రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు | Sakshi
Sakshi News home page

రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు

Published Thu, May 4 2017 3:21 AM

రెండేళ్లలో 6 లక్షల ఉద్యోగాలు

మేధా టవర్స్‌లో ఏడు ఐటీ కంపెనీలను ప్రారంభించిన మంత్రి లోకేశ్‌  
సాక్షి, అమరావతి: వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో ఆరు లక్షల ఉద్యోగాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. విజయవాడలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేసిన ఏడు ఐటీ కంపెనీలను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. తయారీ రంగంతో పాటు టూరిజం వంటి అన్ని రంగాల్లోనూ పెట్టుబడులను ఆకర్షిస్తున్నట్లు చెప్పారు. కార్లలో ఇంటీరియర్స్‌ డిజైన్‌ చేసే గ్రూపో ఆంటోలిన్‌తో పాటు, మెస్లోవా, చందూ సాఫ్ట్, ఐఈఎస్, రోటోమేకర్, యామ్‌హై, ఈపీ సాఫ్ట్‌ కంపెనీలు తమ కార్యకలాపాలను ప్రారంభించాయని, వీటి ద్వారా వచ్చే రెండేళ్లలో 1,600 ఉద్యోగాలు రానున్నాయని లోకేశ్‌ చెప్పారు.

పాతదానికే కొత్త రంగు వేశాం కదా..:ఐటీ రంగాన్ని ద్వితీయ శ్రేణి పట్టణాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో దివంగత సీఎం డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. మేధాటవర్స్‌ పేరుతో విజయవాడలో ప్రత్యేక ఆర్థికమండలిని ఏర్పాటు చేయించారు.  ఇదే సెజ్‌ను ప్రస్తుత ప్రభుత్వం ఐటీ కంపెనీల ఏర్పాటుకు ఉపయోగించుకుంటోంది. బుధవారం ఐటీ కంపెనీలను ప్రారంభించడానికి వచ్చినప్పుడు లోకేశ్‌ దృష్టిలో పడేందుకు ఒక మీడియా ప్రతినిధి ‘సార్, మీరొచ్చాక దీనికొక కళ వచ్చింది..’ అని అనగా.. లోకేశ్‌ స్పందిస్తూ ‘పాతదానికే కొత్త రంగు వేశాం కదా’ అని సమాధానమివ్వడంతో అక్కడున్నవారంతా అవాక్కయ్యారు. కాగావచ్చే ఏడాది కాలంలో లక్ష మందికి ఐటీ ఉద్యోగాలిప్పిస్తామని మంత్రి లోకేశ్‌ చెప్పారు. హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ సంస్థ ఏపీలో ఐటీ సర్వీసులు ప్రారంభించేందుకు ఎంవోయూ కుదుర్చుకున్న సందర్భంగా బుధవారం విజయవాడలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement