Sakshi News home page

పాపం పసివాడు..!

Published Mon, May 1 2017 2:08 PM

పాపం పసివాడు..! - Sakshi

► రోజురోజుకు పెరిగిపోతున్న పొట్ట
► అల్లాడిపోతున్న తల్లిదండ్రులు

గూడెంకొత్తవీధి(పాడేరు):  బాబు పుట్టాడని ఎంతో ఆనందించిన ఆ తల్లిదండ్రులకు ఆ సంబరం ఎంతోకాలం నిలువలేదు. పుట్టిన మూడు నెలల తర్వాత ఆ బిడ్డకు అంతుచిక్కని వ్యాధి సోకడంతో  వారు తీవ్ర మనోవేదనకు గురయ్యారు. మండలంలోని మారుమూల గ్రామమైన కుంకంపూడికి చెందిన గెమ్మెలి బాలరాజు, లక్ష్మి దంపతులకు ఆరు నెలల కిందట మగబిడ్డ పుట్టాడు.  మూడు నెలల పాటు  ఎంతో ఆరోగ్యంతో ఉన్న ఆ బిడ్డ, ఆ తరువాత కడుపు ఉబ్బరంతో తీవ్రంగా బాధపడుతున్నాడు.

పాలుతాగినా, తాగకపోయినా పొట్ట రోజురోజుకు   పెరిగిపోతుండంతో దిక్కు తోచని స్థితిలో ఆ తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారు. అసలే పేదరికం, ఆ పై పుట్టిన బిడ్డకు ఆరోగ్యం సరిగా లేకపోవడంతో నరకయాతన పడుతున్నారు. ఇటీవల చింతపల్లి సీహెచ్‌సీకి తరలించారు. అక్కడ ప్రాథమిక వైద్యమందించి, నర్సీపట్నం ఏరియా ఆస్పత్రికి పంపారు. బాబుకు ఆపరేషన్‌ చేయాలని డాక్టర్లు తెలిపారు. అక్కడ  రెండు రోజులపాటు చిన్నారిని  ఆస్పత్రిలో ఉంచారు. తరువాత వైద్య సిబ్బంది పట్టించుకోకపోవడంతో చేసేదిలేక ఇంటికి చేరుకున్నారు.

బాబు పొట్ట   28 సెంటీమీటర్లు  పొంగిపోవడంతో వారు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మల, మూత్ర విసర్జన సక్రమంగా జరుగుతున్నప్పటికీ పొట్ట ఎందుకు ఉబ్బిపోతోందో తెలియక క్షోభ పడుతున్నారు. అంతుచిక్కిని వ్యాధితో బాధపడుతున్న తమ బిడ్డను ఆదుకోవాలని తల్లిదండ్రులు కోరుతున్నారు.

Advertisement
Advertisement