కొండంత నష్టం | Sakshi
Sakshi News home page

కొండంత నష్టం

Published Tue, Feb 4 2014 1:16 AM

కొండంత నష్టం - Sakshi

  • దుర్గగుడికి లక్షలు ఎగ్గొడుతున్న కాంట్రాక్టర్లు
  •  కొమ్ముకాస్తున్న లీగల్ విభాగం సిబ్బంది
  •  భారీగా చేతులు మారుతున్న సొమ్ము
  •  పట్టించుకోని ఉన్నతాధికారులు
  •  ఇంద్రకీలాద్రిపై కాంట్రాక్టర్ల హవా నడుస్తోంది. వారికి అధికారులు, సిబ్బంది తొత్తులుగా మారి అమ్మవారి ఆదాయానికి లక్షల్లో నష్టం వస్తున్నా పట్టించుకోవడం లేదు. దేవస్థానానికి లక్షలాది రూపాయలు ఎలా ఎగ్గొట్టొచ్చో లీజెస్, లీగల్ విభాగాల సిబ్బందే చెబుతున్నారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే పలువురు కాంట్రాక్టర్లు అమ్మవారికి లక్షల రూపాయల నష్టం చేకూర్చగా.. తాజాగా మరో కేసు వెలుగుచూసింది.
     
    సాక్షి, విజయవాడ : గత ఏడాది చెప్పుల స్టాండ్‌కు జరిగిన వేలంపాటలో రూ.62 లక్షలకు టెండర్‌ను ఒక కాంట్రాక్టర్ దక్కించుకున్నారు. 2013 ఏప్రిల్ నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు చెప్పుల స్టాండ్ అద్దెకిచ్చారు. వేలంలో టెండర్ దక్కగానే సగం, ఆరు నెలలలోపు మిగిలిన సగం చెల్లించాల్సి ఉంది. తొలుత ఆ కాంట్రాక్టర్ రూ.32 లక్షలు చెల్లించారు. మిగతా సొమ్ము ఇంకా చెల్లించలేదు. వచ్చే నెల 31వ తేదీతో  కాంట్రాక్టు ముగుస్తుంది.

    వాస్తవానికి గత సెప్టెంబర్ నెలాఖారులోగా రూ.30 లక్షలు చెల్లించాల్సి ఉంది. కాంట్రాక్టు కాలపరిమితికి రెండు నెలలే వ్యవధే ఉండడంతో దేవస్థానానికి రూ.30 లక్షలు చెల్లించడానికి ఆ కాంట్రాక్టర్ సిద్ధంగా లేరని ప్రచారం జరుగుతోంది.  లీజెస్, లీగల్ విభాగంలోని అవినీతి అధికారులు, సిబ్బంది వల్లనే నాలుగు నెలలుగా లీజు చెల్లించకుండా కాంట్రాక్టర్ కొనసాగాడని బహిరంగ విమర్శలు వస్తున్నాయి.
     
    బ్యాంకు గ్యారెంటీ ఇవ్వని చీరల కాంట్రాక్టర్
     
    అమ్మవారికి భక్తులు సమర్పించే చీరలను తీసుకునేందుకు గత ఏడాది నవంబర్‌లో వేలం జరిగింది. నగరానికి చెందిన మరో కాంట్రాక్టర్ రూ.1.85 కోట్లకు కాంట్రాక్టు ద క్కించుకున్నారు. ఇందులో రూ.95 లక్షలు వెంటనే చెల్లించారు. మిగిలిన మొత్తానికి బ్యాంకు గ్యారెంటీ ఇవ్వాలని నిబంధనల్లో ఉంది. అయితే ఇప్పటికీ ఇవ్వలేదని సమాచారం. రూ.90 లక్షలకు బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకుండా ఉండేందుకు నెలకు రూ.2 లక్షలు లీజెస్, లీగల్ సెక్షన్ సిబ్బందికి మామూళ్లుగా ఇస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాజాగా క్లోక్ రూమ్‌కు టెండర్లు పిలిచారు. ఆ కాంట్రాక్టర్ అధికారులకు  బ్యాంకు గ్యారెంటీ ఇవ్వకుండా మామూళ్లు ఇచ్చి చేతులు దులుపుకొనే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది.
     
