మృగాళ్ల కిరాతకం | Sakshi
Sakshi News home page

మృగాళ్ల కిరాతకం

Published Sun, Apr 5 2015 3:44 AM

మృగాళ్ల కిరాతకం - Sakshi

మైనరు బాలికను బంధించి అత్యాచారం
 
ప్రశాంత విశాఖ ఉలికిపడింది. వరుస అత్యాచార సంఘటనలతో కలవరపడింది. నెలరోజుల క్రితం హైదరాబాద్‌కు చెందిన ఓ యువతిని అత్యాచారం చేసిన సంఘటన మాసిపోకమునుపే మరో వైనం చోటుచేసుకుంది. ముగ్గురు మృగాళ్ల కిరాతకం శనివారం బయటపడింది.
 
 డాబాగార్డెన్స్:  ముగ్గురు కిరాతకులు విశాఖలో ఓ మైనరు బాలికను దారుణంగా బంధించి అత్యాచారం చేశారు. మూడు రోజులపాటు కాళ్లు చేతులూ కట్టేసి గదిలో బంధించి అమానవీయంగా వ్యవహరించారు. నగరంలో శనివారం ఈ సంఘటన సంచలనం రేకెత్తించింది. డీసీపీ త్రివిక్రమ వర్మ కథనం ప్రకారం వివరాలివి. హైదరాబాద్‌కు చెందిన 14ఏళ్ల బాలిక తునిలో తాతగారింట్లో ఉంటోంది. పదిరోజుల క్రితం అలిగి బయటకొచ్చేసింది. తిరుపతి రెలైక్కేసింది. అక్కడ తనకు తెలిసిన స్నేహితునితో కలిసి ఐదురోజుల తర్వాత  తుని తాతగారింటికి బయలు దేరింది. తీరా తుని చేరుకున్నాక ఇంటికి వెళ్లాలంటే బాలిక మనసంగీకరించలేదు. దీంతో తుని రైల్వే స్టేషన్లోనే తచ్చాడింది. ఇదే అదనుగా ఇద్దరు వ్యక్తులు ఆమె దగ్గరకు చేరారు. తాము ఇంటికి తీసుకు వెళ్తామంటూ నమ్మించారు.

వారి మాటలను విశ్వసించిన బాలిక వారి ద్విచక్ర వాహనం ఎక్కింది. వారు మాయమాటలతో విశాఖ తీసుకువచ్చారు. తాడివీధిలో ఓ ఇంటికి తీసుకు వెళ్లారు. అక్కడ గదిలో తాళ్లతో బంధించారు. వారికి మరో వ్యక్తి తోడయ్యాడు. ముగ్గురూ బాలికపై అమానవీయంగా అత్యాచారం చేశారు. ఆమె అరుపులు వినిపించకుండా టీవీ సౌండ్ పెంచేవారు. మూడు రోజుల తర్వాత బాధితురాలిని అమానుషంగా గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయారు. శనివారం ఉదయం ఆమె కేకలకు ఇరుగుపొరుగు వారు స్పందించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి బాధితురాలికి విముక్తి కలిగించారు. ఈ కేసులో ఫోన్ ఆధారంగా ప్రధాన నిందితుడు వీరబాబును వెంటనే పోలీసులు అరెస్టు చేయగలిగారు. మిగిలిన నిందితుల్ని కూడా పట్టుకుని తీరతామని డీసీపీ త్రివిక్రమవర్మ  విలేకరులకు చెప్పారు.
 
వరుస ఘటనలతో బెంబేలు..
 
 మార్చి 16న ఆనందపురం మండలం వేములవలసకు చెందిన ఎనిమిదో తరగతి చదువుతున్న 14గేళ్ల బాలికపై  పక్క ఇంట్లో ఉంటున్న పట్నాల ప్రసాద్ నేరుగా ఇంట్లోకి ప్రవేశించి బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించి అత్యాచారానికి యత్నించాడు. దీంతో భీతిల్లిన ఆ బాలిక కేకలు వేయడంతో పరిసర ప్రాంతాల వారు పరుగున రావడంతో నిందితుడు ప్రసాద్ పారిపోయాడు.
  
మార్చి 12న గృహిణిని వేధించిన వ్యక్తిని ఆరిలోవ పోలీసులు అరెస్టు చేశారు. ఆరిలోవలో భర్తతో నివాసముంటున్న ఓ మహిళ కొద్ది రోజుల కిందట ఆమె విజయనగరం జిల్లా సాలూరులోని పుట్టింటికి వెళ్లింది. అక్కడ భాస్కర్ అనే టైలర్‌కు జాకెట్టు కుట్టమని ఇచ్చింది. కుట్టిన జాకెట్టు ఇచ్చినప్పుడు ఆమె ఫోన్ నెంబరు తీసుకొని అప్పటి నుంచి ఫోన్ చేసి వేధించడంతో ఆరిలోవ పోలీసులకు ఫిర్యాదు చేసింది.  విచారణ అనంతరం భాస్కర్‌ను అరెస్టు చేశారు.

 గత నెల 24న కోటవీధికి చెందిన 15ఏళ్ల బాలికపై తెలుగుదేశం పార్టీ నాయకుడు మహ్మద్ సాధిక్ తండ్రి షేక్ ఫరీద్ షహనీసా తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీస్ కమిషనర్ అమిత్‌గార్గ్ వద్ద వాపోయింది. తక్షణం పోలీసులు చర్యలు చేపట్టి నిందితుడ్ని అరెస్టు చేశారు.

 నెల రోజులకిందట పెందుర్తిలో స్నేహితుడు సోదరికి వివాహానికై హైదరాబాద్ నుంచి విశాఖ వచ్చిన ఓ యువతిపై గ్యాంగ్ రేప్ చేసిన ఘటనలో నలుగురు నిందితుల్ని పట్టుకుని అరెస్టు చేశారు.ఇరవై రోజుల కిందట పెందుర్తి జుత్తాడలో ఎనిమిదేళ్ల బాలికపై లైంగిక దాడికి పాల్పడిన వ్యక్తిని అరెస్టు చేశారు.
 

Advertisement
Advertisement