ఊపిరి తీసిన డ్రైనేజీ | Sakshi
Sakshi News home page

ఊపిరి తీసిన డ్రైనేజీ

Published Tue, Sep 3 2013 5:13 AM

a man died in drainage

 చాపాడు, న్యూస్‌లైన్: మురుగు కాలువలో పూడిక తీస్తూ అందులో ఇరుక్కుపోయి లక్షుమయ్య(27) అనే పారిశుద్ధ్య కార్మికుడు మృత్యువాతపడ్డాడు. మైదుకూరు మున్సిపాలిటిలో పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేసే లక్షుమయ్య రోజులాగే సోమవారం కూడా విధుల్లో భాగంగా  సాయిబాబా క్లాత్ మార్కెట్ వద్ద గల డ్రైనేజీలో పూడిక తొలగించడానికి సిద్ధమయ్యాడు. పూడిక తీస్తూ అందులో చిక్కుకుపోయాడు. బయట పడలేక, ఊపిరాడక డ్రేనేజీలోనే మృతి చెందాడు.
  ఓ వైపు సమైక్యాంధ్ర ఉద్యమంలో మైదుకూరు ప్రజానీకం ఉండగా, మరో వైపు లక్షుమయ్య మరణం పట్టణంలో దిగ్బ్రాంతిని కలిగించింది. వివరాలు ఇలా ఉన్నాయి..
 మైదుకూరు పట్టణ పరిధిలోని భూమాయపల్లెకు చెందిన చెరుకూరి లక్షుమయ్య  ఏడాదినర్రగా అరుంధతీనగర్‌లో నివాసం ఉంటూ, పారిశుద్ధ్య కార్మికుడిగా పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే సోమవారం కూడా విధుల్లోకి  తోటి కార్మికులతో కలిసి వచ్చారు. ఉదయం 9.30 గంటల ప్రాంతంలో సాయిబాబా క్లాత్ మార్కెట్ వద్ద   డ్రైనేజీ కాలువలో పనులు చేస్తున్నారు. కాలువలో ఒక పక్కన రెండు బండలను తొలగించి లోపల ఉండే పూడికను తొలగించేందుకు మరింత లోపలికి వెళ్లాడు. ప్రమాదవశాత్తు కాలువ లోపల చిక్కుకున్నాడు. ఎంతసేపైనా రాకపోవడంతో తోటి కార్మికులకు అనుమానం వచ్చి పిలిచారు. అయినా అతను పలుకలేదు. దీంతో వారు లోపలికి వెళ్లి చూశారు. అప్పటికే మురుగునీటిలో మునిగిపోయి ఉన్న లక్షుమయ్యను పట్టుకుని బయటికి తీసేందుకు ప్రయత్నించగా రాకపోవటంతో ఇరుక్కుపోయిన్నట్లు గుర్తించారు.
 
  అప్పటికే విషయం తెలుసుకున్న కమిషనర్ మల్లయ్యనాయుడు సంఘటనా స్థలానికి చేరుకున్నారు.  జేసీబీని తెప్పించి కాలువను పగులగొట్టగా లక్షుమయ్య చనిపోయి కన్పించాడు. ఈ విషయం తెలిసి మైదుకూరు ప్రజలందరూ పెద్ద ఎత్తున తరలివచ్చారు. లక్షుమయ్య శవాన్ని తోటి కార్మికులు, బంధువులు  సమైక్యాంధ్ర ఉద్యమం వద్దకు తీసుకువచ్చి న్యాయం చేయాలని కోరారు. పోలీసులు జోక్యం చేసుకుని మున్సిపల్ కమిషనర్‌తో చర్చలు జరిపి  బాధిత కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించారు. మృతుని కుటుంబానికి ఆర్థికసాయం, మూడు సెంట్ల స్థలం, కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పిస్తామని మున్సిపల్ కమిషనర్ చెప్పారు.

Advertisement
Advertisement