దా‘రుణం’! | Sakshi
Sakshi News home page

దా‘రుణం’!

Published Thu, May 28 2015 12:56 AM

A farmer loan waiver was remedied

రైతు రుణమాఫీ ఓ ప్రహసనంగా మారింది. ఇదిగో తీర్చేస్తున్నాను.. అదిగో మీ ఖాతాల్లో నగదు జమ.. అంటూ బాబు ఏడాది కాలంగా మాటల గారడీతో రైతుల్ని నమ్మించారు. బ్యాంకుల్లో తీసుకున్న రుణాలన్నీ బాబు తీర్చేస్తారనే నమ్మకంతో ఉన్న రైతులకు ఇప్పుడు రుణభారం పెరిగిపోతోంది. అవన్నీ వడ్డీ, అపరాధ వడ్డీతో కలిపి కొండంత అయ్యాయి. నేడు ఆ భారాన్ని మోయలేక, కొత్త అప్పులు పుట్టక ఖరీఫ్ పనులు ప్రారంభించలేని దుస్థితిలో రైతులు ఉన్నారు.
 
 సాక్షి ప్రతినిధి, గుంటూరు : జిల్లాలో 11,29,506 మంది రైతులు రూ.9,500 కోట్లను రుణంగా తీసుకున్నారు. వీటిలో సగం పంట రుణాలు. మరో సగం బంగారు వస్తువులపై రుణాలు ఉన్నాయి. ఇచ్చిన హామీ ఇచ్చినట్టుగా తీర్చితే ఈ రుణాలన్నీ మాఫీ కావాల్సిందే. అయితే సీఎం అయిన తరువాత చంద్రబాబునాయుడు అనేక కొర్రీలు వేశారు. ఎన్ని బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నా ఒక్క రుణాన్నే తీర్చుతానన్నారు. పంటను బట్టి రుణమాఫీ అమలులోకి తెచ్చారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా లేదని, వాయిదాల విధానంలో అప్పులు తీర్చుతానని మరో మెలిక పెట్టారు. మీ వద్ద డబ్బు ఉంటే ముందు రుణం తీర్చేసుకోండి, తర్వాత తాను రైతు ఖాతాల్లో జమ చేస్తానన్నారు. సంవత్సర కాలంలో రూ.845.29 కోట్లను 7,70,241 మంది రైతుల ఖాతాల్లో జమ చేశారు.
 
 మొదట విడత రూ.543.36 కోట్లను, రెండో విడతలో రూ.301.93 కోట్లను  జమ చేశారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన రూ.9,500 కోట్ల హామీలో పదిశాతంలోపు మొత్తాన్నే రైతుల ఖాతాల్లో జమ చేశారు. అర్హుల జాబితాలను రెవెన్యూ డివిజన్ కార్యాలయాల వద్ద రైతులకు అందుబాటులో ఉంచారు. అనేక మంది రైతుల పేర్లు ఆ జాబితాలో కనపడలేదు. వీటిని సరిచేసుకోవడానికి రైతులు రెవెన్యూ శాఖ ఉద్యోగులు, బ్యాంకుల చుట్టూ ప్రదక్షణలు చేశారు. రుణమాఫీకి తమకు అన్ని రకాలుగా అర్హతలు ఉన్నాయని, జాబితాలో తమ పేరెందుకు లేదని అధికారుల్ని రైతులు నిలదీసినా ప్రయోజనం లేకపోయింది. రుణాలకు సంబంధించిన ఫిర్యాదులపై రైతులు పెద్దగా స్పందించలేదు. మొత్తం 11 లక్షల రైతుల్లో 16 వేల మంది రైతులే ఫిర్యాదులను అందచేశారు. ఈ నెలాఖరులోపు మరో రెండు వేల ఫిర్యాదులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
 
 రైతును వెన్నాడుతున్న రుణం ..
  భూ సమీకరణలో భూములు కోల్పోతున్న రాజధాని రైతును మాత్రం ఆ భూమి తాలూకా రుణం వదిలిపెట్టడం లేదు. రూ.50 వేలకుపైగా రుణం తీసుకుంటే, ప్రభుత్వం ప్రకటించిన వన్‌టైమ్ సెటిల్‌మెంట్ మొత్తం రూ.50 వేలుపోను మిగిలిన మొత్తాన్ని రైతు చెల్లించాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇచ్చే కౌలు మొత్తం నుంచి మిగిలిన మొత్తాన్ని ఎలా తీర్చాలో అర్థం కాని దుస్థితిలో రాజధాని రైతు ఉన్నాడు. తొలి విడత 7,402 మంది రైతులకు రూ. 32.69 కోట్లు, రెండో విడత 620 మంది రైతులకు రూ. 11.09 కోట్లు, ఉద్యానవన పంటలను పండించే 9,129 మంది రైతులకు రూ. 37.89 కోట్లు, ఇచ్చారు. అయితే ఇక్కడి రైతుకు సాలీనా రూ.లక్ష వరకు కౌలు పొందారు. ఆ మొత్తంతో పోల్చితే ప్రభుత్వం ఇచ్చేది అరకొరే.  రైతుమిత్ర, కౌలురైతులు, జేఎల్‌జీ గ్రూపులకు ఇంతవరకు రుణమాఫీ కాలేదు.
 
