అభివృద్ధికి పునరంకితం | Sakshi
Sakshi News home page

అభివృద్ధికి పునరంకితం

Published Mon, Jan 27 2014 2:11 AM

అభివృద్ధికి పునరంకితం - Sakshi

జిల్లాలో 65వ గణతంత్ర దినోత్సవం ఘనంగా జరిగింది. మచిలీపట్నం పోలీస్ పెరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం నిర్వహించిన ఈ వేడుకల్లో కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. మహనీయుల త్యాగాలే స్ఫూర్తిగా జిల్లా అభివృద్ధికి పునరంకితమవ్వాలని పిలుపునిచ్చారు
 
మచిలీపట్నం, న్యూస్‌లైన్ : మహనీయుల త్యాగాలను స్ఫూర్తిగా తీసుకుని జిల్లా అభివృద్ధికి పునరంకితమవుదామని కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు సూచించా రు. 65వ గణతంత్ర దినోత్సవాలు స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో ఆదివారం ఘనంగా జరిగాయి. జాతీయ జెండాను కలెక్టర్ ఆవిష్కరించారు. అనంతరం పోలీసుల నుంచి గౌరవవందనం స్వీకరించారు.  

ఆయన మాట్లాడుతూ  స్వాతంత్ర పోరాటంలో జిల్లాకు చెందిన ఎందరో మహనీయులు పాలు పంచుకున్నారన్నారు. జాతీయ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య మనజిల్లా వాసి కావటం గర్వకారణమని చెప్పారు. కంకిపాడు మండలం పునాదిపాడు గ్రామానికి చెందిన అనుమోలు రామకృష్ణ శాస్త్ర, సాంకేతిక రంగాల్లో చేసిన సేవలకు గానూ పద్మభూషణ్ పురస్కారం, డాక్టర్ అనుమోలు రామారావుకు సామాజిక సేవ చేసినందుకు గానూ పద్మశ్రీ పురస్కారాలు లభించటం జిల్లా ప్రతిష్టను ఇనుమడింపజేశాయన్నారు.
 
ప్రగతిపథంలో జిల్లా....
 
జిల్లాను ప్రగతిపథంలో పయనింజేయడంలో సంబంధిత అధికారులు నిరంతర కృషి సల్పారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో జరిగిన అభివృద్ధిని ఆయన వివరించారు. ప్రజాసమస్యల పరిష్కారం కోసం ఇందిరమ్మబాట, ప్రజాపథం, రచ్చబండ, రెవెన్యూ, రైతు సదస్సులు, ఇందిరమ్మ కలలు, ప్రజావాణి, మీ-సేవా తదితర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామన్నారు. పేద, బలహీనవర్గాల మహిళలు, రైతులు, విద్యార్థినీ, విద్యార్థుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నామని తెలిపారు.

పంటచేతికొచ్చే సమయంలో హెలెన్, లెహర్, తుపానులు, భారీ వర్షాల వల్ల పంటలు దెబ్బతిన్నాయన్నారు. దాదాపు రెండు లక్షల ఎకరాల్లో వివిధ పంటలు దెబ్బతిని  రూ. 200 కోట్ల నష్టం జరిగిందని వివరించారు. నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ ఉపప్రణాళిక ద్వారా రూ. 21 కోట్లతో 28 సామాజిక భవనాలు, రూ.12.50 కోట్లతో ఇందిరమ్మ విద్యాలయాలు నిర్మించనున్నట్లు తెలిపారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాల్లో రూ. 6 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.  

ఈ ఏడాది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రూ. 137 కోట్లతో 13వేల యూనిట్లు స్థాపించాలని లక్ష్యంగా నిర్ణయించామని తెలిపారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిలో ఇప్పటి వరకు 70 వేల సమస్యలు పరిష్కరించామని  చెప్పారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కుకు ప్రాముఖ్యత ఉందని, ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేయించుకోవాలని విసృ్తత ప్రచారం చేశామని తెలియజేశారు.
 
రుణాలు అందజేత ....
 
జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా పది మండలాల్లోని 49 క్లస్టర్లలో 3065 మంది మహిళా గ్రూపు సభ్యులకు రూ. 100 కోట్ల బ్యాంకు రుణాలను కలెక్టర్ పంపిణీ చేశారు. మత్స్యశాఖ ద్వారా రూ. 4.26 లక్షల విలువైన సైకిళ్లు, వలలను 62 మందికి అందజేశారు. వికలాంగుల సంక్షేమశాఖ ద్వారా 40 మంది వికలాంగులకు రూ. 2.50 లక్షలు విలువైన వీల్ చైర్లు, ట్రై సైకిళ్లు, 14 జతల చంక కర్రలు పంపిణీ చేశారు. వికలాంగులను వివాహం చేసుకున్న 14 జంటలకు ఒక్కొక్క జంటకు రూ. 50 వేల  చొప్పున ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

2012లో శిక్షణ పొందిన ఏఆర్ పోలీసులు వికలాంగులకు ట్రైసైకిళ్లు, పండ్లు, దుప్పట్లు సమకూర్చగా కలెక్టర్, ఎస్పీ వీటిని పంపిణీ చేశారు. స్వాతంత్య్ర సమరయోధులు కొండపల్లి పాండురంగారావు, చిల్లర మోహనరావు, మేకా నరసయ్య, జిల్లా ప్రధాన న్యాయమూర్తి చక్రధరరావు, ఎస్పీ జె.ప్రభాకరరావు, మొదటి అదనపు జిల్లా జడ్జి ఎంఆర్.శేషగిరిరావు, అనిత, జేసీ జె.మురళి, ఏజేసీ బీఎల్.చెన్నకేశవరావు, పట్టణ భూసేకరణ ప్రత్యేకాధికారి ఎన్.రమేష్, ట్రైనీ కలెక్టర్ కాళీచరణ్, జెడ్పీ సీఈవో బి.సుబ్బారావు, డ్వామా పీడీ అనిల్‌కుమార్, పశుసంవర్ధకశాఖ జేడీ దామోదరనాయుడు, వ్యవసాయశాఖ జేడీ బాలునాయక్, డీఈవో దేవానందరెడ్డి, డీఎంఅండ్‌హెచ్‌వో సరసజాక్షి, డీపీవో కె.ఆనంద్, సాంఘిక సంక్షేమశాఖ డీడీ డి.మధుసూదనరావు, బీసీ సంక్షేమశాఖ డీడీ ఎం.చినబాబు, ఆర్‌వీఎం పీవో వి.పద్మావతి, బీసీ కార్పొరేషన్ ఈడీ పుష్పలత, సీపీవో వెంకటేశ్వర్లు, ఆర్డీవోలు పి.సాయిబాబు, ఎస్.వెంకటసుబ్బయ్య, ఐసీడీఎస్ పీవో కృష్ణకుమారి  పాల్గొన్నారు.
 
రాజీవ్ విద్యామిషన్ శకటానికి ప్రథమస్థానం

మచిలీపట్నం క్రైం, న్యూస్‌లైన్ : గణతంత్ర దినోత్సవాల సందర్భంగా పోలీస్ పరేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన శకటాల ప్రదర్శనలో రాజీవ్ విద్యామిషన్  శకటానికి ప్రథమస్థానం లభించింది. డీఆర్డీఏ ద్వారా బంగారు తల్లి పథకం అమలు చేస్తున్న తీరు, జిల్లా నీటి యాజమాన్య సంస్థ ద్వారా అమలు చేస్తున్న పథకాలు, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా పేదలకు రుణాలు అందజేస్తున్న విధానం, గ్రామీణ నీటి సరఫరా విభాగం ఆధ్వర్యంలో శుద్ధి చేసిన నీటినే తాగాలని కోరుతూ బుర్రకథ బృందంతో ఏర్పాటు చేసిన శకటం, ఓటు హక్కును ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో అందుతున్న వైద్యసేవలు, 104, 108 తదితరాలను వివరిస్తూ ప్రత్యేక శకటాలను ఏర్పాటు చేశారు.

ఈ శకటాలను పరిశీలించిన అధికారులు రాజీవ్ విద్యామిషన్ శకటానికి రూ. 5వేలు ప్రోత్సాహక బహుమతి  ప్రకటించారు.   వివిధ శాఖల ద్వారా అమలు చేస్తున్న పథకాలను వివరించేందుకు  ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ఆకట్టుకున్నాయి. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి.
 

Advertisement
Advertisement