాదం జరిగిట్టు ప్రాథమిక సమాచారం. 400 చదరపు అడుగుల గదిలో మరమ్మతులు చేస్తుండగా ఒక్కసారిగా లీకైనట్టు తెలుస్తోంది. తొలుత ముగ్గురు మృతి చెందగా, వారిని కాపాడేందుకు వెళ్లి మరో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని కార్మికులు చెబుతున్నారు. ప్రమాదంలో మరణించిన వారందరూ నిరుపేదలుగా తెలుస్తోంది. ఉపాధి కోసం వారు ఫ్యాక్టరీలో పని చేస్తున్నారు. పనికి వెళ్లిన వారు విగతజీవులు కావడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితుల కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి.

వైఎస్‌ జగన్‌ దిగ్భ్రాంతి
తాడిపత్రి స్టీల్‌ ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రతిపక్ష నాయకుడు, వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో ఆరుగురు కార్మికులు ప్రాణాలు కోల్పోవడం పట్ల సంతాపం ప్రకటించారు. విష వాయువు బారినపడిన బాధితులకు తక్షణమే వైద్య సహాయం అందించాలని ప్రభుత్వాన్ని కోరారు. స్టీల్‌ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను తాడిపత్రి ఆసుపత్రిలో వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర కార్యదర్శులు పైలా నరసింహయ్య, రమేశ్‌ రెడ్డి పరామర్శించారు. మృతుల కుటుంబాలకు రూ. 50 లక్షల పరిహారం, ఒక ఉద్యోగం, ఐదు ఎకరాల భూమి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

తాడిపత్రిలో ఉద్రిక్తత
గెరుడౌ స్టీల్ ఫ్యాక్టరీ మృతుల కుటుంబాలను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్సార్ సీపీ, సీపీఐ, సీపీఎం నేతలు ఆందోళనకు దిగారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన టీడీపీ నేత జిలాన్ బాషాను ఆందోళనకారులు అడ్డుకున్నారు.

ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధితులకు అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున పరిహారం అందిస్తామని జాయింట్‌ కలెక్టర్‌ ఢిల్లీరావు ప్రకటించారు. గెరుడౌ స్టీల్‌ ఫ్యాక్టరీపై క్రిమినల్‌ కేసు నమోదు చేసినట్లు తెలిపారు. విచారణ అనంతరం దోషులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.

Advertisement
Advertisement