 కొత్త రుణాలు దొరక్క..
 తీసుకున్న రుణాలు తీర్చకపోవడంతో బ్యాంకులు కొత్త రుణాలు ఇవ్వడం లేదు. మరో నెలరోజుల్లో ఖరీఫ్ సీజనుకు సంబంధించి మెట్టదుక్కులు, విత్తన సేకరణ వంటి పనుల్లో రైతు నిమగ్నం కావాల్సి ఉంది. దుక్కుదున్నేందుకు డీజిల్ ఖర్చులైనా ఇస్తేనే చేలో ట్రాక్టరు ఉంటుందని యజమాని చెబుతున్నాడు. పెద్ద రైతుల నుంచి విత్తనాన్ని అరువుకు కొనుగోలు చేసే యత్నంలో చిన్న రైతులున్నారు. మిగిలిన పనులకు ప్రైవేట్ వడ్డీ వ్యాపారుల నుంచి అప్పులు తీసుకునేయత్నంలో రైతులున్నారు.  
 
 ఒక్క రూపాయి మాఫీ అవలేదు..
 బ్యాంక్ ఆఫ్ ఇండియా నూతక్కి బ్రాంచిలో 2013లో వ్యవసాయం నిమిత్తం రుణం తీసుకున్నాను. ఎన్నికలకు ముందు  రుణమాఫీ చేస్తానంటే ఆ డబ్బు కట్టలేదు. ఎన్నికల తరువాత రూ.50 వేల లోపు రుణాలను ఒక్క విడతలోనే తీసేస్తానంటే, బ్యాంకులో వడ్డీ కూడా కట్టలేదు. మొదటి విడతలో ఒక్క రూపాయి కూడా నాకు రుణ మాఫీ కాలేదు.  ఇప్పటికే రూ.18 వేల వడ్డీ అయింది. రెండవ విడతలో కూడా రుణమాఫీ కాకపోతే, మరో రూ.7 వేలు అదనపు వడ్డీ భారం పడుతుంది.  రుణమాఫీ చేయకపోతే, పుస్తెలు తాకట్టు పెట్టి అప్పు తీర్చాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
 - పాటిబండ్ల గంగాధర్‌రావు, గుండిమెడ
 
 తడిసి మోపెడైంది..
 వడ్డేశ్వరం చైతన్య గ్రామీణ బ్యాంకులో బంగారం కుదువ పెట్టి రూ.50 వేలు తీసుకున్నాను. రుణమాఫీ చేస్తాం, డబ్బులు కట్టవద్దని పదే పదే ప్రభుత్వం ప్రకటనలు చేయడంతో వడ్డీ కూడా కట్టలేదు. అది ఇప్పుడు తడిసి మోపెడయింది. బ్యాంకు వారు మీ బంగారం వేలం వేస్తామంటూ నోటీసులు పంపించారు. ఈ మధ్య కాలంలో పేపర్ ప్రకటన కూడా ఇచ్చారంట. మరి చంద్రబాబునాయుడు గారు ఈ సారైనా రుణమాఫీ చేస్తాడో, రైతులను నట్టేట ముంచుతాడో చూడాల్సిందే. బ్యాంకులో రుణం కడదామంటే ఈ సంవత్సరం ఇప్పటం గ్రామంలో పంటలు కూడా పండలేదు. - హరినాథ్‌గౌడ్, ఇప్పటం  
 
 ప్రభుత్వాన్ని అడగమంటున్నారు..
 నేను స్థానిక ఆంధ్రాబ్యాంకులో భూమిని తనఖా పెట్టి రూ.50 వేలు రుణం తీసుకున్నా. దానికి  వడ్డీ రూ.18 వేలు అయింది. రుణమాఫీ వర్తించక పోవడంతో బ్యాంకు అధికారులను సంప్రదించా. మా కేమి తెలియదు, ప్రభుత్వాన్ని అడగండి అని సమాధానం చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు రుణమాఫీకి అన్ని కోట్లు ఇచ్చాను.. ఇన్ని కోట్లు ఇచ్చాను అంటూ చెబుతున్నారు. నాకైతే రుణమాఫీ వర్తించకపోవడంతో వడ్డీతోకలిసి అప్పు కొండంత అయింది.
 - నారపుశెట్టి శ్రీనివాసరావు, రైతు, రాజుపాలెం
 

Advertisement
Advertisement