హైమాస్ట్ లైట్లు...రెయిన్ ప్రూఫ్ టెంట్లు | Sakshi
Sakshi News home page

హైమాస్ట్ లైట్లు...రెయిన్ ప్రూఫ్ టెంట్లు

Published Fri, Jun 6 2014 9:51 AM

హైమాస్ట్ లైట్లు...రెయిన్ ప్రూఫ్ టెంట్లు

*చంద్రబాబు ప్రమాణానికి చకచకా ఏర్పాట్లు
గుంటూరు/విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు  ప్రమాణ స్వీకారానికి గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఎదుట వేదిక ఏర్పాట్ల పనులు చకచకా సాగుతున్నాయి. ఇప్పటికే ప్రాంగణంలో తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేశారు. ప్రమాణ స్వీకారం రాత్రి వేళ జరగనున్న క్రమంలో రెండు వేల హైమాస్ట్ లైట్లను ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. 480 అడుగుల వేదికను పూర్తిగా కవర్ చేసేలా ఐరన్ బారికేడ్లను నిర్మించారు. దాంతో పాటు రెయిన్ ప్రూఫ్ టెంట్లను హైదరాబాద్ నుంచి తెప్పించి ఏర్పాటు చేస్తున్నారు.

అలాగే హైదరాబాద్ నుంచి నడికుడి మీదుగా వచ్చే రైళ్లకు ప్రాంగణం సమీపంలోని నాగార్జుననగర్ వద్ద హాల్టింగ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. శుక్రవారం సాయంత్రానికి ప్రాంగణమంతా పూర్తి స్థాయిలో సిద్ధమవుతుందని పర్యవేక్షిస్తున్న ఉన్నతాధికారులు చెప్తున్నారు. సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బృందాలు ఈ పనులను స్వయంగా పరిశీలిస్తున్నాయి. 70 ఎకరాల ప్రాంగణంలో 50 ఎకరాల్లో వేదిక, బహిరంగ సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేసి మిగిలిన 20 ఎకరాలు పార్కింగ్‌కు కేటాయించారు.

తొలుత వీఐపీలకు, సాంస్కృతిక కార్యక్రమాలకు, ప్రధాన సభకు మూడు వేదికలు నిర్మించాలని నిర్ణయించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా  వీఐపీల వేదికను రద్దు చేసి కేవలం రెండు వేదికలనే నిర్మిస్తున్నారు. సమాచార, పౌర సంబంధాల శాఖ కమిషనర్ ఎం.దానకిషోర్, అర్  అండ్ బీ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యాంబాబు, కడప జిల్లా కలెక్టర్ కోన శశిధర్ సభా ప్రాంగణంలో జరుగుతున్న పనులను పర్యవేక్షించారు. గుంటూరు, కృష్ణా జిల్లాల ఉన్నతాధికారులతో సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించి, అవసరమైన ఆదేశాలు జారీచేశారు. డీఐజీ రామకృష్ణ, గుంటూరు రూరల్, అర్బన్ ఎస్‌పీలు సత్యనారాయణ, గోపీనాథ్‌లు బందోబస్తు, పార్కింగ్ ప్రాంతాలు, హెలిప్యాడ్‌ను పరిశీలించారు.

 ఐదు వేల మందికి వీఐపీ పాస్‌లు...
 చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమానికి మొత్తం 5,000 మంది వీఐపీలకు పాస్‌లు జారీ చేయాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా కలెక్టర్ సురేశ్‌కుమార్, గుంటూరు, కృష్ణా జిల్లాల టీడీపీ అధ్యక్షులు పత్తిపాటి పుల్లారావు, దేవినేని ఉమా మహేశ్వరరావు, ఎమ్మెల్సీ బాబూరాజేంద్రప్రసాద్, టీడీపీ రాష్ట్ర నేత మన్నవ సుబ్బారావుతో ప్రత్యేకంగా సమావేశమై వీఐపీల పాస్‌ల జారీ విషయమై చర్చించారు.

పార్టీ ఎంపీ మొదలుకొని మాజీ ఎమ్మెల్యే వరకు, పార్టీ ముఖ్య నేతలందరికీ వీఐపీ పాస్‌లు జారీ చేయాలని రెండు జిల్లాల పార్టీ అధ్యక్షులు కలెక్టర్‌ను కోరారు. పార్టీ అధ్యక్షులు సూచించిన వారికే జిల్లాల వారీగా పాస్‌లు జారీ చేయనున్నారు. ఇదిలావుంటే.. ప్రమాణ స్వీకార సమయంలో చంద్రబాబు కాకుండా వేదికపై 40 మందికి మాత్రమే అనుమతిస్తామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు. ప్రమాణ స్వీకార అనంతరమే మిగిలిన వారిని వేదికపైకి అనుమతిస్తామన్నారు.

 రాజ్‌నాథ్ పర్యటన ఖరారు...
 చంద్రబాబు ప్రమాణ స్వీకారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ హాజరుకానున్నారని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి మన్నవ సుబ్బారావు తెలిపారు. రాజ్‌నాథ్‌తో పాటు ముగ్గురు ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రుల పర్యటన ఖరారైందని, అలాగే  కేంద్రమంత్రులు కొంతమంది కార్యక్రమానికి వస్తున్నట్లు తమకు సమాచారం అందిందని తెలిపారు.
 
 సీఎం ప్రమాణస్వీకారం బందోబస్తుకు అదనంగా రూ.1.5 కోట్లు మంజూరు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆదివారం ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో అందుకు అవసరమైన బందోబస్తు ఏర్పాట్ల కోసం రూ.1.5 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో మంజూరు చేసిన దానికి ఇది అదనమని జీవోలో వివరించింది. ఈ నిధుల్ని పోలీసు సిబ్బంది డైట్ చార్జీలు, వాహనాల అద్దె, ఆహారం, మంచినీరు సరఫరా, నిఘా కోసం అద్దె కెమెరాలు సమకూర్చుకోవడంతో పాటు షామియానాల అద్దెకు వినియోగించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది.

Advertisement
Advertisement