Sakshi News home page

90 వేల మందికి అన్యాయం

Published Wed, Aug 5 2015 3:20 AM

90 thousand people is unfair

అనంతపురం అగ్రికల్చర్ : వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు పొడిగించకపోవడంతో జిల్లాలో దాదాపు 90 వేల మంది రైతులకు అన్యాయం జరుగుతోంది. మునుపెన్నడూ లేని విధంగా ప్రీమియం చెల్లింపు గడువు ఈ సారి ముందుగానే ముగిసింది. గతంలో చాలాసార్లు ఆగస్టు ఆఖరు వరకు గడువిచ్చారు. ఈసారి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం, వ్యవసాయ బీమా కంపెనీ మొదట జూన్ 30, ఆ తరువాత జులై 9, మరోసారి జులై  31 వరకు గడువు ఇచ్చాయి. మరోసారి గడువు పొడిగిస్తారని రైతులు ఆశించారు. రైతులు, రైతు సంఘాలు, విపక్షాలు గగ్గోలు పెడుతున్నా రాష్ట్ర ప్రభుత్వం గడువు పెంచడం లేదు.

దీనివల్ల వేరుశనగ రైతులు నష్టపోయే పరిస్థితి ఏర్పడింది. ప్రస్తుత ఖరీఫ్‌లో పంట రుణాల రెన్యూవల్, కొత్త రుణాల కింద 6.20 లక్షల మందికి రూ.3,056 కోట్లు ఇవ్వాలని బ్యాంకర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. వాతావరణ బీమా ప్రీమియం చెల్లింపు గడువు ముగిసిన జులె 31 నాటికి 5.22 లక్షల మంది  రూ.2,648 కోట్లు రెన్యూవల్ చేసుకున్నారు. వీరందరికీ బీమా వర్తించనుంది.  ఇంకా 90 వేల మందికి అన్యాయం జరుగుతోంది. రూ.408 కోట్లు రెన్యూవల్ కావాల్సివుంది. జిల్లా వ్యాప్తంగా 33 ప్రిన్సిపల్ బ్యాంకుల కింద సుమారు 400  శాఖలు పనిచేస్తున్నాయి.

రెన్యూవల్‌కు రైతులు ఎగబడుతున్నా  బ్యాంకుల్లో సిబ్బంది కొరత, సాంకేతిక సమస్యల వల్ల  ఆశించిన స్థాయిలో వేగవంతం కాలేదు. దీనివల్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ఎన్ని హెక్టార్లకు ఎన్ని కోట్ల ప్రీమియం చెల్లించారనే లెక్కలు అన్ని బ్యాంకు శాఖల నుంచి అందాల్సివుంది. ఈ సారి అగ్రికల్చర్ గోల్డ్ లోన్ల కింద 68,024 మందికి రూ.438.05 కోట్లు ఇచ్చినట్లు లీడ్‌బ్యాంకు జిల్లా మేనేజర్ (ఎల్‌డీఎం) జయశంకర్ తెలిపారు. బీమా గడువు పొడిగింపునకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి ఉత్తర్వులూ రాలేదన్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement