విభజనాగ్రహం | Sakshi
Sakshi News home page

విభజనాగ్రహం

Published Sun, Dec 8 2013 3:29 AM

A bandh call given by the YSR Congress party

 రాష్ర్ట విభజనకు వ్యతిరేకంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు శనివారం వేలాది మంది కార్యకర్తలు, నాయకులు కదంతొక్కారు... రెండో రోజు కూడా ఆగ్రహ జ్వాలలు మిన్నంటాయి. వైఎస్‌ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఏపీ ఎన్జీవోలు, సమైక్యవాదులు రోడ్లమీదకు వచ్చి ర్యాలీలు నిర్వహించారు. రోడ్లను దిగ్బంధించారు. మానవహారాలు నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. పలు ప్రాంతాల్లో  వాణిజ్య, విద్యా సంస్థలను స్వచ్ఛందంగా మూసివేశారు. బొబ్బిలి, పార్వతీపురం, చీపురుపల్లి, గజపతినగరం నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. బంద్ విజయవంతం అయింది.
 
 బొబ్బిలి, న్యూస్‌లైన్:బొబ్బిలిలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అరుకు పార్లమెంటు పరిశీలకుడు ఆర్వీఎస్‌కేకే రంగారావు( బేబినాయన) ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఉదయం ఆరు గంటలకే  కాంప్లెక్స్ వద్ద ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. రోడ్డుపై దాదాపు రెండు గంటల పాటు బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా  మానవహారంగా ఏర్పడ్డారు. ఈ  ఆందోళనకు ఏపీ ఎన్జీఓ సంఘం స్థానిక నాయకులు, వ్యాపారులు, ఉద్యోగులు సంఘీభావం తెలిపారు. అనంతరం వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, సమైక్యవాదులతో భారీ ర్యాలీ నిర్వహించారు. పట్టణంలోని అన్ని వీధుల గుండా ఈ ర్యాలీ సాగింది.  
 
 కేంద్ర ప్రభుత్వం, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రేలారే రేలా బృంద కళాకారులు ఆలపించిన సమైక్య గీతాలు ఆకట్టుకున్నాయి. బొబ్బిలిలో వర్తక, వ్యాపార, వాణిజ్య సంస్థలు, విద్యాసంస్థలు  బంద్ పాటించాయి. సినిమా హాళ్లలో ఉదయం ఆట ప్రదర్శించలేదు. బ్యాంకులు మూసి వేసి సంఘీభావం తెలిపారు. పార్వతీపురం నియోజకవర్గ కేంద్రంలో సమన్వయకర్తలు కొయ్యాన శ్రీవాణి, జమ్మాన ప్రసన్నకుమార్, గర్బాపు ఉదయభాను, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ గుల్లిపల్లి సుదర్శనరావుల ఆధ్వర్యంలో ఉదయం నుంచి ఆర్టీసీ కాంప్లెక్స్ ఎదుట ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. ఆర్టీసీ డిపో నుంచి 11 గంటల వరకు ఒక్క బస్సు కూడా బయటకు రాకుండా అడ్డుకున్నారు.
 
  సమైక్యవాదులంతా దీనికి సహకరించారు. జే ఏసీ ఉద్యోగులు ఆర్డీఓ కార్యాలయం ఎదురుగా ఆందోళన చేశారు. రాష్ట్ర విభజనను నిరసిస్తూ చీపురుపల్లిలో వైఎస్‌ఆర్ సీపీ నియోజకవర్గ సమన్వయకర్తలు మీసాల వరహాలనాయుడు, శనపతి శిమ్మినాయుడుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలను ముట్టడించి, మూసి వేయించారు. పట్టణంలోని తహశీల్దార్, ఎంపీడీఓ, సబ్ రిజిస్ట్రార్, సబ్‌ట్రెజరీ, బీఎస్‌ఎన్‌ఎల్ కార్యాలయాలతో పాటు స్టేట్‌బ్యాంకు, ఆంధ్రా బ్యాంకులను మూసి వేయించారు. ర్యాలీ నిర్వహించి, పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.   గజపతినగరం నియోజకవర్గ కేంద్రంలో కడుబండి సింహాచలమమ్మ ఆధ్వర్యంలో నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. 
 

Advertisement
Advertisement