8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం | Sakshi
Sakshi News home page

8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం

Published Tue, Jun 10 2014 12:36 AM

8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం - Sakshi

భీమవరం క్రైం : హైదరాబాద్ నగర శివార్లలోని బాచుపల్లి విజ్ఞాన జ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న తన సహ విద్యార్థులు హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో గల్లంతవడం జీర్ణించుకోలేకపోతున్నానని ఆ కళాశాలలో బీటెక్ (మెకానికల్) సెకండియర్ చదువుతున్న ఆరేటి మధుదాన వెంకట చైతన్య (19) పేర్కొన్నాడు. భీమవరానికి చెందిన ఆరేటి మాణిక్యాలరావు (చిట్టిబాబు) కుమారుడైన చైతన్య సహవిద్యార్థులతో కలసి స్టడీ టూర్ నిమిత్తం అక్కడకు వెళ్లాడు. ఫోన్‌లో అతడితో మాట్లాడగా... ‘మా కళాశాల నుంచి మొత్తం 8 బ్యాచ్‌లుగా టూర్‌కు వెళ్లాం.
 
 మెకానికల్ బ్రాంచికి చెందిన మేమంతా మనాలి నుంచి బస్సులో వెళుతున్నాం. ఇన్‌స్ట్రుమెంటేషన్ బ్రాంచికి చెందిన విద్యార్థులంతా మరో బస్సులో మనాలికి వెళుతూ లార్జి డ్యామ్ వద్ద ఫొటోలు దిగేందుకు ఆగారు. ఒక్కసారిగా డ్యామ్ గేట్లు ఎత్తివేయడంతో ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన 15 నిముషాలకు మేమంతా డ్యామ్ వద్దకు చేరుకున్నాం. అక్కడ ట్రాఫిక్ జామ్ అయ్యింది. ఏం జరిగిందని అక్కడి వారిని అడగ్గా మా కాలేజీ విద్యార్ధులు గల్లంతయ్యారని చెప్పారు. మాకు కాళ్లు, చేతులు ఆడలేదు. ఈ బాధను తట్టుకోలేకపోతున్నాం. ప్రస్తుతం మేమంతా ఢిల్లీ చేరుకున్నాం. మంగళవారం ఉదయానికి హైదరాబాద్ చేరుకుంటాం’ అని చెప్పాడు.
 
 క్షేమమని తెలిసినా.. భయమేసింది
 ప్రమాదం జరిగిన విషయాన్ని టీవీలో చూశానని.. దీంతో తనకు చాలా భయమేసిందని చైతన్య తండ్రి మాణిక్యాలరావు తెలిపారు. ఒకపక్క కంగారు పడుతూనే తన కుమారుడు చైతన్యకు ఫోన్ చేశానని, క్షేమంగా ఉన్నాడని తెలుసుకుని ఊపిరిపీల్చుకున్నానని చెప్పారు. అయినా అంతమంది విద్యార్థులు గల్లంతవడం చాలా బాధ కలిగిస్తోందన్నారు. చేతికి అందివచ్చిన పిల్లలు చనిపోతే వారి తల్లితండ్రులు పడే నరకయాతన అంతాఇంతా కాదన్నారు. ఇటువంటి ప్రమాదకర ప్రాంతాలకు వెళ్లినప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, లేకపోతే తల్లిదండ్రులకు చాలా బాధను అనుభవించాల్సి వస్తుందని కన్నీరుమున్నీరయ్యారు.
 

Advertisement
Advertisement