గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతులు | Sakshi
Sakshi News home page

గణేశ్ నిమజ్జనంలో అపశ్రుతులు

Published Thu, Sep 19 2013 3:22 AM

8 died during of Ganesh Immersion

న్యూస్‌లైన్, నెట్‌వర్క్ : గణేశ్ నిమజ్జనం సందర్భంగా బుధవారం వేర్వేరు ప్రాంతాల్లో అపశ్రుతులు చోటుచేసుకోవడంతో 8మంది మృతి చెందగా, ఇద్దరు గల్లంతయ్యారు. ఆదిలాబాద్ జిల్లా సారంగాపూర్ మండలం జామ్ గ్రామ పరిధిలోని లక్ష్మీనగర్ తండాకు చెందిన జాదవ్ గణేశ్(35) విగ్రహ నిమజ్జనం కోసం ప్రాణహిత-చెవెళ్ల హైలెవెల్ కెనాల్‌లో దిగి గల్లంతయ్యాడు. మంచిర్యాల మేదరివాడకు చెందిన పెంటం వేణుమాధవ్(25) గణేశ్ శోభాయూత్రలో స్నేహితులు, స్థానికులతో గొడవపడి మనస్తాపానికి గురై ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు.
 
 ఇక్కడే హమాలీవాడ పరిధిలో గణేశ్ శోభాయాత్రకు కరెంట్ తీగను కర్రతో తప్పిస్తుండగా షాక్ తగిలి చింతకింది రాజు(19) మృతిచెందాడు. తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలోని బ్రాహ్మణ అగ్రహారానికి చెందిన దిట్టకవి రాము (23) గణేష్ విగ్రహాన్ని నిమజ్జనం చేసేందుకు గోదావరి రేవులోకి దిగి గల్లంతయ్యాడు. వరంగల్‌జిల్లా నర్సంపేటలోని వల్లభ్‌నగర్‌కు చెందిన గుగ్గిళ్ల ఉమాశంకర్(13) నిమజ్జనానికి వెళ్లి ప్రమాదవ శాత్తు దామెర చెరువులో పడి మృతిచెందాడు. శాయంపేట మండలంలోని గంగిరేణిగూడేనికి చెందిన వల్లాల తిరుపతి(40) తన స్నేహితుడు భాస్కర్ విద్యుత్‌షాక్‌కు గురవడంతో కాపాడబోయి అక్కడికక్కడే మృతి చెందాడు. అలాగే, దేవరుప్పుల మండలం మున్‌పాడ్‌కు చెందిన వర్రె మధు, గణేష్ విగ్రహం వద్ద వేలం పాట విషయమై భార్యతో గొడవపడి చేయిచేసుకోవడంతో ఆమె మనస్తాపానికి గురైన ఆత్మహత్యకు పాల్పడింది.  నర్సంపేటలో ఫొటోగ్రాఫర్ డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో మరణించాడు. కరీంనగర్ జిల్లాలో విద్యుత్‌షాక్‌తో మరో ఇద్దరు మృత్యువాత పడ్డారు.

Advertisement
Advertisement