వీధికుక్కలు ఉసురు తీశాయి | Sakshi
Sakshi News home page

వీధికుక్కలు ఉసురు తీశాయి

Published Fri, Sep 22 2017 12:51 AM

వీధికుక్కలు ఉసురు తీశాయి

శునకాల దాడిలో నాలుగేళ్ల చిన్నారి మృతి

గుంటూరు :  అభం శుభం తెలియని చిన్నారి జీవితాన్ని కుక్కలు చిదిమేశాయి. నిండా నాలుగేళ్లు  కూడా నిండని ఆ పసివాడి ప్రాణాలు తోడేశాయి. కుక్కల దాడిలో తీవ్రంగా గాయపడిన ఆ చిన్నారి ప్రాణాలు కోల్పోయాడు. ఈ దుర్ఘటన గుంటూరు నగర పరిధిలోని అడవితక్కెళ్లపాడు రాజీవ్‌గృహకల్ప సముదాయంలో గురువారం జరిగింది. రాజీవ్‌ గృహకల్ప మూడో బ్లాక్‌లో దూపాటి ఏసుబాబు, మల్లేశ్వరి నివసిస్తున్నారు. మల్లేశ్వరి నగరంలోని ఓ హోటల్లో పనిచేస్తుండగా.. ఏసుబాబు కూలి పనులకు వెళ్తుంటాడు.  వారికి ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు. కుమారుడు ప్రేమ్‌కుమార్‌(4) అడవితక్కెళ్లపాడులోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నాడు. గురువారం నుంచి పాఠశాలలకు దసరా సెలవులు ఇవ్వడంతో బాబు ఇంట్లోనే ఉన్నాడు. తల్లిదండ్రులు రోజూ లాగానే పనులకు వెళ్లారు.

కొనుక్కుందామని వెళ్లి
మ«ధ్యాహ్నాం రెండుగంటల ప్రాంతంలో చిన్నారి ప్రేమ్‌కుమార్‌ ఇంట్లోంచి బయటకు వచ్చాడు. రోడ్డుపక్కనే ఉన్న బడ్డీ కొట్లో ఏదో కొనుక్కుందామని అటుగా వెళ్తున్నాడు. అంతలోనే మూడు కుక్కలు వచ్చిపడ్డాయి. వాటిని చూసి చిన్నారి భయపడి పరిగెత్తేలోపే మీదికి దూకాయి. గొంతుభాగాన్ని పట్టుకుని ఈడ్చుకెళ్లాయి. బాలుడి ఏడ్పులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి కుక్కలను తరిమేందుకు ప్రయత్నించినా అవి వదల్లేదు. రాళ్లతో కొట్టినా బాలుడి గొంతు విడిచిపెట్టలేదు. చివరికి తీవ్రంగా గాయపరిచి వదిలేశాయి. అప్పటికే బాలుడు స్పృహలో లేడు.. బాలుడు చనిపోయాడని భావించిన స్థానికులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

వారు అక్కడకు చేరుకుని రక్తంముద్దగా మారిన బిడ్డను చూసి గుండెలు బాదుకుంటూ విలపించారు. ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే చిన్నారి మృతిచెందినట్లు వైద్యులు చెప్పడంతో బాలుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నగరపాలక సంస్థ కమిషనర్‌ అనూరాధ ఇతర అధికారులు సంఘటన స్థలానికి చేరుకుని చిన్నారి మృతదేహాన్ని పరిశీలించారు. నల్లపాడు పోలీసులు పంచనామా నిర్వహించారు.

Advertisement
Advertisement