    దుకాణాల లీజు చెల్లించడం లేదు..
     
    గతంలో టోల్‌గేట్ కాంట్రాక్టర్ ఒకరు దేవస్థానానికి రూ.25 లక్షలు ఎగనామం పెట్టగా, క్లోక్‌రూమ్ కాంట్రాక్టు తీసుకున్న ఒకరు రూ.3.5 లక్షలు ఎగ్గొట్టారు. దే వస్థానం పరిధిలో 25 వరకు దుకాణాలున్నాయి. ఒక్కొక్కదానికి సుమారుగా రూ.50 వేలు నెలసరి అద్దె చెల్లించాల్సి ఉంది. అయితే ఆ అద్దె కూడా చెల్లించకుండా కోర్టులో కాంట్రాక్టర్లు కేసు వేశారు. కొన్ని దుకాణాల కాంట్రాక్టర్లు  నెలకు రూ.2 లక్షలకు సబ్‌లీజుకు  కూడా ఇచ్చేశారు. ఇందులో అధికార పార్టీకి చెందిన ఒక ప్రజాప్రతినిధికి కూడా దుకాణం ఉండడం విశేషం. ఒకవైపు నెలకు రెండు లక్షలు అప్పనంగా వస్తున్నా, మరోవైపు అమ్మవారి దేవస్థానానికి చెల్లించడానికి వీరి మనసొప్పడం లేదు. అధికారులు లీజు చెల్లించాలని నోటీసు ఇవ్వగానే కోర్టుకు వెళ్లడం కాంట్రాక్టర్లకు పరిపాటైంది.
     
    ఇంటిదొంగలున్నారు..
     
    దేవస్థానం లీగల్, లీజెస్ విభాగంలో పనిచేసే కొంతమంది సిబ్బంది కాంట్రాక్టర్లు నుంచి లక్షలు రూపాయలు లంచాలుగా తీసుకుని దేవస్థానానికి డబ్బు ఏ విధంగా ఎగ్గొట్టవచ్చో సలహాలు ఇస్తున్నారు. హైదరాబాద్‌లో ఏ న్యాయవాదిని సంప్రదించాలి, కేసు ఏ విధంగా వేయాలో సూచిస్తున్నారు. గతంలో కాంట్రాక్టర్లు వేసిన కేసుల వివరాలు, కోర్టు ఇచ్చిన తీర్పు పాఠం కూడా వీరే అందిస్తారని సీనియర్ కాంట్రాక్టర్లు చెబుతున్నారు. కోర్టు నుంచి ఉత్తర్వులు వచ్చిన తరువాత కాంట్రాక్టర్‌కు అనుకూలంగా వీరే నివేదికలు తయారుచేసి ఉన్నతాధికారులకు ఇస్తార ని సమాచారం. లీగల్ సెక్షన్‌ను సమూలంగా ప్రక్షాళన చేస్తే కాని అమ్మవారి ఆదాయం పెరగదు.
     
    చర్యలుంటాయి..
     
    నేను ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకున్న తరువాత చెప్పుల స్టాండ్ కాంట్రాక్టర్ బకాయి ఉన్నట్లు తెలుసుకుని అతడికి లీగల్ నోటీసు ఇచ్చి బకాయి రికవరీ చేయాలని సిబ్బందిని ఆదేశించా.  చీరల కాంట్రాక్టర్ నుంచి బ్యాంకు గ్యారెంటీ తీసుకోవాలని చెప్పాను. సకాలంలో లీజులు వసూలుచేయని వారిపై చర్యలు తీసుకుంటాం. 
    -వి.త్రినాథరావు, ఇన్‌చార్జి ఈవో
     

Advertisement
Advertisement